ఇంగ్లండ్ ఆప్షన్ బట్లర్! | Sakshi
Sakshi News home page

ఇంగ్లండ్ ఆప్షన్ బట్లర్!

Published Tue, Nov 22 2016 3:50 PM

ఇంగ్లండ్ ఆప్షన్ బట్లర్!

లండన్:ఐదు టెస్టుల సిరీస్లో భాగంగా భారత్ తో తొలి టెస్టులో మెరుగైన ప్రదర్శన కనబరిచిన ఇంగ్లండ్.. ఆ తరువాత  విశాఖలో జరిగిన రెండో టెస్టులో ఘోర ఓటమి పాలైంది. దాంతో ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు దిద్దుబాటు చర్యలకు దిగింది. ప్రధానంగా ఇంగ్లండ్ వికెట్ కీపర్ జాస్ బట్లర్ను తిరిగి జట్టులోకి తీసుకోవాలని యాజమాన్యం భావిస్తోంది. దీనిలో భాగంగా నాలుగ టెస్టు మ్యాచ్లు మాత్రమే ఆడిన అనుభవం ఉన్న బెన్ డకెట్ ను పక్కకు పెట్టాలని చూస్తోంది.


ప్రధానంగా భారత్లోని స్పిన్ పిచ్లపై ఆడటానికి డకెట్ తీవ్ర ఇబ్బందులు పడుతున్నాడు. దాంతో అతనికి విశ్రాంతినివ్వాలని ఈసీబీ యోచనగా ఉంది. అదే క్రమంలో ఇంగ్లండ్ కు  ప్రస్తుతం అందుబాటులో ఉన్న బ్యాటింగ్ ఆప్షన్ గా బట్లర్ను పరిశీలిస్తోంది. అయితే టెస్టుల్లో పెద్దగా ఆకట్టుకోలేని బట్లర్ను జట్టులోకి తీసుకుంటే ఎంతవరకూ ఉపయోగపడతాడు అనే అంశాన్ని కూడా ఇంగ్లండ్ సెలక్టర్లు సమీక్షిస్తున్నారు. మొహాలిలో జరిగే మూడో టెస్టులో బట్లర్ ఆడితే మాత్రం ఏడాది తర్వాత టెస్టు మ్యాచ్ ఆడే అవకాశాన్ని మళ్లీ దక్కించుకున్నట్లు అవుతుంది. గతేడాది అక్టోబర్ లో పాకిస్తాన్తో బట్లర్ చివరి టెస్టు మ్యాచ్ ఆడాడు.  ఇంగ్లండ్ టెస్టు ప్రాబబుల్స్లో బట్లర్ ఉన్నా,  తొలి  రెండు టెస్టుల్లో అతనికి ఆడే అవకాశం దక్కలేదు.

Advertisement
Advertisement