ఎఫ్1 డ్రైవర్ బియాంచి మృతి | Sakshi
Sakshi News home page

ఎఫ్1 డ్రైవర్ బియాంచి మృతి

Published Sun, Jul 19 2015 12:49 AM

ఎఫ్1 డ్రైవర్ బియాంచి మృతి - Sakshi

9 నెలలుగా కోమాలోనే    
 గతేడాది జపాన్ గ్రాండ్‌ప్రిలో ప్రమాదం

 
 నైస్ (ఫ్రాన్స్): ఫార్ములావన్ చరిత్రలో విషాదం చోటుచేసుకుంది. తొమ్మిది నెలలుగా మృత్యువుతో పోరాడుతున్న ఎఫ్1 డ్రైవర్ జూలెస్ బియాంచి శుక్రవారం రాత్రి మరణించాడు. గతేడాది అక్టోబర్ 5న జపాన్ గ్రాండ్‌ప్రిలో వర్షంలో దూసుకెళుతున్న అతని కారు అదుపు తప్పి ట్రాక్ పక్కనున్న రికవరీ వెహికల్‌ను వెనుక నుంచి బలంగా ఢీకొంది. దీంతో కారు నుజ్జునుజ్జు కాగా... ఆ రేసులో మనోర్ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన 25 ఏళ్ల బియాంచి తలకు తీవ్ర గాయాలయ్యాయి. అప్పటి నుంచి ఈ ఫ్రెంచ్ డ్రైవర్ నైస్ పట్టణంలోని తన ఇంటికి దగ్గరలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.
 
 ఫార్ములావన్ చరిత్రలో ఇప్పటికి 36 మంది డ్రైవర్లు తమ ప్రాణాలు వదలగా... చివరిసారిగా 1994లో ప్రఖ్యాత డ్రైవర్ అయిర్టన్ సెన్నా దుర్మరణం చెందాడు. ‘జూలెస్ తన సహజ గుణానికి తగ్గట్టుగానే మృత్యువుతో చివరి వరకు పోరాడాడు. అయితే మమ్మల్ని విషాదంలో ముంచి తను పోరాటాన్ని చాలించాడు’ అని కుటుంబ సభ్యులు ఓ ప్రకటనలో తెలిపారు. 2013, 2014 సీజన్లలో మనోర్ జట్టు తరఫున బియాంచి 34 రేసులను పూర్తి చేశాడు. గతేడాది మొనాకో గ్రాండ్‌ప్రిలో తొమ్మిదో స్థానంలో నిలిచి తమ జట్టుకు తొలిసారిగా చాంపియన్‌షిప్ పాయింట్లను అందించాడు.
 

Advertisement
Advertisement