Sakshi News home page

కోహ్లి మినహా.....

Published Fri, Apr 1 2016 11:50 PM

కోహ్లి  మినహా.....

క్రికెట్ జట్టుగా ఆడాల్సిన ఆట. వ్యక్తుల వల్ల కొన్ని మ్యాచ్‌లు గెలవచ్చు. కానీ జట్టుగా ఆడితే ప్రతి మ్యాచ్ గెలవొచ్చు. టి20 ప్రపంచకప్‌లో భారత్ జట్టులో ప్రధాన లోపం కూడా ఇదే. సచిన్ టెండూల్కర్ అంతటి దిగ్గజం కూడా ఎన్నో గొప్ప ఇన్నింగ్స్ ఆడినా జట్టు నుంచి సహకారం లేక చాలాసార్లు నిరాశ చెందాడు. ఇప్పుడు కోహ్లి విషయంలోనూ అదే జరిగింది. ఒంటిచేత్తో భారత జట్టు భారాన్ని మోశాడు. అయినా మిగిలిన సహచరులు విఫలమయ్యారు.

 ఓడింది రెండు మ్యాచ్‌లే కదా... సెమీఫైనల్‌కు వచ్చారు కదా... అనే సంతృప్తి మనలో చాలా మందికి ఉండొచ్చు. కానీ సెమీస్‌కు చేరడానికి కూడా ఓ యోధుడి పోరాటం మాత్రమే కారణమని గుర్తించాలి. నిజానికి సెమీస్‌లో బ్యాటింగ్ పిచ్‌పై మినహాయిస్తే... టోర్నీలో అన్నీ స్లో వికెట్లపై కోహ్లి మినహా ఏ ఒక్క బ్యాట్స్‌మన్ కూడా సరిగా ఆడలేదు. ఏమైనా... వ్యక్తి మీద ఆధారపడితే జరిగే నష్టానికి ఈ టి20 ప్రపంచకప్‌లో భారత ప్రదర్శన పెద్ద ఉదాహరణ.

  
ముంబై నుంచి సాక్షి క్రీడా ప్రతినిధి :- టి20 ప్రపంచకప్ కోసం భారత్‌కంటే గొప్పగా ఎవరూ సిద్ధం కాలేదు. టోర్నీకి ముందు ఏకంగా 11 వరుస మ్యాచ్‌లు ధోని సేన ఆడింది. అందులో ఒకటే పరాజయం. వరుసగా రెండు సిరీస్‌లు, ఒక టోర్నీ నెగ్గింది. దాంతో ఆశలు, అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. అదీ సొంతగడ్డపై ఆడుతుండటంతో... నిస్సందేహంగా 90 శాతంకు పైగా విశ్లేషకులు విజేత స్థానానికి భారత్‌కు ఓటు వేశారు. కానీ తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్ చేతిలో ఓటమితోనే ‘డేంజర్ బెల్’ మోగింది. భారత జట్టు తమ సొంతగడ్డపై ఇంత పేలవంగా, అదీ స్పిన్‌కు తలవంచడం అసలు ఎప్పుడు జరిగిందో ఎవరికీ గుర్తుండకపోవచ్చు.

 స్థాయికి తగ్గట్లుగా ఆడలేదు
చావో రేవో మ్యాచ్... సాధారణంగా ఏదో ఒక పరిస్థితుల్లో ఇలాంటి మ్యాచ్ ఆడాల్సి వస్తుంది. కానీ మనకు మాత్రం ప్రతీ మ్యాచ్ అలాగే మారిపోయింది. గెలిస్తేనే టోర్నీలో నిలవాల్సిన స్థితిలో ఒక్కో గండం దాటాం. ఈ మూడు మ్యాచ్‌లలోనూ  మన బ్యాటింగ్ వైఫల్యం స్పష్టంగా కనిపించింది. 90ల్లో సచిన్ టెండూల్కర్ ఏకవీరుడిలా పోరాటం చేయడం, మిగతా జట్టు విఫలమై ఓటమిని ఆహ్వానించడం రివాజుగా ఉండేది. ఇప్పుడు సరిగ్గా అదే తరహాలో కాకపోయినా విరాట్ కోహ్లికి, ఇతర బ్యాట్స్‌మెన్‌కు మధ్య  హస్తిమశకాంతరం ఉంటోంది. లీగ్ దశలో టాప్-5లో ఇతర నలుగురు కలిపి చేసిన పరుగులకంటే విరాట్ ఒక్కడే ఎక్కువ పరుగులు చేశాడు. సరిగ్గా చెప్పాలంటే పాక్‌తో, ఆసీస్‌తో మ్యాచ్‌లను కోహ్లి ఒంటి చేత్తో గెలిపించాడు. అతను తప్ప వాటిలో చెప్పుకోవడానికి ఏమీ లేదు.

పిచ్‌లు మరీ నిస్సారంగా హైవేల తరహాలో ఉండి, పూర్తిగా బ్యాటింగ్‌కు అనుకూలిస్తేనే మన బ్యాట్స్‌మెన్ పండగ చేసుకుంటారని, రికార్డులు కొల్లగొట్టగలరని ఈ ప్రదర్శనతో రుజువైంది. లేకపోతే సొంతగడ్డపై మన మెరుపు వీరులు ఇంతగా విఫలమవుతారని అసలు ఎవరైనా ఊహించగలరా. రోహిత్, ధావన్, రైనా... ముగ్గురు ఒకరితో ఒకరు పోటీ పడి పెవిలియన్‌కు చేరారు తప్ప సాధికారిక ఇన్నింగ్స్ ఆడలేదు. యువరాజ్ అయితే ఎప్పుడో కళ తప్పినా, తన గతాన్ని నమ్ముకొనే ఇన్ని రోజులుగా కొనసాగుతున్నట్లుగా అనిపించింది. బంగ్లాదేశ్ చేతకానితనం మనకు పరుగు తేడాతో గెలుపు అందించింది కానీ లేదంటే 145 పరుగులు చేసినప్పుడే కథ ముగిసేది.

ధోని వికెట్ల మధ్య పరుగు, ఫిట్‌నెస్‌ను చూపించి మరికొంత కాలం ఆడగలడనే నమ్మకాన్ని అభిమానుల్లో పెంచాడు. కానీ టి20 తరహాలో అతను ఓ గొప్ప ఇన్నింగ్స్ ఆడి ఎన్నాళ్లయింది. టోర్నీలో 70 బంతులు ఆడితే రెండంటే రెండు సిక్సర్ల కొట్టగలిగాడంటే అది ధోని శైలి ఏమాత్రం కాదు. టి20ల్లో దూకుడుగా ఆడగల బ్యాట్స్‌మెన్‌తో నిండిన లైనప్ ఒక్కసారి కూడా స్థాయికి తగ్గట్లుగా ఆడలేదు. జట్టు మొత్తం తరఫున 3 అర్ధ సెంచరీలు మాత్రమే నమోదు కాగా, అవన్నీ కోహ్లివే.  

 అంతంత మాత్రంగానే...
సొంతగడ్డపై ప్రపంచకప్‌లో భారత్ ప్రధాన ఆయుధం అశ్విన్ అవుతాడనే అంతా భావించారు. ఏ షేన్‌వార్న్, మురళీధరన్ తరహాలో జట్టు బౌలింగ్‌కు నాయకత్వం వహించి టోర్నీని గెలిపించగల సత్తా అతనిలో ఉందని నమ్మారు. అదేంటో 5 మ్యాచ్‌లలో కలిపి అతను 15 ఓవర్లు మాత్రమే వేశాడు. కెప్టెన్ ఎంతో నమ్ముకున్న బౌలర్ కూడా పూర్తి కోటా వేయకపోవడం ఆశ్చర్యం కలిగించింది. వెస్టిండీస్‌తో మ్యాచ్‌లో అప్పటికి 2 ఓవర్లలో 20 పరుగులు ఇచ్చినా... ఆఖరి ఓవర్లో అశ్విన్‌ను కాదని  కోహ్లితో బౌలింగ్ చేయించడం చూస్తే... అశ్విన్‌పై కెప్టెన్‌కు నమ్మకం పోయిందా అనిపించింది. ఆస్ట్రేలియా గడ్డపై మొదలు ఆసియా కప్ వరకు వరుస విజయాలు సాధించడంతో భారత బౌలింగ్ తిరుగు లేనిదిగా కనిపించింది. సీనియర్ నెహ్రా, జూనియర్ బుమ్రా కాంబినేషన్...

అశ్విన్, జడేజా జోడీతో ఇక జట్టులో మార్పులే అవసరం లేదని పరిస్థితి కొనసాగింది. కానీ ప్రపంచకప్ వచ్చేసరికి మాత్రం బౌలింగ్ సాదాసీదాగా కనిపించింది. పరుగులు నియంత్రించడంలో అప్పుడప్పుడు సఫలమైనా, వికెట్లు తీయడంలో మాత్రం అందరూ విఫలమయ్యారు. మ్యాచ్‌ను మ లుపు తిప్పే ఒక్క బౌలింగ్ ప్రదర్శన కూడా లేకపోయింది. నెహ్రా ఒక్కడే 6 లోపు ఎకానమీతో అత్యధికంగా 5 వికెట్లు పడగొట్టగా... మ్యాచ్‌లో ఒక్కసారి కూడా ఏ బౌలర్ కనీసం 3 వికెట్లు తీయలేకపోయారు. టోర్నీ ముందు వరకు తిరుగు లేకుండా ఉన్న బౌలింగ్ విభాగం, అసలు సమయంలో మాత్రం అంచనాలను అందుకోలేకపోయింది.

 వ్యూహం విఫలమైందా...
పాకిస్తాన్, ఆస్ట్రేలియాలతో మ్యాచ్‌లలో ధోని కొత్త ఆలోచనలు అద్భుతమైన ఫలితాలు ఇవ్వగా, బంగ్లాదేశ్‌తో అయితే చివరి మూడు బంతుల ద్వారా కెప్టెన్‌గా తన స్థాయిని తానే మరింత పెంచుకున్నాడు. కానీ వెస్టిండీస్‌తో పరాజయానికి అతను నోబాల్స్‌తో పాటు మంచును కారణంగా చూపించడం కాస్త ఆశ్చర్యం కలిగించింది. ఎందుకంటే వాంఖడే మైదానం ఆదినుంచి భారీ పరుగుల వేదిక, పైగా చిన్న గ్రౌండ్ కాబట్టి 200 పరుగుల స్కోరు కూడా అంత పెద్దదేం కాదనే విషయం ధోనికి కూడా తెలుసు. వెస్టిండీస్ పవర్ హిట్టర్ల గురించి అంచనా ఉంది. కాబట్టి మరిన్ని పరుగులు చేయాల్సింది. ఆసీస్‌తో పని చేసింది కదాని సింగిల్స్, డబుల్స్ వ్యూహంతో పరుగులు తీయడం బెడిసి కొట్టింది.

పరుగు చూడటానికి సరదాగానే ఉంది కానీ... ఇంకెప్పుడూ కొడతారు బాబూ అనేట్లుగా కూడా అనిపించింది. చేతిలో ఎనిమిది వికెట్ల ఉన్నప్పుడు మరిన్ని భారీ షాట్లు ఆడకుండా పరుగెత్తడం అప్పటికి ఏమీ కనిపించకపోయినా చివర్లో అదే ప్రభావం చూపించింది. ఒక సిక్సర్ రావాల్సిన బంతికి రెండుతోనే సరిపెట్టడంతో లెక్క మారిపోయింది. ధోని ఇప్పటికి భారత్‌కు చాలా విజయాలు అందించాడు. అతని మాటలను బట్టి చూస్తే ఇంకా కొనసాగి మున్ముందు కూడా గెలిపించవచ్చు కూడా. కానీ స్వదేశంలో 2011 వన్డే వరల్డ్‌కప్ తరహాలోనే మరో చిరస్మరణీయ ఇన్నింగ్స్‌తో అతను సొంతగడ్డపై మళ్లీ విశ్వ విజేతగా నిలుపుతాడని ఆశించిన అభిమానులకు మాత్రం టి20 ప్రపంచకప్ ఒక చేదు అనుభవం.

Advertisement

What’s your opinion

Advertisement