సీఎస్‌కే ఖాతాలో రెండో విజయం | Sakshi
Sakshi News home page

సీఎస్‌కే ఖాతాలో రెండో విజయం

Published Tue, Mar 26 2019 11:43 PM

IPL 2019 Csk Won By 6 Wickets Against Delhi capitals - Sakshi

న్యూ ఢిల్లీ: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌)-2019లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ రెండో విజయాన్ని నమోదు చేసింది. మంగళవారం ఫిరోజ్‌షాకోట్ల మైదానంలో ఢిల్లీ క్యాపిట​ల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆరు వికెట్ల తేడాతో జయభేరి మోగించింది. ఢిల్లీ నిర్దేశించిన 148 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సీఎస్‌కే.. 19.4 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టపోయి లక్ష్యాన్ని పూర్తి చేసింది. మొదట వాట్సన్‌(44) మెరుపులు మెరిపించగా.. రైనా(30), కేదార్‌ జాదవ్‌(27)లు తమ వంతు బాధ్యత పోషించారు. సీఎస్‌కే సారథి ఎంఎస్‌ ధోని(32 నాటౌట్‌) చివరి వరకు ఉండి జట్టుకు విజయాన్ని అందించాడు. ఢిల్లీ బౌలర్లలో మిశ్రా రెండు వికెట్లు పడగొట్టగా, ఇషాంత్‌ ఒక్క వికెట్‌ తీశాడు. 

అంతకముందు టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న ఢిల్లీని చెన్నై బౌలర్లు కట్టడి చేయడంతో ఆ జట్టు సాధారణ స్కోరుకే పరిమితమైంది. ఓపెనర్‌ పృథ్వీ షా(24; 16 బంతుల్లో 5 ఫోర్లు) ధాటిగా బ్యాటింగ్‌ చేసి పెవిలియన్‌ చేరగా, శిఖర్‌ ధావన్‌(51; 47 బంతుల్లో 7 ఫోర్లు) హాఫ్‌ సెంచరీతో ఆకట్టుకున్నాడు. ఈ ఇద్దరి తర్వాత రిషభ్‌ పంత్‌(25;13 బంతుల్లో  2 ఫోర్లు, 1 సిక్స్‌), శ్రేయస్‌ అయ్యర్‌(18; 20 బంతుల్లో 1 సిక్స్‌)లు ఫర్వాలేదనిపించారు.

ఆది నుంచి చెన్నై కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడంతో ఢిల్లీ పరుగులు చేయడానికి ఆపసోపాలు పడింది.  ధావన్‌ హాఫ్‌ సెంచరీ సాధించినప్పటికీ భారీ షాట్లు కొట్టడంలో తడబడ్డాడు. చివరికి అర్థ శతకం సాధించిన ధావన్.. బ్రేవో బౌలింగ్‌లో ఔటయ్యాడు. చివర్లో రాహుల్‌ తెవాతియా(11 నాటౌట్‌), అక్షర్‌ పటేల్‌(9 నాటౌట్‌)లు తలో బౌండరీ సాధించడంతో ఢిల్లీ నిర్ణీత ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. చెన్నై బౌలర్లలో డ్వేన్‌ బ్రేవో మూడు వికెట్లు సాధించగా, దీపక్‌ చాహర్‌, రవీంద్ర జడేజా, ఇమ్రాన్‌ తాహీర్‌లకు తలో వికెట్‌ దక్కింది.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement