అదే  జోరు... | Sakshi
Sakshi News home page

అదే  జోరు...

Published Mon, Dec 9 2019 2:46 AM

Indian Players Are Ahead In The South Asian Games - Sakshi

కఠ్మాండు (నేపాల్‌): తొలి రోజు మొదలైన పతకాల వేటను కొనసాగిస్తూ దక్షిణాసియా క్రీడల్లో భారత క్రీడాకారులు ముందుకు సాగుతున్నారు. ఈ క్రీడల ఎనిమిదో రోజు భారత్‌కు 22 స్వర్ణాలు, 10 రజతాలు, 6 కాంస్యాలతో కలిపి మొత్తం 38 పతకాలు లభించాయి. ప్రస్తుతం భారత్‌ 132 స్వర్ణాలు, 79 రజతాలు, 41 కాంస్యాలతో కలిపి మొత్తం 252 పతకాలతో ‘టాప్‌’లో ఉంది.   ఆదివారం టెన్నిస్‌ డబుల్స్‌ విభాగాల్లో భారత్‌ క్లీన్‌స్వీప్‌ చేసింది. మిక్స్‌డ్, పురుషుల, మహిళల డబుల్స్‌ విభాగాల్లో భారత్‌కే స్వర్ణాలు, రజతాలు  లభించాయి. పతకాలు నెగ్గిన టెన్నిస్‌ క్రీడాకారుల జాబితాలో తెలుగు రాష్ట్రాలకు చెందిన సౌజన్య బవిశెట్టి, కాల్వ భువన, శ్రావ్య శివాని (తెలంగాణ)... సాకేత్‌ మైనేని (ఆంధ్రప్రదేశ్‌), విష్ణువర్ధన్‌ (తెలంగాణ) ఉన్నారు.

మిక్స్‌డ్‌ డబుల్స్‌ ఫైనల్లో సౌజన్య బవిశెట్టి–శ్రీరామ్‌ బాలాజీ (భారత్‌) ద్వయం 6–3, 6–7 (4/7), 10–7తో ‘సూపర్‌ టైబ్రేక్‌’లో టాప్‌ సీడ్‌ జీవన్‌ నెడుంజెళియన్‌–ప్రార్థన తొంబారే (భారత్‌) జోడీని ఓడించింది. పురుషుల డబుల్స్‌ ఫైనల్లో సాకేత్‌ మైనేని–విష్ణువర్ధన్‌ (భారత్‌) జంట 7–5, 3–6, 10–5తో ‘సూపర్‌ టైబ్రేక్‌’లో శ్రీరామ్‌ బాలాజీ–జీవన్‌ నెడుంజెళియన్‌ ద్వయంపై నెగ్గింది. మహిళల డబుల్స్‌ ఫైనల్లో ప్రేరణ బాంబ్రీ–ప్రార్థన తొంబారే (భారత్‌) ద్వయం 6–3, 6–3తో కాల్వ భువన–చిలకలపూడి శ్రావ్య శివాని (భారత్‌) జంటను ఓడించింది.  కోచ్, భర్త అయిన సురేశ్‌ కృష్ణ శిక్షణలో రాటుదేలిన సౌజన్య నేడు జరిగే మహిళల సింగిల్స్‌లో పసిడి పతకం కోసం పోరాడనుంది. తెలంగాణకే చెందిన సామ సాత్వికతో సౌజన్య ఫైనల్లో ఆడుతుంది.

పురుషుల సింగిల్స్‌ పసిడి  పోరులో వైజాగ్‌ ప్లేయర్‌ సాకేత్‌ మైనేని భారత్‌కే చెందిన మనీశ్‌ సురేశ్‌ కుమార్‌తో తలపడతాడు.  రెజ్లింగ్‌లో భారత్‌కు నాలుగు స్వర్ణాలు లభించాయి. మహిళల 62 కేజీల విభాగంలో రియో ఒలింపిక్స్‌ కాంస్య పతక విజేత సాక్షి మలిక్‌... అన్షు (59 కేజీలు)... పురుషుల 61 కేజీల విభాగంలో రవీందర్‌... పవన్‌ కుమార్‌ (86 కేజీలు) బంగారు పతకాలు గెలిచారు. ఇక బాక్సింగ్‌లో మొత్తం 15 మంది భారత బాక్సర్లు ఫైనల్లోకి దూసుకెళ్లి ఏకంగా 15 స్వర్ణాలపై గురి పెట్టారు. ఫెన్సింగ్‌లో పురుషుల ఇపీ, సాబ్రే... మహిళల ఫాయిల్‌ టీమ్‌ ఈవెంట్స్‌లో భారత్‌కు పసిడి పతకాలు వచ్చాయి.

స్విమ్మింగ్‌లో ఏడు స్వర్ణాలు వచ్చాయి. జూడోలో భారత్‌ ‘కనకా’రంభం చేసింది. సుశీలా దేవి (48 కేజీలు), విజయ్‌ కుమార్‌ యాదవ్‌ (60 కేజీలు), జస్లీన్‌ సింగ్‌ సైని (66 కేజీలు), సుచిక తరియాల్‌ (57 కేజీలు), నిరుపమా దేవి (63 కేజీలు) పసిడి పతకాలు గెలిచారు. షూటింగ్‌లో భారత్‌ ఖాతాలో రెండు స్వర్ణాలు చేరాయి. 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ టీమ్‌ ఈవెంట్‌లో శ్రవణ్‌ కుమార్, రవీందర్‌ సింగ్, సుమీత్‌లతో కూడిన భారత బృందం స్వర్ణం నెగ్గింది. వ్యక్తిగత విభాగంలో శ్రవణ్‌ బంగారు పతకం సొంతం చేసుకోగా... రవీందర్‌సింగ్‌ కాంçస్యం గెలిచాడు.   

Advertisement
Advertisement