చెస్ జట్టు కొత్త చరిత్ర | Sakshi
Sakshi News home page

చెస్ జట్టు కొత్త చరిత్ర

Published Fri, Aug 15 2014 1:19 AM

చెస్ జట్టు కొత్త చరిత్ర

- ఒలింపియాడ్‌లో తొలిసారి కాంస్యం
- పద్మిని రౌత్‌కు స్వర్ణం

ట్రోమ్‌సో (నార్వే): విశ్వనాథన్ ఆనంద్... పెంటేల హరికృష్ణ... సూర్యశేఖర గంగూలీలాంటి అగ్రశ్రేణి క్రీడాకారులు లేకపోయినా... ప్రతిష్టాత్మక చెస్ ఒలింపియాడ్‌లో భారత పురుషుల జట్టు అద్వితీయ ప్రదర్శన కనబరిచింది. ఈ మెగా ఈవెంట్ చరిత్రలో తొలిసారి కాంస్య పతకాన్ని సొంతం చేసుకుంది. పరిమార్జన్ నేగి (న్యూఢిల్లీ), కృష్ణన్ శశికిరణ్, సేతురామన్, అధిబన్ (తమిళనాడు), లలిత్ బాబు (ఆంధ్రప్రదేశ్)లతో కూడిన భారత బృందం ఓపెన్ విభాగంలో మూడో స్థానంలో నిలిచింది. గురువారం ముగిసిన ఈ పోటీల్లో నిర్ణీత 11 రౌండ్‌ల తర్వాత భారత జట్టు 17 పాయింట్లతో మరో మూడు జట్లతో ఉమ్మడిగా రెండో స్థానంలో నిలిచింది. అయితే టైబ్రేక్ పాయింట్ల ఆధారంగా ర్యాంక్‌ను వర్గీకరించగా భారత్‌కు మూడో స్థానం... హంగేరికి రెండో స్థానం దక్కాయి.

19 పాయింట్లతో చైనా స్వర్ణ పతకాన్ని సాధించింది. ఓపెన్ విభాగంలో మొత్తం 150 దేశాలు పాల్గొన్నాయి. చివరిదైన 11వ రౌండ్‌లో భారత్ 3.5-0.5తో ఉజ్బెకిస్థాన్ జట్టును ఓడించింది. పరిమార్జన్ నేగి 69 ఎత్తుల్లో ప్రపంచ మాజీ చాంపియన్ రుస్తుమ్ కాసిమ్‌జనోవ్‌ను ఓడించగా... సేతురామన్ 74 ఎత్తుల్లో ఫ్లిపోవ్‌పై; శశికిరణ్ 47 ఎత్తుల్లో జువయేవ్‌పై గెలిచారు. అధిబన్, వఖిదోవ్‌ల మధ్య గేమ్ 80 ఎత్తుల్లో ‘డ్రా’ అయింది. వ్యక్తిగత విభాగాల్లో బోర్డు-3 మీద ఆడిన శశికిరణ్ 7.5పాయింట్లతో రజత పతకాన్ని సాధించాడు.
 
మహిళల విభాగంలో భారత జట్టు 15 పాయింట్లతో 10వ స్థానంలో నిలిచింది. రుమేనియాతో జరిగిన చివరిదైన 11వ రౌండ్‌ను టీమిండియా 2-2తో ‘డ్రా’ చేసుకుంది. వ్యక్తిగత విభాగంలో బోర్డు-5 మీద ఆడిన ఒడిశా అమ్మాయి పద్మిని రౌత్ 7.5 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచి స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది.

Advertisement
Advertisement