ధనాధన్‌ ఆటకు అంతా సిద్ధం! | Sakshi
Sakshi News home page

'మారో' ప్రపంచం పిలిచింది!

Published Sat, Apr 7 2018 12:19 AM

 IPL 2018 be different from its earlier versions - Sakshi

పది వసంతాల క్రితం వేసవి అంటే భారత్‌లో ఆటలకు బ్రేక్‌... విశ్రాంతి అనో విరామం పేరుతోనో ఆటగాళ్లు మైదానానికి దూరమైతే అభిమానులు ‘ఇండోర్‌ గేమ్స్‌’కే పరిమితం! ఇలాంటి సమయంలో క్రికెట్‌ అభిమానులపై పన్నీటి జల్లు కురిసింది. చిన్నస్వామి స్టేడియంలో బ్రెండన్‌ మెకల్లమ్‌ సృష్టించిన పెద్ద తుఫాన్‌ క్రికెట్‌ వినోదానికి కొత్త చిరునామాను చూపించింది. టి20 క్రికెట్‌ అంటే ఆట మాత్రమే కాదు మరెంతో ఉందంటూ దూసుకొచ్చిన ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ ప్రపంచ క్రికెట్‌ను మార్చేసింది. కొడితే ఫోర్, లేదంటే సిక్సర్‌... బంతి గాల్లో లేచిందంటే చాలు నరాలు తెగే ఉద్వేగం, ఉత్కంఠ... ఒక్క బంతితో ఫలితాలు మారిపోయే మ్యాచ్‌లు...ఒక్కటి కూడా ప్రేక్షకులను నిరాశ పరచని మ్యాచ్‌లు...చీర్‌ గర్ల్స్‌లు, ఆపై చీర గర్ల్స్‌ కూడా వచ్చి బౌండరీ బయటనుంచి కూడా అభిమానుల ఉత్సాహాన్ని పెంచాయి. ఐపీఎల్‌ను మన నట్టింట్లోకి తీసుకు వచ్చేశాయి. 

దశాబ్దం దాటిపోయింది... ఐపీఎల్‌ సాధారణ లీగ్‌ స్థాయి నుంచి పైపైకి ఎదిగి అందనంత ఎత్తులో శిఖరాన నిలిచింది. ఇప్పుడు ఐపీఎల్‌ అంటే ఒక టోర్నీ మాత్రమే కాదు. ప్రపంచ క్రికెట్‌ అభిమానుల గుండె చప్పుడు. ఇందులో అవకాశం దక్కడం అంటే క్రికెటర్‌కు ఎవరెస్ట్‌ను ఎక్కినంత ఆనందం. అభిమానుల దృష్టిలో తమ దినచర్యలో ఒక భాగం. క్రికెటర్లు కోటీశ్వరులు కావడమే ఐపీఎల్‌ సాధించిన గెలుపు కాదు. ఏదో ఒక రూపంలో లీగ్‌లో భాగం కావాలని చూసేవారికి లెక్కే లేదు... లీగ్‌లో లెక్కల విలువ గురించి తెలిసి క్రికెటర్ల భుజం మీద బొమ్మగా వాలితే చాలు తమ వ్యాపారం వర్ధిల్లుతుందని భావించి లైన్‌లో నిలబడే కార్పొరేట్ల జాబితాకు పరిమితే లేదు. ధనాధన్‌ ఫటాఫట్‌ బాదుడు... మార్‌ మార్‌ మెరుపులు చూడమంటూ ఐపీఎల్‌ ఇస్తున్న పిలుపుకు వచ్చే 51 రోజులు మనందరం దాసోహం అవడం మాత్రం ఖాయం.   

ముంబై: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ పదకొండో సీజన్‌ సంబరాలకు రంగం సిద్ధమైంది. నేడు ఈ మెగా టోర్నీకి తెర లేవనుంది. వాంఖెడే స్టేడియంలో జరిగే తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ముంబై ఇండియన్స్‌తో మాజీ చాంపియన్‌ చెన్నై సూపర్‌ కింగ్స్‌ తలపడుతుంది. మే 27న ఇదే మైదానంలో ఫైనల్‌ జరుగుతుంది. ఎప్పటిలాగే ఎనిమిది జట్లు బరిలోకి దిగుతున్నాయి. నిషేధం కారణంగా రెండు సీజన్ల పాటు లీగ్‌కు దూరమైన చెన్నై, రాజస్తాన్‌ జట్లు పునరాగమనం చేస్తున్నాయి. పదేళ్లు ముగిసిన తర్వాత ఆటగాళ్ల ఎంపిక కోసం ఈ ఏడాది పెద్ద ఎత్తున వేలం జరిగింది. కొద్ది మంది స్టార్లు మినహా ఎక్కువ సంఖ్యలో ఆటగాళ్లు ఈ సారి కొత్త జట్ల తరఫున బరిలోకి దిగనున్నారు. పదేళ్ళుగా ఫలానా క్రికెటర్‌ అంటే ఆ జట్టు అంటూ ఐపీఎల్‌ అభిమానుల మనసులో ముద్రించుకుపోయిన అనేక మందిని ఈసారి వారంతా వేర్వేరు జెర్సీలో చూడబోతుండటం కూడా మరో విశేషం. మూడు సార్లు విజేతగా నిలిచిన ముంబై మరోసారి జయకేతనం ఎగురవేస్తుందా? ధోని మళ్లీ తన టీమ్‌ను గెలుపు దిశగా నడిపించగలడా? ఢిల్లీ, పంజాబ్‌లకు ఈ సారైనా చాన్స్‌ ఉందా? వార్నర్‌ లేని రైజర్స్, కొత్త కెప్టెన్‌తో కోల్‌కతా, రహానే నేతృత్వంలో రాజస్థాన్‌ల అదృష్టం మారుతుందా? అన్నింటికి మించి 2008 నుంచి జట్టు మారని ఒకే ఒక్కడు విరాట్‌ కోహ్లి ఈ సారైనా కప్‌ను ముద్దాడగలడా అనే ప్రశ్నలకు నేటి నుంచి సమాధానాలు వెతుక్కోవచ్చు.

►ఐపీఎల్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడు సురేశ్‌ రైనా. 161 మ్యాచ్‌లలో అతను 139.09 స్ట్రైక్‌రేట్‌తో 4540 పరుగులు సాధించాడు. ఇందులో 1 సెంచరీ, 31 అర్ధసెంచరీలు ఉన్నాయి. తర్వాతి స్థానాల్లో కోహ్లి (4418), రోహిత్‌ శర్మ (4207) నిలిచారు.  

►ఐపీఎల్‌లో అత్యధిక విజయాలు సాధించిన జట్టు ముంబై ఇండియన్స్‌. 157 మ్యాచ్‌లలో ఆ జట్టు  91 గెలిచి 65 ఓడింది. రెండో స్థానంలో ఉన్న చెన్నై 132 మ్యాచ్‌లలో 79 గెలిచి 51 ఓడింది.  
 

Advertisement

తప్పక చదవండి

Advertisement