వరుణుడు కరుణిస్తేనే.. | Sakshi
Sakshi News home page

వరుణుడు కరుణిస్తేనే..

Published Sat, Nov 23 2013 1:03 AM

వరుణుడు కరుణిస్తేనే..

విశాఖపట్నం, న్యూస్‌లైన్: భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య జరగాల్సిన రెండో వన్డేకు వరుణుడు అడ్డంకిగా మారే అవకాశం ఉంది. హెలెన్ తుపాను కారణంగా నగరంలో విస్తృతంగా వర్షాలు కురుస్తుండడంతో ఆదివారంవైఎస్‌ఆర్ ఏసీఏ వీడీసీఏ స్టేడియంలో జరగాల్సిన ఈ మ్యాచ్ నిర్వహణపై అయోమయం నెలకొంది. మరోవైపు రెండు జట్ల ఆటగాళ్లు చిరు జల్లుల మధ్యనే శుక్రవారం విశాఖకు చేరుకున్నారు. గాయంతో సిరీస్‌కు దూరమైన క్రిస్ గేల్ కూడా జట్టుతో పాటే వచ్చాడు. వీరికి అభిమానులు ఘనస్వాగతం పలికారు. షెడ్యూల్ ప్రకారం నేడు జరగాల్సిన ప్రాక్టీస్ సెషన్స్ కూడా రద్దయ్యాయి.
 
 ఇప్పటికే పిచ్, అవుట్ ఫీల్డ్‌పై కవర్స్ వేసి ఉంచారు. మ్యాచ్ జరిగే ఆదివారం వర్షం కొంత తెరిపి ఇచ్చినా స్టేడియంలో పూర్తి స్థాయి డ్రైనేజి సిస్టమ్ ఉండడంతో ఇబ్బంది ఉండదని క్యురేటర్ మల్లన్న తెలిపారు. 2012లో న్యూజిలాండ్ జట్టుతో జరగాల్సిన టి20 మ్యాచ్ కూడా వర్షం కారణంగా రద్దయ్యింది. ఇక్కడ చివరిసారిగా విండీస్ 2011లో వన్డే ఆడింది. మరోవైపు ఈ మైదానంలో భారత్‌కు ఇప్పటివరకూ ఓటమి లేకపోవడం విశేషం. ఇదిలావుండగా సమైక్య వాదులు మ్యాచ్‌లో హడావుడి చేయకుండా అధికారులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. స్టేడియంలోనికి  బ్యానర్లను అనుమతించమని తెలిపారు.
 
 

Advertisement
Advertisement