పాపం... విండీస్ | Sakshi
Sakshi News home page

పాపం... విండీస్

Published Thu, Oct 1 2015 12:01 AM

పాపం... విండీస్

తొలిసారిగా చాంపియన్స్ ట్రోఫీకి అనర్హత
2006 తర్వాత బంగ్లాదేశ్‌కు మళ్లీ అవకాశం
తాజా ర్యాంకింగ్స్ ఆధారంగా నిర్ణయం
 

దుబాయ్: ఓ రకంగా ఇది వెస్టిండీస్ క్రికెట్‌కు ఘోర అవమానమే. దశాబ్దాల పాటు ప్రపంచ క్రికెట్‌ను శాసించిన ఈ జట్టు మినీ ప్రపంచకప్‌గా భావించే చాంపియన్స్ ట్రోఫీకి అర్హత సాధించలేకపోయింది. ఈ ఏడాది సెప్టెంబర్ 30 వరకు ఐసీసీ అంతర్జాతీయ వన్డే క్రికెట్ ర్యాంకింగ్స్‌లో టాప్-8 స్థానాల్లో ఉన్న జట్లకే చాంపియన్స్ ట్రోఫీలో ఆడే అవకాశం దక్కుతుంది. తాజాగా బుధవారం ప్రకటించిన ర్యాంకుల్లో విండీస్ 9వ స్థానానికి పడిపోయింది. దీంతో 1998 నుంచి సాగుతున్న ఈ టోర్నీ చరిత్రలో తొలిసారిగా ఈ కరీబియన్ జట్టు ఆడలేకపోతోంది. ఆటగాళ్లలో అనైక్యత... బోర్డుతో విభేదాలు... ప్రదర్శనలో ఘోర వైఫల్యం... వెరసి 2004లో చాంపియన్‌గా నిలిచిన విండీస్ పరిస్థితి ప్రస్తుతం దారుణంగా మారింది.

మరోవైపు బంగ్లాదేశ్ జట్టు తమ అద్భుత ఆటతీరుకు ప్రతిఫలం దక్కించుకుంది. ఇటీవలి కాలంలో పాక్, భారత్, దక్షిణాఫ్రికా జట్లను తమ అద్భుత ఆటతీరుతో వణికించిన బంగ్లాదేశ్ 9వ ర్యాంకు నుంచి 7కు చేరి సత్తా చాటుకుంది. ఈ ర్యాంకుతో 2006 అనంతరం మరోసారి ట్రోఫీకి అర్హత సాధించింది. ఆసీస్‌లో జరిగిన ప్రపంచ కప్‌లోనూ ఈ జట్టు రాణించి క్వార్టర్స్‌కు చేరిన విషయం తెలిసిందే. దీంతో ర్యాంకింగ్‌ను మెరుగుపరుచుకుని సగర్వంగా మినీ ప్రపంచకప్‌లో అడుగుపెట్టింది.

 చాంపియన్స్ ట్రోఫీలో 15 మ్యాచ్‌లు: 2017, జూన్ 1 నుంచి 18 వరకు ఇంగ్లండ్‌లో జరిగే ఈ మెగా టోర్నీలో ఎనిమిది జట్లు రెండు గ్రూపులుగా విడిపోతాయి. ప్రతీ గ్రూపులో నాలుగు జట్లుంటాయి. ఒక్కో గ్రూపు నుంచి టాప్-2 జట్లు సెమీస్‌కు చేరుతాయి. మొత్తం 15 మ్యాచ్‌లు జరుగుతాయి. గ్రూపుల వివరాలు, షెడ్యూల్‌ను ఐసీసీ త్వరలో వెల్లడిస్తుంది.

 చాంపియన్స్ ట్రోఫీకి అర్హత సాధించిన జట్లు: 1. ఆస్ట్రేలియా (127 పాయిం ట్లు), 2. భారత్ (115), 3. దక్షిణాఫ్రికా (110), 4. న్యూజిలాండ్ (109), 5. శ్రీ లంక (103),6.ఇంగ్లండ్ (100), 7.బంగ్లాదేశ్ (96), 8.పాకిస్తాన్ (90 పాయింట్లు).
 

Advertisement

తప్పక చదవండి

Advertisement