నా కోసం కాదు... ఆట కోసమే! | Sakshi
Sakshi News home page

నా కోసం కాదు... ఆట కోసమే!

Published Thu, Aug 7 2014 1:56 AM

నా కోసం కాదు... ఆట కోసమే!

‘డబుల్స్’కు ప్రాధాన్యతపై ప్రశ్నిస్తున్నా
 గుత్తా జ్వాల వ్యాఖ్య

 
 సాక్షి, హైదరాబాద్: సింగిల్స్‌తో పోలిస్తే డబుల్స్‌కు గుర్తింపు దక్కడం లేదని తాను పదే పదే అనడం వివాదం చేయడానికి కాదని, భవిష్యత్తు షట్లర్ల కోసమేనని బ్యాడ్మింటన్ స్టార్ గుత్తా జ్వాల వ్యాఖ్యానించింది. గ్లాస్గో కామన్వెల్త్ క్రీడల్లో మహిళల డబుల్స్‌లో రజత పతకం సాధించిన జ్వాల స్వస్థలం తిరిగి వచ్చింది. ఈ మెగా ఈవెంట్‌లో ఆమె ప్రదర్శనతో పాటు ఇతర అంశాలపై సాక్షితో మాట్లాడింది. విశేషాలు జ్వాల మాటల్లోనే...
 చీఫ్ కోచ్ వ్యూహాలు, సలహాలపై..: నా గెలుపును కోరుకునేవారి దగ్గరే నేను సలహాలు, సూచనలు తీసుకుంటాను. కొద్ది సేపు మధుమిత బిస్త్‌తో మాట్లాడటం మినహా ఫైనల్లో చీఫ్ కోచ్‌తో ఎలాంటి వ్యూహాల గురించి చర్చించలేదు.
 
 భారత జాతీయ కోచ్‌గా ఏదైనా చెప్పడం ఆయన బాధ్యత. కానీ నా అంతట నేను వెళ్లి అడగను. అసలు ఆ అవసరం నాకు లేదు. ప్రతీ మ్యాచ్‌కు ముందు ఫోన్‌లో ఆరిఫ్ సర్‌తో మాట్లాడేదాన్ని. ఇక 2010లో విజయం తర్వాత అకాడమీలో జరిగిన విజయోత్సవంలో నేనూ పాల్గొన్నాను. ఈ సారి మాత్రం నన్ను పిలవలేదు కాబట్టి వెళ్లలేదు!
 
 సింగిల్స్‌ను డబుల్స్‌తో పోల్చడం: నేను దీనిపై మాట్లాడిన ప్రతీ సారి ‘సింగిల్స్, డబుల్స్ ఎలా సమానం’ అంటూ అంతా నన్నే తిరిగి ప్రశ్నిస్తున్నారు. అంతర్జాతీయ స్థాయికి ఎదగడంలో ఏ క్రీడాకారుడికైనా అంతే కఠోర శ్రమ ఉంటుంది. ఇంకా చెప్పాలంటే ఏ దేశంలోనూ ఈ రకమైన విచక్షణ లేదు. జ్వాల డబుల్స్ స్పెషలిస్ట్ కావడం వల్లనే ఇలా చేస్తున్నారేమో నాకు తెలీదు! వ్యక్తిగతంగా చూస్తే ప్రపంచ చాంపియన్‌షిప్ సహా ఎన్నో ఘనతలు సాధించాను. ఒక్క స్పాన్సర్ లేకపోయినా, ప్రతికూల పరిస్థితుల్లోనూ ఒక వైపు వారితో పోరాడుతూనే మరో వైపు ఇవి గెలిచాను.  కానీ నాకు కంగ్రాట్స్ చెప్పేవారు, స్వాగతం పలికేవారు ఎవరూ లేకపోయారు. నేను మౌనంగా ఎలా ఉండను? ఎవరో ఒకరు ప్రశ్నించాలిగా. ఈ పరిస్థితిని మార్చకుంటే భవిష్యత్తులో ఎవరూ డబుల్స్‌ను ఎంచుకోరు. దీనిపై హెచ్చరించేందుకే నేను పదే పదే గుర్తింపు ఇవ్వమని కోరుతున్నా.
 నగదు పురస్కారంపై ఇటీవలి సైనా వ్యాఖ్యలపై..: ఆమె టైమింగ్ తప్పు అనేది నా నిశ్చితాభిప్రాయం! సైనా స్థాయి ప్లేయర్లకు సీఎం లేదా కనీసం మంత్రి అయినా అందుబాటులో ఉంటారు. నేరుగా చెప్పుకోవచ్చు తప్ప మీడియాకెక్కాల్సిన అవసరం లేదు. నేనైతే డబ్బు గురించి అలా చెప్పను. పైగా సానియాతో పోలుస్తూ అడగటం సరైంది కాదు. ఇవాళ సీఎం ప్రోత్సాహకం పట్ల సంతోషంగా ఉన్నా. అన్నింటినిమించి తొలిసారి ఆరిఫ్ సర్‌కు కూడా బహుమతి ప్రకటించడం ఆనందం గా ఉంది.
 

Advertisement
Advertisement