కరోనా ఎఫెక్ట్‌: ఐపీఎల్‌-2020 రద్దు? | 'IPL 2020' Postponed indefinitely After Extension of Lockdown, Says BCCI Official - Sakshi
Sakshi News home page

కరోనా ఎఫెక్ట్‌: ఐపీఎల్‌-2020 రద్దు?

Published Wed, Apr 15 2020 2:50 PM

IPL 2020 Has Now Been Postponed Indefinitely Says BCCI Official - Sakshi

న్యూఢిల్లీ: దేశంలో లాక్‌డౌన్‌ పొడిగింపుతో ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌)-2020 నిరవధికంగా వాయిదా వేసినట్లు బీసీసీఐకి చెందిన ఓ ఉన్నతాధికారి అనధికారికంగా ప్రకటించారు. కరోనా మహమ్మారి కట్టడికి దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ను మే 3 వరకూ పొడిగిస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన నేపథ్యంలో బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఎనిమిది ఫ్రాంచైజీలు, ప్రసారదారులతో పాటు ఈ టోర్నీతో సంబంధమున్న వారికి ఈ విషయాన్ని తెలిపినట్లు సమాచారం. అయితే బీసీసీఐ నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. 

వాస్తవంగా మార్చి29న ఐపీఎల్‌ 13వ సీజన్‌ ప్రారంభంకావాల్సి ఉండగా దేశంలో కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఏప్రిల్‌ 15వరకు వాయిదా వేసింది. అయితే లాక్‌డౌన్‌ పొడిగింపుతో తాజాగా ఐపీఎల్‌-13 రద్దుకే బీసీసీఐ వర్గాలు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. పర్యాటక వీసాల్ని మార్చి నెల నుంచి రద్దు చేసిన కేంద్ర ప్రభుత్వం ఇప్పట్లో ఆంక్షల్ని సడలించే సూచనలు కనిపించడం లేదు. దీంతో.. విదేశీ క్రికెటర్లు లేకుండా ఐపీఎల్ 2020 సీజన్‌ని నిర్వహిస్తే టోర్నీ కళ తప్పుతుందని ఫ్రాంచైజీలు స్పష్టం చేశాయి.

ఇక ఖాళీ స్టేడియాల్లో మ్యాచ్‌లు నిర్వహించాలని బీసీసీఐ భావించినా అది కుదరడం లేదు. కరోనా నేపథ్యంలో ఆస్ట్రేలియా ఆరునెలల పాటు ప్రయాణ అంక్షలు విధించిన విషయం తెలిసిందే. సెప్టెంబర్‌ 30తో ఆసీస్‌ విధించిన అంక్షలు ముగుస్తాయి. ఆ తర్వాత టీ20 ప్రపంచకప్‌ నేపథ్యంలో ఈ ఏడాది ఐపీఎల్‌ నిర్వహించడం కష్టమని బీసీసీఐ వర్గాలు భావించినట్టు సమాచారం.  ఒకవేళ టీ20 ప్రపంచకప్‌ వాయిదా పడితే అక్టోబర్‌-నవంబర్‌లో ఐపీఎల్‌ను నిర్వహిస్తారనే కథనాలు వినిపిస్తున్నాయి.

చదవండి: 
ఖాళీ స్టేడియాల్లో ఐపీఎల్‌ అవసరమా?
ఐపీఎల్‌ నష్టం రూ.3800 కోట్లు! 

Advertisement

తప్పక చదవండి

Advertisement