టపా..టపా..'సఫా 'రీ! | Sakshi
Sakshi News home page

టపా..టపా..'సఫా 'రీ!

Published Fri, Nov 27 2015 12:25 AM

టపా..టపా..'సఫా 'రీ!

సాధారణంగా బ్యాట్స్‌మెన్ పిచ్ మీద బ్యాటింగ్ చేస్తారు. కానీ జామ్‌తా మైదానంలో మాత్రం డ్యాన్స్ చేశారు. బంతి ఎటు పడి ఎటు తిరుగుతుందో తెలియదు... ఆడకపోతే అవుట్... అలా అని ఆడినా అవుటే..!
 
 మొహాలీలోనే స్పిన్నర్ల ప్రతాపానికి దిక్కుతోచని స్థితికి చేరిన దక్షిణాఫ్రికా... నాగ్‌పూర్‌లోనూ అదే స్థితిలో ఉంది.  అలవాటైన పరిస్థితుల్లో భారత్ కాస్త నయమే అనిపించినా... ప్రపంచ నంబర్‌వన్ జట్టు మాత్రం తేలిపోయింది.  కలలో కూడా ఊహించని విధంగా దిగ్గజాలతో నిండిన సఫారీ లైనప్ కేవలం 79 పరుగులకే చేతులెత్తేసింది.
 
 ఫలితం... టెస్టు సిరీస్‌లో భారత్ విజయానికి చేరువయింది. 310 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన సఫారీలు... టపటపా పడే వికెట్లను ఎలా కాపాడుకోవాలో తెలియక దిక్కుతోచని స్థితిలో 32 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయారు. ఇక అద్భుతం జరిగితే తప్ప శుక్రవారం భారత విజయం లాంఛనమే.
 
 మూడో టెస్టులో దక్షిణాఫ్రికా లక్ష్యం 310  ప్రస్తుతం 32/2
 తొలి ఇన్నింగ్స్‌లో 79 పరుగులకే కుప్పకూలిన ఆమ్లాసేన
 రెండో ఇన్నింగ్స్‌లో భారత్ 173 ఆలౌట్

 
 నాగ్‌పూర్: ఊహించినట్లుగానే మూడో టెస్టులో రెండో రోజే ఆట రక్తికట్టింది. టర్నింగ్ ట్రాక్‌పై బ్యాట్స్‌మెన్ మరోసారి తడబడ్డా... ఇరుజట్ల స్పిన్నర్లు దుమ్మురేపడంతో ఒకే రోజు 20 వికెట్లు నేలకూలాయి. దీంతో మ్యాచ్‌లో భారత్ విజయం వేట మొదలుపెట్టగా, స్పిన్‌ను అడ్డుకోలేక సఫారీలు ఓటమి అంచుకు చేరారు. ఓవరాల్‌గా 310 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో గురువారం బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో 14 ఓవర్లలో 2 వికెట్లకు 32 పరుగులు చేసింది. ఎల్గర్ (10 బ్యాటింగ్), ఆమ్లా (3 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. ఈ మ్యాచ్ గెలవాలంటే ప్రొటీస్ ఇంకా 278 పరుగులు చేయాలి. చేతిలో 8 వికెట్లు ఉన్నాయి.

మూడు రోజుల ఆట మిగిలి ఉంది. అంతకుముందు 11/2 ఓవర్‌నైట్ స్కోరుతో ఆట కొనసాగించిన దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 33.1 ఓవర్లలో 79 పరుగులకు కుప్పకూలింది. దీంతో భారత్‌కు 136 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం దక్కింది. డుమిని (65 బంతుల్లో 35; 1 ఫోర్, 2 సిక్సర్లు) టాప్ స్కోరర్. ఏడుగురు బ్యాట్స్‌మన్ సింగిల్ డిజిట్‌కు పరిమితమయ్యారు. అశ్విన్ 5, జడేజా 4 వికెట్లు తీశారు. తర్వాత భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 46.3 ఓవర్లలో 173 పరుగులకు ఆలౌటైంది. ధావన్ (78 బంతుల్లో 39; 6 ఫోర్లు), పుజారా (45 బంతుల్లో 31; 5 ఫోర్లు), రోహిత్ (39 బంతుల్లో 23; 1 ఫోర్, 1 సిక్స్) ఓ మోస్తరుగా ఆడారు. తాహిర్ 5, మోర్కెల్ 3 వికెట్లు పడగొట్టారు.
 
 79 దక్షిణాఫ్రికా తిరిగి క్రికెట్‌లోకి అడుగుపెట్టాక (1992) ఆ జట్టుకు టెస్టుల్లో ఇదే అత్యల్ప స్కోరు. 2006లో భారత్‌పైనే ఆ జట్టు 84కు ఆలౌటైంది. అంతకుముందు 1957లో దక్షిణాఫ్రికా ఇంగ్లండ్ చేతిలో 72 పరుగులకే ఆలౌటైంది.
 టెస్టుల్లో భారత్ ఓ ప్రత్యర్థిని ఒక ఇన్నింగ్స్‌లో ఇంత తక్కువ పరుగులకు ఆలౌట్ చేయడం ఇదే తొలిసారి.
 
 5 ఈ ఏడాది టెస్టుల్లో అశ్విన్ ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు తీయడం ఇది ఐదోసారి. ఓవరాల్‌గా 14వసారి. గతంలో కుంబ్లే ఒకే ఏడాదిలో ఆరుసార్లు ఈ ఘతన సాధించాడు.
 
 32 తొలి రెండు రోజుల్లో భారత్‌లో 32 వికెట్లు పడటం ఇదే తొలిసారి. 1951-52 సీజన్‌లో 27 వికెట్ల రికార్డు చెరిగిపోయింది.
 
 20 భారత్‌లో ఒకే రోజు టెస్టులో 20 వికెట్లు పడటం ఇది రెండోసారి మాత్రమే. 2004-05 సీజన్‌లో ముంబైలో భారత్, ఆస్ట్రేలియాల మ్యాచ్ మూడో రోజు 20 వికెట్లు పడ్డాయి.
 
 సెషన్-1 చకచకా వికెట్లు
 స్పిన్నర్లకు పిచ్ బాగా సహకరించడంతో తొలి బంతి నుంచే ప్రొటీస్ పరుగుల కోసం ఇబ్బందిపడింది. కేవలం గంటన్నరలోనే (24.1 ఓవర్లు) స్పిన్ త్రయం సఫారీలకు చెక్ పెట్టేసింది. అశ్విన్ మూడు బంతుల వ్యవధిలో ఎల్గర్ (7), ఆమ్లా (1)లను అవుట్ చేసి అద్భుతమైన ఆరంభాన్నిస్తే... జడేజా దాన్ని చక్కగా కొనసాగించాడు. డేంజర్ మ్యాన్ డివిలియర్స్‌ను రిటర్న్ క్యాచ్‌తో వెనక్కిపంపాడు. దీంతో ప్రొటీస్ స్కోరు 12/5గా మారింది. ఈ దశలో కోహ్లి, సాహా క్యాచ్‌లు మిస్ చేయడంతో డుమిని వేగంగా స్కోరు పెంచాడు. అయితే రెండో ఎండ్‌లో జడేజా మాత్రం తన ప్రభావాన్ని చూపెట్టాడు. స్వల్ప వ్యవధిలో డు ప్లెసిస్ (10), విలాస్ (1)లను అవుట్ చేశాడు. తర్వాత హార్మర్ (13) ధాటిగా ఆడే ప్రయత్నం చేసినా అశ్విన్ దెబ్బకు బోల్తా పడ్డాడు. జడేజా స్థానంలో బౌలింగ్‌కు వచ్చిన మిశ్రా... డుమినిని అవుట్ చేసి భారత్ శిబిరంలో ఆనందం నింపాడు. వెంటనే మోర్కెల్ కూడా అవుట్ కావడంతో ఇన్నింగ్స్‌కు తెరపడింది. తర్వాత రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత ఓపెనర్లు విజయ్ (5), ధావన్‌లు నెమ్మదిగా ఆడి లంచ్ వరకు వికెట్ పడకుండా జాగ్రత్త పడ్డారు.
 ఓవర్లు: 24.1; పరుగులు: 68; వికెట్లు: 8 (దక్షిణాఫ్రికా)
 ఓవర్లు: 4; పరుగులు: 7; వికెట్లు: 0 (భారత్)
 
 సెషన్-2 తాహిర్ మ్యాజిక్
 లంచ్ తర్వాత విజయ్ తొందరగా అవుటైనా.. ధావన్, పుజారాలు చక్కగా బ్యాటింగ్ చేశారు. ఓ ఎండ్‌లో పేసర్, మరో ఎండ్‌లో స్పిన్నర్‌ను కొనసాగించినా.. ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆడారు. సింగిల్స్‌తో స్ట్రయిక్‌ను రొటేట్ చేస్తూ చెత్త బంతులను బౌండరీకి తరలించారు. ఈ క్రమంలో భారత్ స్కోరు 50 పరుగులకు చేరింది. అయితే రెండో వికెట్‌కు 44 పరుగులు జోడించాక.. పుజారా అనూహ్యంగా డుమినికి వికెట్ సమర్పించుకున్నాడు. తర్వాత కోహ్లి నిలకడగా ఆడే ప్రయత్నం చేసినా.. తాహిర్ దెబ్బతీశాడు. కేవలం 11 బంతుల వ్యవధిలో ధావన్‌తో పాటు కోహ్లి, రహానే (9)లను అవుట్ చేశాడు. కోహ్లి, ధావన్ మూడో వికెట్‌కు 37 బంతుల్లో 45 పరుగులు జోడించారు. రోహిత్, సాహా (7) మరో వికెట్ పడకుండా జాగ్రత్తపడటంతో భారత్ 108/5 స్కోరుతో టీ విరామానికి వెళ్లింది.    ఓవర్లు: 27; పరుగులు: 101; వికెట్లు: 5
 
 సెషన్-3  లోయర్ ఆర్డర్ విఫలం
 టీ తర్వాత రోహిత్ నెమ్మదిగా ఆడాడు. లోయర్ ఆర్డర్ సహకారంతో భారత్ ఆధిక్యాన్ని 300 పరుగులకు చేర్చాడు. 72 నిమిషాల పాటు సాగిన ఈ సెషన్‌లో మరో 65 పరుగులు సమకూరాయి. సాహా, జడేజా (5), అశ్విన్ (7)లు తక్కువ స్కోరుకే వెనుదిరిగినా.. మిశ్రా (18 బంతుల్లో 14; 2 ఫోర్లు) ఉన్నంతసేపు వేగంగా ఆడాడు. ఓ భారీ సిక్సర్‌తో జోరు పెంచే ప్రయత్నం చేసిన రోహిత్‌ను మోర్కెల్ అవుట్ చేశాడు. దీంతో తొమ్మిదో వికెట్‌కు 41 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. చివర్లో మిశ్రా వికెట్‌ను తాహిర్ తీయడంతో ఇన్నింగ్స్ ముగిసింది. తర్వాత రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన దక్షిణాఫ్రికాను మళ్లీ అశ్విన్ ఇబ్బందిపెట్టాడు. ఇషాంత్‌తో కలిసి కొత్త బంతిని పంచుకున్న స్పిన్నర్ 8వ ఓవర్‌లో వాన్ జెల్ (5)ను అవుట్ చేశాడు. కొద్దిసేపటికే నైట్ వాచ్‌మన్ తాహిర్ (8) కూడా వెనుదిరిగడంతో ప్రొటీస్ రెండు వికెట్లు చేజార్చుకుని కష్టాల్లో పడింది.
 ఓవర్లు: 15.3; పరుగులు: 65; వికెట్లు: 5 (భారత్)
 
 స్కోరు వివరాలు
 భారత్ తొలి ఇన్నింగ్స్: 215 ఆలౌట్
 దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్: ఎల్గర్ (బి) అశ్విన్ 7; వాన్ జెల్ (సి) రహానే (బి) అశ్విన్ 0; తాహిర్ (బి) జడేజా 4; ఆమ్లా (సి) రహానే (బి) అశ్విన్ 1; డివిలియర్స్ (సి అండ్ బి) జడేజా 0; డు ప్లెసిస్ (బి) జడేజా 10; డుమిని ఎల్బీడబ్ల్యు (బి) మిశ్రా 35; విలాస్ (బి) జడేజా 1; హార్మర్ (బి) అశ్విన్ 13; రబడ నాటౌట్ 6; మోర్కెల్ (సి అండ్ బి) అశ్విన్ 1; ఎక్స్‌ట్రాలు: 1; మొత్తం: (33.1 ఓవర్లలో ఆలౌట్) 79.
 వికెట్ల పతనం: 1-4; 2-9; 3-11; 4-12; 5-12; 6-35; 7-47; 8-66; 9-76; 10-79.
 
 బౌలింగ్: ఇషాంత్ 2-1-4-0; అశ్విన్ 16.1-6-32-5; జడేజా 12-3-33-4; మిశ్రా 3-0-9-1.
 
 భారత్ రెండో ఇన్నింగ్స్: విజయ్ (సి) ఆమ్లా (బి) మోర్కెల్ 5; ధావన్ (సి) విలాస్ (బి) తాహిర్ 39; పుజారా (బి) డుమిని 31; కోహ్లి (సి) డు ప్లెసిస్ (బి) తాహిర్ 16; రహానే (సి) డుమిని (బి) తాహిర్ 9; రోహిత్ (సి) ఎల్గర్ (బి) మోర్కెల్ 23; సాహా (సి) ఆమ్లా (బి) తాహిర్ 7; జడేజా (బి) హార్మర్ 5; అశ్విన్ ఎల్బీడబ్ల్యు (బి) మోర్కెల్ 7; మిశ్రా (బి) తాహిర్ 14; ఇషాంత్ నాటౌట్ 1; ఎక్స్‌ట్రాలు: 16; మొత్తం: (46.3 ఓవర్లలో ఆలౌట్) 173.
 
 వికెట్ల పతనం: 1-8; 2-52; 3-97; 4-102; 5-108; 6-122; 7-128; 8-150; 9-171; 10-173.
 
 బౌలింగ్: మోర్కెల్ 10-5-19-3; హార్మర్ 18-3-64-1; రబడ 5-1-15-0; డుమిని 2-0-24-1; తాహిర్ 11.3-2-38-5.
 
 దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్: ఎల్గర్ బ్యాటింగ్ 10; వాన్ జెల్ (సి) రోహిత్ (బి) అశ్విన్ 5; తాహిర్ ఎల్బీడబ్ల్యు (బి) మిశ్రా 8; ఆమ్లా బ్యాటింగ్ 3; ఎక్స్‌ట్రాలు: 6; మొత్తం: (14 ఓవర్లలో 2 వికెట్లకు) 32.
 
 వికెట్ల పతనం: 1-17; 2-29.
 బౌలింగ్: ఇషాంత్ 3-1-6-0; అశ్విన్ 6-2-12-1; జడేజా 4-2-6-0; మిశ్రా 1-0-3-1
 

Advertisement
Advertisement