భారత్ అదరహో.. | Sakshi
Sakshi News home page

భారత్ అదరహో..

Published Sun, Nov 22 2015 8:00 PM

భారత్ అదరహో..

క్వాంటన్ (మలేసియా): ఆసియా కప్ జూనియర్ హాకీ టోర్నమెంట్ తుది పోరులో భారత కుర్రాళ్లు అదరగొట్టారు.  ఆదివారం పాకిస్థాన్ తో జరిగిన ఫైనల్లో భారత హాకీ జట్టు టైటిల్ ను కైవసం చేసుకుంది. ఆద్యంతం ఏకపక్షంగా సాగిన మ్యాచ్ లో భారత్ జట్టు 6-2 తేడాతో పాకిస్థాన్ ను మట్టికరిపించింది. ఇందులో హర్మన్‌ప్రీత్ సింగ్ నాలుగు గోల్స్ చేసి భారత్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. హర్మన్ ప్రీత్ అందివచ్చిన అవకాశాన్ని వినియోగించుకుంటూ ఆట 10 వ, 15 వ, 30 వ, 53వ నిమిషాల్లో వరుసగా గోల్స్ నమోదు చేసి తన కెరీర్ లో అత్యుత్తమ గణాంకాలను నమోదు చేశాడు.

 

దీంతో పాటు మరో ఇద్దర భారత ఆటగాళ్లు అర్మన్ ఖురేషి (46 నిమిషంలో), మన్ ప్రీత్ సింగ్ (50 వ నిమిషంలో) లు గోల్స్ చేయడంతో భారత్ భారీ విజయం సాధించింది. ఆట అర్థభాగం ముగిసే సరికి భారత్ 3-1తో ముందంజలో పయనించింది. అటు తరువాత అదే ఊపును కడవరకూ కొనసాగించి భారత్ విజయం సొంతం చేసుకుంది. కాగా, పాకిస్థాన్ మాత్రం కనీసం పోరాడ కుండానే చేతులెత్తేసింది. కేవలం రెండు గోల్స్ మాత్రమే నమోదు చేసిన పాకిస్థాన్ ఘోర పరాజయాన్ని చవిచూసింది.  పాకిస్థాన్ ఆటగాళ్లలో మహ్మద్ యాకూబ్ (28వ నిమిషంలో), మహ్మద్ దిల్బార్ (68వ నిమిషంలో) గోల్స్ చేయడంతో పాక్ కు భారీ ఓటమి తప్పలేదు. ఓవరాల్ గా ఈ టోర్నీలో 13 గోల్స్ ను సాధించిన హర్మన్ ప్రీత్ భారత్ విజయాల్లో ముఖ్య పాత్ర పోషించాడు.

Advertisement
Advertisement