జునైద్ స్థానంలో బిలావల్ | Sakshi
Sakshi News home page

జునైద్ స్థానంలో బిలావల్

Published Wed, Jan 21 2015 12:41 AM

జునైద్ స్థానంలో బిలావల్

కరాచీ: ప్రపంచకప్ ప్రారంభానికి ముందే పాకిస్తాన్ జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. తొడ కండరాల గాయంతో బాధపడుతున్న సీనియర్ పేసర్ జునైద్ ఖాన్ ఇంకా పూర్తి స్థాయిలో కోలుకోకపోవడంతో మంగళవారం జట్టుతో పాటు న్యూజిలాండ్‌కు వెళ్లలేకపోయాడు. దీంతో జునైద్ స్థానంలో 23 ఏళ్ల ఆల్‌రౌండర్ బిలావల్ భట్టిని పాక్ క్రికెట్ బోర్డు ఎంపిక చేసింది.

ఈ మెగా టోర్నీకి ముందు కివీస్‌తో పాక్ రెండు వార్మప్ మ్యాచ్‌లతో పాటు రెండు వన్డేలు ఆడనుంది. అయితే ప్రపంచకప్ ప్రారంభానికి ముందు జునైద్ కోలుకుంటే జట్టులో చేరతాడని పీసీబీ స్పష్టం చేసింది.   పాక్ ఆటగాళ్లు ప్రపంచకప్ సమయంలో సోషల్ వెబ్‌సైట్లు (ట్టిట్టర్, ఫేస్‌బుక్‌లాంటివి) ఉపయోగించేందుకు వీల్లేదని పీసీబీ ఆదేశాలు జారీ చేసింది.
 
ఫాస్టెస్ట్ సెంచరీని మళ్లీ సాధిస్తా: ఆఫ్రిది
గతంలో తన పేరిట ఉన్న వన్డేల్లో వేగవంతమైన సెంచరీని తిరిగి ఈ ప్రపంచకప్‌లో సాధిస్తానని పాకిస్తాన్ ఆల్‌రౌండర్ షాహిద్ ఆఫ్రిది సవాల్ విసిరాడు. అదే జరిగితే తాను ఈ ఫార్మాట్‌కు ఘనంగా వీడ్కోలు పలికినట్టవుతుందని అన్నాడు.

‘నిజానికి అలాంటి రికార్డులను సాధిద్దామని ముందుగా ఎవరూ ప్రణాళిక వేసుకోరు. ప్రత్యేకమైన రోజున, ఆత్మవిశ్వాసం ఆకాశాన్ని తాకే వేళ మాత్రమే నమోదవుతాయి. అలాంటి పరిస్థితి నాకు ఎదురైతే ప్రపంచకప్‌లో కానీ, న్యూజిలాండ్‌పై కానీ డి విలియర్స్ రికార్డును అధిగమించేందుకు ప్రయత్నిస్తా’ అని ఆఫ్రిది అన్నాడు.

Advertisement

తప్పక చదవండి

Advertisement