శ్యామ్ ‘పంచ్’ అదుర్స్ | Sakshi
Sakshi News home page

శ్యామ్ ‘పంచ్’ అదుర్స్

Published Tue, Apr 22 2014 12:18 AM

శ్యామ్ ‘పంచ్’ అదుర్స్

ప్రపంచ యూత్ బాక్సింగ్‌లో మెరిసిన వైజాగ్ బాక్సర్
 
 49 కేజీల విభాగంలో సెమీస్‌లోకి  
 పతకంతోపాటు యూత్ ఒలింపిక్స్ బెర్త్ ఖాయం


 సోఫియా (బల్గేరియా): ఏమాత్రం అంచనాలు లేకుండా ప్రపంచ యూత్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో బరిలోకి దిగిన ఆంధ్రప్రదేశ్ బాక్సర్ కాకర శ్యామ్ కుమార్ అద్భుతం సృష్టించాడు. రింగ్‌లోకి దిగడమే తరువాయి ప్రత్యర్థిపై పంచ్‌లు కురిపిస్తూ ఒక్కో అడ్డంకిని అధిగమిస్తూ ఈ వైజాగ్ కుర్రాడు సెమీఫైనల్లోకి దూసుకెళ్లాడు. 49 కేజీల విభాగంలో పోటీపడుతున్న 18 ఏళ్ల శ్యామ్ సోమవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో 2-1 తేడాతో యోల్ ఫినోల్ (వెనిజులా)పై విజయం సాధించాడు.

ఈ గెలుపుతో శ్యామ్‌కు కనీసం కాంస్య పతకం ఖాయమైంది. అంతేకాకుండా ఈ ఏడాది ఆగస్టులో చైనా ఆతిథ్యమిచ్చే యూత్ ఒలింపిక్స్ క్రీడలకూ అర్హత సాధించాడు. తొలి రౌండ్‌లో ఆధిపత్యం చలాయించిన శ్యామ్ రెండో రౌండ్‌ను కోల్పోయాడు. అయితే మూడో రౌండ్‌లో పుంజుకున్న శ్యామ్ తన ప్రత్యర్థికి పగ్గాలు వేసి విజయాన్ని ఖాయం చేసుకున్నాడు.

భారత బాక్సింగ్ సమాఖ్యపై అంతర్జాతీయ బాక్సింగ్ సంఘం (ఏఐబీఏ-ఐబా) నిషేధం కొనసాగుతున్న కారణంగా ఈ పోటీల్లో భారత బాక్సర్లు ‘ఐబా’ పతాకం కింద పోటీపడుతున్నారు. 52 కేజీల విభాగం క్వార్టర్స్‌లో భారత బాక్సర్ గౌరవ్ 0-3తో  పింగ్ (చైనా) చేతిలో ఓడిపోయాడు.
 
 నా జీవితంలోనే ఇది గొప్ప విజయం. గతంలో నేను మూడు అంతర్జాతీయ జూనియర్ టోర్నమెంట్లలో పాల్గొన్నాను. రెండు స్వర్ణాలు, ఒక రజతం సాధించాను. తాజా ప్రదర్శన సీనియర్ స్థాయిలో అడుగుపెట్టేందుకు దోహదపడుతుందని భావిస్తున్నాను.
 - కాకర శ్యామ్ కుమార్

Advertisement

తప్పక చదవండి

Advertisement