బ్యాట్స్‌మెన్‌దే భారం! | Sakshi
Sakshi News home page

బ్యాట్స్‌మెన్‌దే భారం!

Published Mon, Dec 30 2013 1:28 AM

జాక్వస్ కలిస్

వివాదాలు, వ్యాఖ్యలతో వేడిగా మొదలైన సిరీస్ చివరి ఘట్టానికి చేరింది. అంతిమ విజేత ఎవరో తేలేందుకు మరో రోజు మాత్రమే మిగిలింది. తొలి ఇన్నింగ్స్‌లో భారీ ఆధిక్యం సాధించిన అనంతరం ప్రత్యర్థిని కట్టడి చేయాలనుకున్న దక్షిణాఫ్రికా కొంతవరకు ఆ ప్రయత్నంలో సఫలమైంది.
 
  అయితే భారత యువ ఆటగాళ్లు పూర్తిగా చేతులెత్తేయకుండా నాలుగో రోజును ముగించగలిగారు. ఆఖరు రోజు మరో ఎనిమిది వికెట్లు తీసి స్వల్ప విజయ లక్ష్యంపై సఫారీలు గురి పెట్టగా... జాగ్రత్తగా ఆడి రెండు సెషన్ల పాటు నిలబడితే మ్యాచ్‌ను డ్రాగా ముగించేందుకు భారత్‌కు అవకాశం ఉంది.
 
 డర్బన్: భారత్, దక్షిణాఫ్రికా రెండో టెస్టు ఆసక్తికర స్థితిలో నిలిచింది. మ్యాచ్ నాలుగో రోజు ఆదివారం ఆట ముగిసే సమయానికి భారత్ తమ రెండో ఇన్నింగ్స్‌లో 2 వికెట్ల నష్టానికి 68 పరుగులు చేసింది. టీమిండియా ప్రస్తుతం మరో 98 పరుగులు వెనుకబడి ఉంది. పుజారా (90 బంతుల్లో 32 బ్యాటింగ్; 4 ఫోర్లు), కోహ్లి (11 బ్యాటింగ్) క్రీజ్‌లో ఉన్నారు. సోమవారం మ్యాచ్‌కు ఆఖరి రోజు.
 
 అంతకుముందు దక్షిణాఫ్రికా తమ తొలి ఇన్నింగ్స్‌లో 500 పరుగులకు ఆలౌట్ అయింది. ఫలితంగా సఫారీ జట్టుకు 166 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. జాక్ కలిస్ (316 బంతుల్లో 115; 13 ఫోర్లు) కెరీర్‌లో 45వ సెంచరీ పూర్తి చేసుకోగా... రాబిన్ పీటర్సన్ (52 బంతుల్లో 61; 9 ఫోర్లు, 1 సిక్స్) కూడా ఆకట్టుకున్నాడు. భారత బౌలర్లలో జడేజా 138 పరుగులిచ్చి 6 వికెట్లు పడగొట్టాడు.
 
 ఆఖరి రోజు సోమవారం వాతావరణం అనుకూలిస్తే బౌల్ చేయాల్సిన ఓవర్ల సంఖ్య 98. ఈ ఓవర్లలో భారత్ రెండో ఇన్నింగ్స్ ముగిసి దక్షిణాఫ్రికాకు విజయలక్ష్యం నిర్దేశిస్తుందా లేక జాగ్రత్తగా ఆడి మ్యాచ్‌ను ‘డ్రా’ దిశగా తీసుకెళుతుందా అన్నదే ఇప్పుడు సిరీస్‌లో మిగిలిన అంకం. మన ఆటగాళ్ల బ్యాటింగ్ చూస్తే ఒక రోజు పూర్తిగా ఆడగల సామర్థ్యం ఉంది. కాబట్టి ‘డ్రా’కే ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. ఒక వేళ పిచ్ మారిపోయి టీమిండియా కుప్పకూలినా నాలుగో ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికాకు కూడా అదే సమస్య ఎదురు కావచ్చు.
 కలిస్ సెంచరీ
 నాలుగో రోజు ఆట కూడా అర గంట ముందుగానే ఆరంభమైంది. 299/5 పరుగుల ఓవర్‌నైట్ స్కోరుతో ఇన్నింగ్స్ కొనసాగించిన దక్షిణాఫ్రికా ఆటగాళ్ళు కలిస్, స్టెయిన్ (94 బంతుల్లో 44; 7 ఫోర్లు) జాగ్రత్తగా ఆడి చక్కటి భాగస్వామ్యం నెలకొల్పారు. ఈ క్రమంలో 273 బంతుల్లో కలిస్ సెంచరీ పూర్తయింది. ఎట్టకేలకు 86 పరుగుల ఆరో వికెట్ భాగస్వామ్యానికి జడేజా తెర దించాడు. జడేజా బౌలింగ్‌లో కలిస్ స్వీప్ షాట్‌కు ప్రయత్నించగా, ఎడ్జ్ తీసుకొని గాల్లో లేచిన బంతిని ధోని అందుకున్నాడు. ప్రేక్షకుల అభినందనల మధ్య కలిస్ మైదానం వీడాడు. ఇది జడేజాకు ఐదో వికెట్ కావడం విశేషం. మరోవైపు చక్కటి బౌండరీలతో దూకుడు ప్రదర్శించిన స్టెయిన్‌ను జహీర్ వెనక్కి పంపాడు. లంచ్ సమయానికి జట్టు స్కోరు 395 పరుగులకు చేరింది.
 
 పీటర్సన్ దూకుడు
 రెండో సెషన్‌లో అనూహ్యంగా రాబిన్ పీటర్సన్ దూకుడు ప్రదర్శించాడు. డు ప్లెసిస్ (70 బంతుల్లో 43; 4 ఫోర్లు) అండగా నిలవడంతో వేగంగా పరుగులు వచ్చాయి. మూడో రోజు 80 ఓవర్ల తర్వాతే కొత్త బంతి తీసుకునే అవకాశం ఉన్నా భారత కెప్టెన్ ధోని ఎట్టకేలకు 146 ఓవర్ల తర్వాత (66 ఓవర్లు ఆలస్యంగా) కొత్త బంతి తీసుకున్నాడు. అయితే దీంతో ఇబ్బంది పడకుండా ప్రతీ బౌలర్‌ను సమర్థంగా ఎదుర్కొన్న పీటర్సన్ 44 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. రోహిత్ బౌలింగ్‌లో సిక్సర్ కొట్టిన రాబిన్, జహీర్ ఓవర్లో మరో భారీ షాట్‌కు ప్రయత్నించి అవుటయ్యాడు. పీటర్సన్, డు ప్లెసిస్ 18 ఓవర్లలో 110 పరుగులు జోడించడం విశేషం. ఈ సమయంలో భారీ వర్షం రావడంతో ఆటను నిలిపివేశారు. దీనినే టీ విరామంగా ప్రకటించి దాదాపు గంటసేపు తర్వాత మ్యాచ్‌ను కొనసాగించారు.
 
 టపటపా
 టీ తర్వాత ఏడు బంతుల్లోనే సరిగ్గా 500 పరుగులకు దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ ముగిసింది. రోహిత్ శర్మ డెరైక్ట్ త్రోకు డు ప్లెసిస్ రనౌట్ కాగా, మోర్కెల్ (0)ను రిటర్న్ క్యాచ్‌తో అవుట్ చేసి జడేజా తన కెరీర్‌లో అత్యుత్తమ గణాంకాలు (6/138) నమోదు చేశాడు. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన భారత్ ఆరంభంలో తీవ్రంగా ఇబ్బంది పడింది. చక్కటి బంతితో విజయ్ (6)ను ఫిలాండర్ అవుట్ చేసినా... శిఖర్ ధావన్ (19), పుజారా కొద్దిసేపు పట్టుదలగా నిలబడ్డారు. అయితే పీటర్సన్ బౌలింగ్‌లో డు ప్లెసిస్ గాల్లోకి ఎగిరి ఒంటిచేత్తో అద్భుత క్యాచ్ పట్టడంతో ధావన్ పెవిలియన్ చేరాడు. మరో 8.1 ఓవర్ల పాటు పుజారా, కోహ్లి వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడారు. వెలుతురు మందగించడంతో నిర్ణీత సమయానికి నాలుగు ఓవర్ల ముందే ఆటను నిలిపివేశారు.
 
 స్కోరు వివరాలు
 భారత్ తొలి ఇన్నింగ్స్: 334
 దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్: స్మిత్ (సి) ధావన్ (బి) జడేజా 47; పీటర్సన్ (సి) విజయ్ (బి) జడేజా 62; ఆమ్లా (బి) షమీ 3; కలిస్ (సి) ధోని (బి) జడేజా 115; డివిలియర్స్ (సి) కోహ్లి (బి) జడేజా 74; డుమిని ఎల్బీడబ్ల్యు (బి) జడేజా 28; స్టెయిన్ (సి) ధోని (బి) జహీర్ 44; డు ప్లెసిస్ (రనౌట్) 43; రాబిన్ పీటర్సన్ (సి) విజయ్ (బి) జహీర్ 61; ఫిలాండర్ (నాటౌట్) 0; మోర్కెల్ (సి అండ్ బి) జడేజా 0; ఎక్స్‌ట్రాలు 23; మొత్తం (155.2 ఓవర్లలో ఆలౌట్) 500
 వికెట్ల పతనం: 1-103; 2-113; 3-113; 4-240; 5-298; 6-384; 7-387; 8-497; 9-500; 10-500.
 
 భారత్ రెండో ఇన్నింగ్స్: ధావన్ (సి) డు ప్లెసిస్ (బి) రాబిన్ పీటర్సన్ 19; విజయ్ (సి) స్మిత్ (బి) ఫిలాండర్ 6; పుజారా (బ్యాటింగ్) 32; కోహ్లి (బ్యాటింగ్) 11; ఎక్స్‌ట్రాలు 0; మొత్తం (36 ఓవర్లలో 2 వికెట్లకు) 68
 వికెట్ల పతనం: 1-8; 2-53.
 
 బౌలింగ్: స్టెయిన్ 7-5-5-0; ఫిలాండర్ 6-2-9-1; మోర్కెల్ 6-2-11-0; రాబిన్ పీటర్సన్ 9-2-23-1; డుమిని 8-2-20-0.
 
 కలిస్ సాధించాడు... వీడ్కోలు టెస్టులో శతకం
 దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్ 120వ ఓవర్... జడేజా వేసిన ఐదో బంతిని మిడాన్ దిశగా నెట్టి కలిస్ సింగిల్ తీశాడు. అంతే... స్టేడియం ‘కింగ్ కలిస్’ నామంతో హోరెత్తిపోయింది. డ్రెస్సింగ్‌రూమ్ సహచరుల్లో అమితానందం... సూపర్ స్పోర్ట్స్ కామెంటరీ టీమ్ బయటికి వచ్చి మరీ దిగ్గజానికి సలామ్ చేస్తే... మైదానంలో భారత ఆటగాళ్లు చప్పట్లతో కితాబిచ్చారు. మరో ఎండ్‌లో ఉన్న స్టెయిన్ ఆప్యాయ ఆలింగనంతో అభినందించాడు. ఇక కలిస్ అయితే ఈ అపూర్వ క్షణాన్ని పూర్తిగా ఆస్వాదించాడు. కెరీర్‌లో 45వ సెంచరీ చేసినా...తొలి సెంచరీ అన్నట్లుగా కుర్రాడిలా తన ఆనందాన్ని ప్రదర్శించాడు. ఆట నుంచి తప్పుకుంటూ తనదైన ముద్ర వేసి నిష్ర్కమించాడు. ఎంతో మంది స్టార్ క్రికెటర్లకు సాధ్యం కాని రీతిలో తన చివరి టెస్టు మ్యాచ్‌లో సెంచరీ సాధించాడు. బ్రాడ్‌మన్, రిచర్డ్స్, బోర్డర్, స్టీవ్‌వా... సమకాలికుల్లో సచిన్, లారా, పాంటింగ్, ద్రవిడ్‌లకు అందని ‘చివరి టెస్టు సెంచరీ’ని కలిస్ అందుకోవడం విశేషం. దక్షిణాఫ్రికా తరఫున వాండర్ బిల్, ఇర్విన్, బారీ రిచర్డ్స్ తర్వాత ఈ ఘనత సాధించిన నాలుగో ఆటగాడు కలిస్.
 
 మూడో స్థానంలోకి...: ఈ ఇన్నింగ్స్‌లో 115 పరుగులు చేసిన కలిస్ టెస్టు క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో ద్రవిడ్‌ను దాటి మూడో స్థానంలో నిలిచాడు. ఒక్క పరుగు తేడాతో రాహుల్ ద్రవిడ్ (13,288)ను అధిగమించి కలిస్ (13,289) ముందంజ వేశాడు. సచిన్ (15,921) నంబర్‌వన్‌గా ఉండగా, పాంటింగ్ (13,378) రెండో స్థానంలో నిలిచాడు.
 
 కలిస్  జడేజా: కలిస్ చివరి టెస్టులో రవీంద్ర జడేజా భాగస్వామ్యం కూడా కొనసాగింది! జడేజా క్యాచ్ పట్టిన కలిస్ టెస్టుల్లో 200 క్యాచ్‌ల మైలురాయిని అందుకున్నాడు. జడేజా బౌలింగ్‌లో సెంచరీ మైలురాయిని అందుకున్న కలిస్... చివరకు అతని బౌలింగ్‌లోనే వెనుదిరిగాడు.
 
 తొలి సెషన్    ఓవర్లు: 35.1, పరుగులు: 96, వికెట్లు: 2
 
 రెండో సెషన్    ఓవర్లు: 14.1, పరుగులు: 102, వికెట్లు: 1
 
 మూడో సెషన్    దక్షిణాఫ్రికా : ఓవర్లు: 1.1, పరుగులు: 3, వికెట్లు: 2     భారత్ :  ఓవర్లు: 36, పరుగులు: 68, వికెట్లు: 2
 
భారత్ :  ఓవర్లు: 36, పరుగులు: 68, వికెట్లు: 2
 

Advertisement
Advertisement