‘ఈ దేశంలో సానియాలా ఉండటం కష్టం’ | Sakshi
Sakshi News home page

‘ఈ దేశంలో సానియాలా ఉండటం కష్టం’

Published Wed, Nov 26 2014 12:34 AM

‘ఈ దేశంలో సానియాలా ఉండటం కష్టం’

న్యూఢిల్లీ: భారత్‌లో క్రీడలపట్ల మరింత మంది మహిళలు ఆకర్షితులు కావాలంటే... ఆలోచనా ధోరణిలో మార్పు రావాల్సిన అవసరం ఉందని టెన్నిస్ స్టార్ సానియా మీర్జా అభిప్రాయపడింది. మంగళవారం ఇక్కడ జరిగిన ఒక కార్యక్రమంలో సానియాను ఐక్యరాజ్యసమితి (యూఎన్‌ఐ) దక్షిణాసియా మహిళల విభాగం గుడ్‌విల్ అంబాసిడర్‌గా నియమించారు. దక్షిణాసియా నుంచి ఈ గౌరవం పొందిన తొలి మహిళగా సానియా గుర్తింపు పొందింది. ‘ఈ దేశంలో సానియా మీర్జాలా ఉండటం చాలా కష్టం.

మహిళా క్రీడాకారిణిగా నా కెరీర్‌లో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాను. నేను మహిళ నయినందుకే ఎన్నో వివాదాలు చుట్టుముట్టాయి. ఒకవేళ నేను పురుషుడిగా ఉంటే కొన్ని వివాదాలను తప్పించుకునే అవకాశముండేది’ అని సానియా వ్యాఖ్యానించింది. ‘క్రీడల్లో మరింత మంది మహిళలు రావాలంటే ఆలోచనా ధోరణిలో మార్పు రావాలి. ఈ విషయంలో ప్రభుత్వం కూడా చొరవ చూపాలి.

మన సమాజంలో లింగ వివక్ష లేకుండా చేసేందుకు ప్రభుత్వం కూడా చర్యలు తీసుకుంటోంది. ఈ విషయంలో మీడియా పాత్ర కూడా కీలకం’ అని సానియా తెలిపింది. ‘మహిళలు వివక్షకు గురవుతున్నారు. వారిని జంతువుల్లా చూస్తున్నారు. ఆలోచనా ధోరణిలో మార్పు రావాలి. మహిళలు కూడా తమకు ఏమాత్రం తీసిపోకుండా పనిచేయగలరని పురుషులు అర్థం చేసుకోవాలి’ అని సానియా వ్యాఖ్యానించింది.

Advertisement
Advertisement