స్మిత్, వార్నర్ లేకున్నా నష్టం లేదు! | Sakshi
Sakshi News home page

స్మిత్, వార్నర్ లేకున్నా నష్టం లేదు!

Published Fri, Mar 30 2018 9:37 AM

IPL 2018 Will Not Effects Due To Smith And Warner, Says Parthiv Patel - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ఆస్ట్రేలియా క్రికెటర్లు స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్‌లు బాల్ ట్యాంపరింగ్‌కు పాల్పడటం దురదృష్టకరమని భారత క్రికెటర్ పార్థీవ్ పటేల్ అన్నాడు. ఐపీఎల్‌ నుంచి ఈ ఇద్దరు క్రికెటర్లపై వేటు అనేది టోర్నీపై ఎలాంటి ప్రభావం చూపించదని, ఎంతో మంది నాణ్యమైన క్రికెటర్లున్నాయరని అభిప్రాయపడ్డాడు. ఐపీఎల్ అనేది బిగ్ బ్రాండ్ అని అందులో కేవలం ఇద్దరు క్రికెటర్లు ఆడకపోతే వచ్చే నష్టమేం లేదన్నాడు. ఈ సీజన్ కోసం జరిగిన వేలంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంచైజీ పార్థీవ్ పటేల్‌ను రూ.1.7 కోట్లకు తీసుకున్న విషయం తెలిసిందే.

'ఇలాంటి ఘటనలు మరిన్ని జరిగినా ఐపీఎల్‌కు ఎలాంటి ఢోకా ఉండదు. ఈ మెగా టోర్నీపై ప్రభావం చూపించదు. ఐపీఎల్ కోసం ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నాను. సాధ్యమైనంత వరకు జట్టు ప్రయోజనాల కోసం శాయశక్తులా కృషి చేస్తాను. అంతకంటే ముఖ్యంగా భారత జట్టులో వికెట్ కీపర్లకు చాలా పోటీ ఉంది. ఓ వైపు దినేశ్ కార్తీక్ కీలక ఇన్నింగ్స్ ఆడితే మరోవైపు దేశవాలీలో వృద్ధిమాన్ సాహా రాణిస్తున్నాడు. జట్టులో చోటు దక్కాలంటే తీవ్రంగా శ్రమించాల్సిందే. ఇతర దేశాల జట్లతో పోల్చితే భారత జట్టులో కీపర్‌గా స్థానం దక్కించుకోవడం చాలా కష్టమని' పార్థీవ్ వివరించాడు. 

కాగా, బాల్ ట్యాంపరింగ్ వివాదం కారణంగా ఆస్ట్రేలియా క్రికెటర్లు స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్‌లపై క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) ఏడాదిపాటు నిషేధం విధించిన విషయం తెలిసిందే. సీఏ నిర్ణయం అనంతరం ఐపీఎల్‌లోనూ ఈ సీజన్‌ నుంచి స్మిత్, వార్నర్‌లను నిషేధిస్తున్నామని, వేరే క్రికెటర్లను తీసుకోవచ్చునని నిర్వాహకులు వెల్లడించారు. దీంతో రాజస్థాన్ రాయల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు స్మిత్, వార్నర్ స్థానాలను మరో ఆటగాడితో భర్తీ చేయాలని భావిస్తున్నాయి.

Advertisement
Advertisement