ఆఖరి అవకాశం | Sakshi
Sakshi News home page

ఆఖరి అవకాశం

Published Tue, Jul 14 2015 12:39 AM

ఆఖరి అవకాశం - Sakshi

సీనియర్లంతా విశ్రాంతి తీసుకోవడంతో కొత్త ఆటగాళ్లకు జింబాబ్వే వెళ్లే అవకాశం వచ్చింది. తొలి రెండు వన్డేల్లో రహానే, రాయుడు, బిన్నీ లాంటి రెగ్యులర్ క్రికెటర్లు రాణించారు గానీ... అవకాశాలు వచ్చినా ఉతప్ప, జాదవ్, తివారీ వినియోగించుకోలేకపోయారు. ఇక తమ సత్తా చూపడానికి వాళ్లకిది చివరి అవకాశం. నేడు జరిగే మూడో వన్డేలో రాణించకపోతే వీళ్లకి భారత జట్టు తలుపులు మూసుకుపోయే ప్రమాదం కూడా ఉంది.
 
* రిజర్వ్ క్రికెటర్లపై ఒత్తిడి  
* జింబాబ్వేతో భారత్ చివరి వన్డే నేడు
హరారే: తొలి రెండు వన్డేల్లో కలిపి ఉతప్ప, జాదవ్, మనోజ్ తివారీ చేసిన పరుగులు 58. ప్రత్యర్థి స్థాయిని బట్టి చూసినా, వీళ్లకు లభించిన అవకాశాన్ని దృష్టిలో పెట్టుకున్నా ఇది చాలా పేలవం. జట్టు రెండు మ్యాచ్‌ల్లోనూ గెలిచింది కాబట్టి పెద్దగా పట్టించుకోలేదుగానీ... ఒకవేళ ఓడిపోయి ఉంటే ఈ ప్రదర్శనకు వీళ్లని ఈ పాటికే మీడియా ఉతికి ఆరేసేది. ఎంతో కాలంగా అవకాశం కోసం ఎదురు చూస్తూ... ఇక వయసు అయిపోతుందనుకునే దశలో అవకాశం లభించినా దీనిని వినియోగించుకోలేకపోయారు.

ఇక నేడు జరిగే ఆఖరి వన్డేలోనూ విఫలమైతే ప్రస్తుతం ఉన్న పోటీలో మళ్లీ భారత జట్టు దుస్తుల్లో వీళ్లని చూడటం కూడా కష్టం. ఇలాంటి ఒత్తిడిలో రిజర్వ్‌లు ఉన్న నేపథ్యంలో జింబాబ్వేతో మూడో వన్డే మంగళవారం  జరగనుంది. ఈ మ్యాచ్‌లోనూ గెలిచి సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేయాలనేది రహానే సేన లక్ష్యం.
 
సందీప్‌కు అవకాశం ఇస్తారా?
భారత జట్టు బ్యాటింగ్ లైనప్‌లో ఒక్క మార్పు జరిగే అవకాశం ఉంది. రాయుడు గాయం కారణంగా అందుబాటులో లేకపోవడం వల్ల బెంచ్ మీద ఉన్న మనీష్ పాండే తుది జట్టులోకి వస్తాడు. ఓపెనర్లు రహానే, విజయ్ ఫామ్‌లోనే ఉన్నారు. సిరీస్‌లో టాప్ స్కోరర్ రాయుడు అందుబాటులో లేకపోవడం లోటే. మిడిలార్డర్‌లో ఉతప్ప, పాండే, తివారీ, జాదవ్‌లలో కనీసం ఇద్దరైనా నిలదొక్కుకుంటేనే భారీ స్కోరు వస్తుంది. ఆల్‌రౌండర్‌గా బిన్నీ తన సత్తా ఇప్పటికే చూపించాడు. అక్షర్ పటేల్ బౌలింగ్‌లో ఆకట్టుకున్నా బ్యాట్‌తో పెద్దగా చేసిందేమీ లేదు.

రెండు వన్డేల్లోనూ హర్భజన్ తన పాత్ర సమర్థంగానే పోషించాడు. పేసర్లలో భువనేశ్వర్ రెండు మ్యాచ్‌ల్లోనూ ఆకట్టుకున్నాడు. ధావల్ కులకర్ణి నుంచి ఆశించిన స్థాయిలో ప్రదర్శన లేదు. బెంచ్ మీద ఇద్దరు పేసర్లు అవకాశం కోసం ఎదురుచూస్తున్నారు. ధావల్ స్థానంలో ఈ ఇద్దరిలో ఒకరికి అవకాశం ఇవ్వొచ్చు. మోహిత్ ఇప్పటికే అనేక మ్యాచ్‌లు ఆడినందున... సందీప్ శర్మతో అరంగేట్రం చేయిస్తే బాగుంటుంది. మరి రహానే ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో చూడాలి.
 
జింబాబ్వే ప్రతిష్ట కోసం...
ఓవైపు బంగ్లాదేశ్ జట్టు అనూహ్యమైన ఆటతీరుతో అన్ని పెద్ద దేశాలపై విజయాలు సాధిస్తూ ప్రకంపనలు సృష్టిస్తోంది. మొన్నటిదాకా బంగ్లాదేశ్‌తో సమాన స్థాయిలో ఉన్న జింబాబ్వే మాత్రం ఎలాంటి ఎదుగుదల చూపించలేదు. భారత్‌లాంటి జట్టుపై ఒక్క మ్యాచ్ గెలిచినా జట్టులో కొత్త ఉత్సాహం వస్తుంది. కాబట్టి ఆఖరి మ్యాచ్‌లో అయినా గెలవాలని ఆ జట్టు ఆశిస్తోంది. తొలి వన్డేలో జట్టును విజయం అంచులదాకా తీసుకొచ్చిన కెప్టెన్ చిగుం బుర, రెండో వన్డేలో రాణించిన చిబాబా మినహా ఆ జట్టు బ్యాట్స్‌మెన్ ఎవరూ చెప్పుకోదగ్గ స్థాయిలో ఆడలేదు.

భారత్‌పై గెలవాలంటే జట్టులో కనీసం నలుగురు బ్యాట్స్‌మెన్ అయినా నిలదొక్కుకుని ఆడాలి. బౌలింగ్‌లో మాత్రం జింబాబ్వే నిలకడ చూపిస్తోంది. భారత్ 300 మార్కు గురించి కనీసం ఆలోచించలేకపోతోంది. కాబట్టి మరోసారి తమ బౌ లర్ల నుంచి జింబాబ్వే అలాంటి ప్రదర్శన ఆశిస్తోంది.

రాయుడు స్థానంలో సంజూ
జింబాబ్వే పర్యటనలో మిగిలిన వన్డే, రెండు టి20లకు రాయుడు దూరమయ్యాడు. రెండో వన్డేలో తొడ వెనకభాగంలో కండరాలు పట్టేయడంతో రాయుడును పరీక్షించిన వైద్యులు మూడు వారాలు విశ్రాంతి అవసరమని తేల్చారు. దీంతో తన స్థానంలో సంజు శామ్సన్‌ను సెలక్టర్లు ఎంపిక చేశారు.
 
జట్లు (అంచనా):
భారత్: రహానే (కెప్టెన్), విజయ్, తివారీ, మనీష్ పాండే, జాదవ్, ఉతప్ప, అక్షర్ పటేల్, బిన్నీ, హర్భజన్, భువనేశ్వర్, ధావల్/సందీప్.
జింబాబ్వే: చిగుంబురా (కెప్టెన్), సిబందా, చిబాబా, మసకద్జ, విలియమ్స్, రజా, ముతుంబమి, క్రీమర్, మద్జివా, టిరిపానో, విటోరి.
 
మ. గం. 12.30 నుంచి టెన్ క్రికెట్‌లో ప్రత్యక్ష ప్రసారం

Advertisement
Advertisement