తొలి టీ20 వేదిక మారింది.. | Sakshi
Sakshi News home page

తొలి టీ20 వేదిక మారింది..

Published Thu, Nov 28 2019 10:59 AM

India vs West Indies 1st T20I Shifted To Hyderabad - Sakshi

న్యూఢిల్లీ:  భారత్‌-వెస్టిండీస్‌ జట్ల మధ్య వచ్చే నెలలో ఆరంభం కానున్న  మూడు టీ20ల సిరీస్‌కు సంబంధించి వేదికల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. ముందస్తు షెడ్యూల్‌ ప్రకారం తొలి టీ20 ముంబైలోని వాంఖేడ్‌ స్టేడియంలో జరగాల్సి ఉండగా, దాన్ని హైదరాబాద్‌ రాజీవ్‌ గాంధీ ఇంటర్నేషనల్‌ స్టేడియంకు మార్చారు. దాంతో తొలి టీ20కి హైదరాబాద్‌ వేదిక కానుంది. అదే సమయంలో ఆఖరి టీ20ని ముంబైలో నిర్వహించనున్నారు. డిసెంబర్‌ 6వ తేదీన హైదరాబాద్‌లో తొలి టీ20 జరుగనుండగా, డిసెంబర్‌ 8వ తేదీన తిరువనంతపురంలో రెండో టీ20 జరుగనుంది. ఇక మూడో టీ20 డిసెంబర్‌ 11వ తేదీన ముంబైలో జరపనున్నారు.

ఇటీవల వెస్టిండీస్‌తో సిరీస్‌కు సంబంధించి భారత జట్టును ప్రకటించిన సంగతి తెలిసిందే. విరాట్‌ కోహ్లి నేతృత్వంలోని జట్టును ప్రకటించారు. బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌కు విరామం తీసుకున్న కోహ్లి.. వెస్టిండీస్‌తో పొట్టి ఫార్మాట్‌ సిరీస్‌కు సిద్ధమయ్యాడు. ఇక చైనామన్‌ బౌలర్‌ కుల్దీప్‌ యాదవ్‌కు టి20ల్లో చోటిచ్చిన సెలక్టర్లు..  బంగ్లాతో టి20లు ఆడిన ఆల్‌రౌండర్‌ కృనాల్‌ పాండ్యా, పేసర్‌ ఖలీల్‌ అహ్మద్‌లకు ఉద్వాసన పలికారు. . వన్డే, టెస్టుల్లో  పంజా విసురుతున్న పేసర్‌ షమీని తాజాగా టి20లకు ఎంపిక చేశారు. ఈ సీమర్‌ పొట్టి మ్యాచ్‌ (అంతర్జాతీయ)ను చివరిసారిగా 2017లో ఆడాడు. స్పిన్నర్‌ రవీంద్ర జడేజాకు కూడా పొట్టి జట్టులో చోటిచ్చారు. బంగ్లాతో టి20ల్లో ఆకట్టుకున్న శివమ్‌ దూబేకు వన్డేల్లో స్థానమిచ్చారు. కాగా, శిఖర్‌ ధావన్‌కు గాయం కావడంతో సంజూ సామ్సన్‌కు మరో అవకాశం లభించింది. బంగ్లాదేశ్‌తో టి20 సిరీస్‌కు ఎంపికైనా మ్యాచ్‌ ఆడే అవకాశం దక్కని కేరళ వికెట్‌ కీపర్‌ బ్యాట్స్‌మన్‌ సామ్సన్‌కు చోటిచ్చారు. ముందుగా  జట్టులో ఎంపిక చేయకపోయినా ధావన్‌ వైదొలగడంతో సామ్సన్‌ను ఎంపిక చేయక తప్పేలేదు.

Advertisement
Advertisement