కోటీశ్వరుల ‘విలువ’ ఎంత? | Sakshi
Sakshi News home page

కోటీశ్వరుల ‘విలువ’ ఎంత?

Published Tue, Apr 25 2017 12:51 AM

కోటీశ్వరుల ‘విలువ’ ఎంత?

స్టోక్స్‌ సాధారణ ప్రదర్శన
మిల్స్‌ ఆట అంతంత మాత్రమే
వేలంలో భారీ మొత్తం దక్కించుకున్నా ఇంకా కనిపించని మెరుపులు   


ఐపీఎల్‌ వేలంలో కోట్లాది రూపాయలకు అమ్ముడు పోయినప్పుడు అసలు ఆట సమయంలో వారిపై అతిగా అంచనాలు ఉండటం సహజం. కొందరు తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెడితే, మరికొందరు తాము తీసుకున్న డబ్బులకు న్యాయం చేయకుండా పూర్తిగా విఫలం కావడం ప్రతీ ఏటా జరుగుతున్నదే. 2017 సీజన్‌లో ఇప్పటి వరకు సరిగ్గా సగం (28) లీగ్‌ మ్యాచ్‌లు ముగిశాయి. ప్రతీ ‘భారీ’ క్రికెటర్‌ తమ జట్ల తరఫున కొన్ని మ్యాచ్‌లలో బరిలోకి దిగారు. వేలంలో కనీసం రూ. 4 కోట్ల ధర పలికిన టాప్‌–7 ఆటగాళ్ల ప్రదర్శనను ఒకసారి చూస్తే... – సాక్షి క్రీడావిభాగం

బెన్‌ స్టోక్స్‌ (పుణే–రూ. 14.5 కోట్లు)
ప్రదర్శన: 7 ఇన్నింగ్స్‌లలో కలిపి 136.55 స్ట్రైక్‌రేట్‌తో 127 పరుగులు, 7.40 ఎకానమీతో 6 వికెట్లు
విశ్లేషణ: ఐపీఎల్‌ చరిత్రలో అత్యధిక మొత్తం పలికిన విదేశీ ఆటగాడిగా గుర్తింపు తెచ్చుకున్న స్టోక్స్‌ రెండు విభాగాల్లోనూ ఆశించిన స్థాయిలో  రాణించలేకపోయాడు. బ్యాటింగ్‌లో పంజాబ్‌పై 32 బంతుల్లో 50 పరుగులు చేసినా జట్టు ఓడిపోయింది. బెంగళూరుతో, ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌ల్లో మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా నిలవడం మాత్రమే చెప్పుకోదగ్గ ప్రదర్శన. మిగతా మ్యాచ్‌లలో అతని ఆట నామమాత్రమే. 7 ఇన్నింగ్స్‌లలో 10 బౌండరీలే కొట్టిన స్టోక్స్‌... టి20 తరహా మెరుపు ప్రదర్శన ఇవ్వడంలో మాత్రం విఫలమయ్యాడు.

మిల్స్‌ (బెంగళూరు–రూ. 12 కోట్లు)
ప్రదర్శన: 5 మ్యాచ్‌లలో 8.57 ఎకానమీతో 5 వికెట్లు
విశ్లేషణ: ఐపీఎల్‌లో అత్యధిక మొత్తం అందుకున్న బౌలర్‌గా నిలిచిన టైమల్‌ మిల్స్‌ ప్రదర్శన టోర్నీలో ఒక్క విజయాన్ని కూడా అందించలేకపోయింది. గంటకు 140 కిలోమీటర్లకు పైగా వేగంతో వేసినా, స్లో బంతులు విసిరినా బ్యాట్స్‌మెన్‌ అతడి బౌలింగ్‌ను ఇట్టే పట్టేశారు. భారత్‌లో జరిగిన టి20లో సిరీస్‌లో ఆకట్టుకున్నా... ఐపీఎల్‌లో అతని ప్రభావం ఏమాత్రం లేదని అర్థమైపోయింది.

ట్రెంట్‌ బౌల్ట్‌ (కోల్‌కతా–రూ. 5 కోట్లు)
ప్రదర్శన: 4 మ్యాచ్‌లలో 9.85 ఎకానమీతో 2 వికెట్లు
విశ్లేషణ: న్యూజిలాండ్‌ టాప్‌ బౌలర్‌ అయిన బౌల్ట్‌ను ఈ సీజన్‌కు ముందు సన్‌రైజర్స్‌ వదిలేసుకుంది. ఇప్పుడు కోల్‌కతా అవకాశం ఇవ్వగా, ఆ జట్టుకు కూడా ఉపయోగపడలేకపోయాడు. ఎక్కువగా ఫుల్‌ టాస్‌లు, వికెట్‌కు దూరంగా బంతులు విసిరి భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. ముంబైతో మ్యాచ్‌లోనైతే అతని చివరి 11 బంతుల్లో ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ 28 పరుగులు రాబట్టి తమ జట్టుకు అనూహ్య విజయం అందించారు. అయితే బౌల్ట్‌ కొన్ని సార్లు బాగా బౌలింగ్‌ చేసినా... అతని పేలవ ప్రదర్శనలో ఫీల్డింగ్‌ వైఫల్యానికి కూడా భాగముంది. మూడు క్యాచ్‌లు వదిలేయడం, రెండు మ్యాచ్‌లలో మిస్‌ ఫీల్డింగ్‌తో బౌండరీలు రావడం బౌల్ట్‌కు వ్యతిరేకంగా పని చేశాయి.

కగిసో రబడ (ఢిల్లీ–రూ. 5 కోట్లు)
ప్రదర్శన: ఒకే ఒక మ్యాచ్‌ ఆడిన రబడ 30 పరుగులకు ఒక వికెట్‌ తీసి... 39 బంతుల్లో 44 పరుగులు చేశాడు.
విశ్లేషణ: విదేశీ ఆటగాళ్ల కోటాలో చోటు కష్టం కావడంతో రబడకు ఒక్కటే మ్యాచ్‌ దక్కింది. అయితే అందులోనే అతను ఆకట్టుకున్నాడు. ఆరంభంలో వికెట్‌ తీసిన అతను తన 4 ఓవర్లలో ఒక్క ఫోర్‌ కూడా ఇవ్వలేదు. దీంతో పాటు తన బ్యాటింగ్‌తో రబడ అదనపు విలువ జోడించాడు. జట్టు స్కోరు 24/6గా ఉన్నప్పుడు మోరిస్‌తో కలిసి 91 పరుగులు జోడించడం అతని బ్యాటింగ్‌ బలాన్ని కూడా చూపించింది. ఈ ప్రదర్శనతో ఢిల్లీ జట్టు తమ తర్వాతి మ్యాచ్‌లలో రబడకు రెగ్యులర్‌గా అవకాశం ఇవ్వవచ్చు.
   
ప్యాట్‌ కమిన్స్‌  (ఢిల్లీ– రూ. 4.5  కోట్లు)
ప్రదర్శన: 6 మ్యాచ్‌లలో 7.42 ఎకానమీతో 9 వికెట్లు
విశ్లేషణ: అసలైన ఫాస్ట్‌ బౌలర్‌గా టోర్నీలో గుర్తించదగిన ఏకైక బౌలర్‌ కమిన్స్‌. వైవిధ్యం కోసమంటూ స్లో బంతుల కోసం ప్రయత్నించకుండా పూర్తిగా తన బలం పేస్‌నే నమ్ముకున్న అతను సంతృప్తికర ప్రదర్శనే ఇచ్చాడు. ఒకే ఒక్కసారి 140 కిలోమీటర్ల కంటే తక్కువ వేగంతో బౌలింగ్‌ చేసి వికెట్‌ తీసిన కమిన్స్, గరిష్టంగా 154 కిలోమీటర్ల వరకు వేగంతో బంతులు విసిరాడు. అతను వేసిన 139 బంతుల్లో సగంకంటే ఎక్కువ షార్ట్‌ పిచ్‌ బంతులు కావడం విశేషం! జట్టుగా ఢిల్లీ వైఫల్యాల వల్ల కమిన్స్‌ ఆట గొప్పగా కనిపించకపోయినా... కీలక సమయాల్లో అతను ప్రభావం చూపించాడు. పంజాబ్‌తో మ్యాచ్‌లో మిల్లర్, మోర్గాన్‌లాంటి మెరుపు బ్యాట్స్‌మెన్‌ క్రీజ్‌లో ఉన్నా ఓవర్లో ఒక పరుగే ఇవ్వడం చెప్పుకోదగిన అంశం.
 
వోక్స్‌ (కోల్‌కతా– రూ. 4.20 కోట్లు)
ప్రదర్శన: 7 మ్యాచ్‌లలో 9.31 ఎకానమీతో 10 వికెట్లు
విశ్లేషణ: భారీ మొత్తం దక్కించుకున్నా, వోక్స్‌ ప్రదర్శన కూడా సంతృప్తికరంగా లేదు. రసెల్‌కు ప్రత్యామ్నాయంగా కోల్‌కతా ఎంచుకున్న వోక్స్‌ ఆల్‌రౌండర్‌గా తన ముద్ర వేయలేకపోయాడు. ప్రధాన బ్యాట్స్‌మెన్‌ బాగా ఆడుతుండటంతో పెద్దగా బ్యాటింగ్‌ అవకాశం రాకపోయినా... బౌలింగ్‌లో కూడా మెరుపులు లేవు. ముఖ్యంగా డెత్‌ ఓవర్లలో అతను పూర్తిగా విఫలమయ్యాడు. అయితే బెంగళూరును 49 పరుగులకు కుప్పకూల్చడంలో వోక్స్‌ పాత్ర కూడా కీలకంగా ఉండటం చెప్పుకోదగిన అంశం. కేవలం 6 పరుగులకు 3 వికెట్లు తీసిన వోక్స్, అంతకు ముందు క్లిష్ట పరిస్థితుల్లో 18 పరుగులు కూడా చేశాడు.

రషీద్‌ ఖాన్‌ (హైదరాబాద్‌–రూ. 4 కోట్లు)
ప్రదర్శన: 7 మ్యాచ్‌లలో 6.96 ఎకానమీతో 10 వికెట్లు
విశ్లేషణ: ఐపీఎల్‌ సీజన్‌లో తాము అందుకున్న మొత్తానికి తగిన విలువ చూపించిన ఆటగాళ్ల జాబితాలో కచ్చితంగా రషీద్‌ ఖాన్‌ అగ్రస్థానంలో నిలుస్తాడు. సన్‌రైజర్స్‌ తరఫున అతను అన్ని మ్యాచ్‌లలో బరిలోకి దిగాడు. ‘ప్రత్యేక ప్రతిభ’ అంటూ మేనేజ్‌మెంట్‌ తనపై ఉంచిన నమ్మకాన్ని 18 ఏళ్ల ఈ అఫ్ఘానిస్తాన్‌ కుర్రాడు నిలబెట్టాడు. ఐపీఎల్‌లో తాను వేసిన నాలుగో బంతికే వికెట్‌ తీసిన అతను, లయన్స్‌తో మ్యాచ్‌లో ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’గా నిలిచి పంజాబ్‌పై విజయంలో కూడా కీలక పాత్ర పోషించాడు. అతని గుగ్లీలు, టాప్‌ స్పిన్నర్లను అర్థం చేసుకోవడంలో బ్యాట్స్‌మెన్‌ ఇబ్బంది పడుతున్నారు.

ఆరంభంలోనే వికెట్లు తీస్తూ అతను ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచుతున్నాడు. 7 మ్యాచ్‌లలో ఒక్కసారి మాత్రమే అతను వికెట్‌ తీయడంలో విఫలమయ్యాడు. ధోని మెరుపు బ్యాటింగ్‌తో హైదరాబాద్‌పై పుణే భారీ లక్ష్యాన్ని ఛేదించిన గత మ్యాచ్‌లో కూడా అతను 4 ఓవర్లలో కేవలం 17 పరుగులే ఇవ్వడం విశేషం. మున్ముందు మరిన్ని సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉన్నా... ప్రస్తుతానికి మాత్రం రషీద్‌ బౌలింగ్‌ అద్భుతంగా సాగుతోంది. 

Advertisement
Advertisement