షరా... మామూలే! | Sakshi
Sakshi News home page

షరా... మామూలే!

Published Sun, Aug 17 2014 12:56 AM

షరా... మామూలే!

మళ్లీ అదే కథ... వేదిక మారినా రాత మారలేదు. భారత బ్యాట్స్‌మెన్ విఫలమైన వికెట్‌పై ఇంగ్లండ్ ఆటగాళ్లు చెలరేగిపోయారు. ఇంగ్లండ్ పేసర్లు నిప్పులు చెరిగిన పిచ్‌పై భారత సీమర్లు తేలిపోయారు. దీనికితోడు ఎప్పటిలాగే క్యాచ్‌లు వదిలేశారు. ఇలా అన్ని విభాగాల్లోనూ విఫలమైన జట్టు ఓ టెస్టు మ్యాచ్‌ను కాపాడుకోవాలని అనుకోవడం అత్యాశే. ఓవల్‌లోనూ ధోనిసేన చతికిలపడింది. ఇంగ్లండ్‌కు భారీ ఆధిక్యం అప్పగించింది. ఇక ఈ మ్యాచ్ ఎన్ని రోజుల్లో ముగుస్తుందనేదే ఆసక్తికరం.
 
ఐదో టెస్టు
విఫలమైన భారత బౌలర్లు
తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ 385/7
ప్రస్తుతం కుక్ సేన ఆధిక్యం 237
లండన్: బ్యాటింగ్‌లో నిలకడగా రాణించిన ఇంగ్లండ్ జట్టు.. ఐదో టెస్టులో భారీ స్కోరు దిశగా పయనిస్తోంది. కుక్ (183 బంతుల్లో 79; 9 ఫోర్లు), బ్యాలెన్స్ (117 బంతుల్లో 64; 13 ఫోర్లు), రూట్ (129 బంతుల్లో 92 బ్యాటింగ్; 9 ఫోర్లు, 1 సిక్సర్) చెలరేగడంతో రెండో రోజు శనివారం ఆతిథ్య జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 105 ఓవర్లలో 7 వికెట్లకు 385 పరుగులు చేసింది. రూట్‌తో పాటు జోర్డాన్ (19 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం ఇంగ్లండ్ 237 పరుగుల ఆధిక్యంలో ఉంది. బట్లర్ (73 బంతుల్లో 45; 9 ఫోర్లు) ఫర్వాలేదనిపించాడు. భారత బౌలర్లలో ఇషాంత్, ఆరోన్, అశ్విన్ తలా రెండు వికెట్లు తీశారు.
 
స్కోరు వివరాలు
భారత్ తొలి ఇన్నింగ్స్: 148 ఆలౌట్
 ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: కుక్ (సి) విజయ్ (బి) ఆరోన్ 79; రాబ్సన్ (బి) ఆరోన్ 37; బ్యాలెన్స్ (సి) పుజారా (బి) అశ్విన్ 64; బెల్ (సి) ధోని (బి) ఇషాంత్ 7; రూట్ బ్యాటింగ్ 92; అలీ (బి) అశ్విన్ 14; బట్లర్ (సి) అశ్విన్ (బి) ఇషాంత్ 45; వోక్స్ (సి) ధోని (బి) భువనేశ్వర్ 0; జోర్డాన్ బ్యాటింగ్ 19; ఎక్స్‌ట్రాలు: 28; మొత్తం: (105 ఓవర్లలో 7 వికెట్లకు) 385.
 వికెట్ల పతనం: 1-66; 2-191; 3-201; 4-204; 5-229; 6-309; 7-318
 బౌలింగ్: భువనేశ్వర్ 24-3-86-1; ఇషాంత్ 24-8-58-2; ఆరోన్ 25-1-111-2; బిన్నీ 12-0-58-0; అశ్విన్ 20-2-55-2
 
లండన్: బ్యాటింగ్‌లో నిలకడగా రాణించిన ఇంగ్లండ్ జట్టు.. ఐదో టెస్టులో భారీ స్కోరు దిశగా పయనిస్తోంది. కుక్ (183 బంతుల్లో 79; 9 ఫోర్లు), బ్యాలెన్స్ (117 బంతుల్లో 64; 13 ఫోర్లు), రూట్ (129 బంతుల్లో 92 బ్యాటింగ్; 9 ఫోర్లు, 1 సిక్సర్) చెలరేగడంతో రెండో రోజు శనివారం ఆతిథ్య జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 105 ఓవర్లలో 7 వికెట్లకు 385 పరుగులు చేసింది. రూట్‌తో పాటు జోర్డాన్ (19 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం ఇంగ్లండ్ 237 పరుగుల ఆధిక్యంలో ఉంది. బట్లర్ (73 బంతుల్లో 45; 9 ఫోర్లు) ఫర్వాలేదనిపించాడు. భారత బౌలర్లలో ఇషాంత్, ఆరోన్, అశ్విన్ తలా రెండు వికెట్లు తీశారు.
 
సెషన్-1 : ఆరంభంలోనే ఝలక్
62/0 ఓవర్‌నైట్ స్కోరుతో రెండో రోజు ఆట కొనసాగించిన ఇంగ్లండ్... రెండో ఓవర్‌లోనే రాబ్సన్ (37) వికెట్‌ను కోల్పోయింది. అయితే కుక్, బ్యాలెన్స్ సమయోచితంగా ఆడుతూ భారత బౌలర్ల సహనానికి పరీక్ష పెట్టారు. వికెట్ కూడా బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉండటంతో వీరిద్దరు సులువుగా పరుగులు చేస్తూ 31వ ఓవర్‌లో ఇంగ్లండ్‌ను 100 పరుగుల మైలురాయిని దాటించారు. సీమర్లు వికెట్లు తీయలేకపోవడంతో లంచ్‌కు కొద్ది ముందు అశ్విన్‌ను బరిలోకి దించారు. అయినా ఈ వ్యూహం ఫలించలేదు. స్పిన్‌ను తెలివిగా ఎదుర్కొన్న కుక్ 41వ ఓవర్‌లో అర్ధసెంచరీ పూర్తి చేశాడు.
ఓవర్లు: 26; పరుగులు: 86; వికెట్లు: 1
 

సెషన్-2 : 13 పరుగులకు 3 వికెట్లు
లంచ్ తర్వాత భారత్ పుంజుకునే అవకాశాన్ని ఫీల్డర్లు జారవిడిచారు. ఆరోన్ (50వ ఓవర్), అశ్విన్ (55వ ఓవర్) బౌలింగ్‌లో కుక్ ఇచ్చిన రెండు క్యాచ్‌లను విజయ్, రహానేలు నేలపాలు చేశారు. మరికొద్దిసేపటికే ఆరోన్ బౌలింగ్‌లోనే కుక్ ఇచ్చిన లో క్యాచ్‌ను ఈసారి విజయ్ నేర్పుగా ఒడిసిపట్టుకున్నాడు. కుక్, బ్యాలెన్స్ రెండో వికెట్‌కు 125 పరుగుల భాగస్వామ్యం జోడించారు. తర్వాత విజృంభించిన భారత బౌలర్లు చకచకా బ్యాలెన్స్, బెల్ (7)లను అవుట్ చేశారు. దీంతో ఇంగ్లండ్ 33 బంతుల వ్యవధిలో 13 పరుగుల తేడాతో మూడు కీలక వికెట్లు కోల్పోయింది. మొయిన్ అలీ (14) వెంటనే అవుటైనా... రూట్, బట్లర్ క్రమంగా ఇన్నింగ్స్‌ను నిర్మించారు.
ఓవర్లు: 28; పరుగులు: 98; వికెట్లు: 4
 
సెషన్-3 : రూట్ నిలకడ
టీ తర్వాత రూట్, బట్లర్ నెమ్మదిగా ఆడారు. అడపాదడపా బౌండరీలతో స్కోరును పెంచే ప్రయత్నం చేశారు. ధోని బౌలర్లను తరచూ మార్చినా ఈ జోడిని మాత్రం విడదీయలేకపోయారు. దాదాపు 19 ఓవర్లపాటు భారత బౌలర్లకు కొరకరాని కొయ్యగా తయారైన ఈ ద్వయాన్ని చివరకు ఇషాంత్ విడగొట్టాడు. మామూలుగా వచ్చిన బంతిని లెగ్‌సైడ్ ఆడిన బట్లర్ షార్ట్ మిడ్ వికెట్‌లో అశ్విన్ చేతికి చిక్కాడు. దీంతో రూట్, బట్లర్‌ల మధ్య ఆరో వికెట్‌కు నెలకొన్న 80 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ఆ తర్వాతి ఓవర్‌లోనే భువనేశ్వర్... వోక్స్ (0)ను అద్భుతమైన బంతితో డకౌట్ చేశాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన జోర్డాన్... రూట్‌కు చక్కని సహకారం అందించాడు. బౌలర్లు ఒత్తిడి పెంచినా ఏమాత్రం తడబాటు లేకుండా బ్యాటింగ్ చేశాడు. ఫలితంగా ఈ ఇద్దరు ఎనిమిదో వికెట్‌కు అజేయంగా 67 పరుగులు జోడించి మరో వికెట్ పడకుండా రోజు ముగించారు.
ఓవర్లు: 32; పరుగులు: 139; వికెట్లు: 2

Advertisement

తప్పక చదవండి

Advertisement