టీమిండియా ఆరేళ్ల తర్వాత తొలిసారి.. | Sakshi
Sakshi News home page

టీమిండియా ఆరేళ్ల తర్వాత తొలిసారి..

Published Thu, Jan 25 2018 7:17 PM

India took the field without a full-time spinner for the first time since 2012 - Sakshi

జొహన్నెస్‌బర్గ్‌: ఇటీవల ​కాలంలో భారత క్రికెట్‌ జట్టు పేస్‌ విభాగం బాగా బలపడిన సంగతి తెలిసిందే. గతంలో భారత జట్టు విజయాల్లో స‍్సిన్నర్లదే కీలక పాత్ర కాగా, ఇప్పుడు ఆ ట్రెండ్‌ కాస్తా పేస్‌ బౌలింగ్‌కు మారింది.  ఇది శుభ పరిణామమే అయినప్పటికీ కనీసం ఒక్క పుల్‌ టైమ్‌ స్పిన్నర్‌ లేకుండా బరిలోకి దిగిన సందర్బాలు  భారత క్రికెట్‌ చరిత్రలో చాలా అరుదనే చెప్పాలి. దక్షిణాఫ్రికాతో మూడు టెస్టుల సిరీస్‌లో భాగంగా ఆఖరి టెస్టులో టీమిండియా పూర్తి స్థాయి స్పిన్నర్‌ లేకుండా పోరుకు సిద్ధమైంది.  దాంతో భారత జట్టు వార్తల్లో నిలిచింది. ఇలా ఫుల్‌టైమ్‌ స్పిన్నర్‌ లేకుండా విదేశీ గడ్డపై టీమిండియా టెస్టు మ్యాచ్‌కు సిద్దం కావడం ఆరేళ్ల తర్వాత ఇదే తొలిసారి.

2012లో ఆస్ట్రేలియాతో పెర్త్‌లో జరిగిన టెస్టు మ్యాచ్‌లో ఎంఎస్‌ ధోని నేతృత్వంలోని టీమిండియా స్పెషలిస్టు స్పిన్నర్‌ లేకుండా పోరుకు సిద్దమైంది. ఆ తర్వాత ఇంతకాలానికి భారత జట్టు మరోసారి స్పిన్నర్‌ను తీసుకోకుండా సఫారీలతో టెస్టు మ్యాచ్‌ ఆడుతోంది. బుధవారం జొహన్నెస్‌బర్గ్‌లో ఆరంభమైన టెస్టు మ్యాచ్‌లో స్పిన్నర్‌ రవి చంద్రన్‌ అశ్విన్‌కు విశ్రాంతినిచ్చిన టీమిండియా.. పేసర్‌ భువనేశ్వర్‌ కుమార్‌ను తుది జట్టులోకి తీసుకుంది.  దాంతో నలుగురు స్పెషలిస్టు పేసర్లతో సఫారీలతో మ్యాచ్‌కు సిద్దమైనట్లైంది. అదే క్రమంలో ఆరేళ్ల క్రితం నాటి మ్యాచ్‌ను గుర్తు చేసింది. ఆనాటి ఆసీస్‌తో మ్యాచ్‌లో జహీర్‌ ఖాన్‌, ఇషాంత్‌ శర్మ, ఉమేశ్‌ యాదవ్‌, వినయ్‌ కుమార్‌లతో మ్యాచ్‌ ఆడింది. 1990 నుంచి చూస్తే స్పెషలిస్టు స్పిన్నర్‌ లేకుండా విదేశాల్లో భారత్‌ జట్టు టెస్టు మ్యాచ్‌ ఆడటం ఇది మూడోసారి మాత్రమే.

Advertisement
Advertisement