చలో రియో | Sakshi
Sakshi News home page

చలో రియో

Published Fri, Jul 22 2016 12:31 AM

చలో రియో

కిత్‌నే ఆద్మీ థే..?
121 సర్కార్..!
 
ఎవరు వాళ్లు...
లిస్ట్ ఇచ్చాం సర్కార్...
 
ఇంత మంది ఎలా పెరిగారు..?
కింద స్టోరీ ఉంది సర్కార్...

 
చరిత్రలో తొలిసారి భారత్ నుంచి 121 మంది అథ్లెట్ల భారీ బృందం ఒలింపిక్స్‌కు వెళుతోంది. భారత్ నుంచి రియోకు అర్హత సాధించిన అథ్లెట్లు... గత ఒలింపిక్స్‌తో పోలిస్తే భారీగా పెరిగారు.  ఎనిమిదేళ్ల క్రితం బీజింగ్ ఒలింపిక్స్‌లో పాల్గొన్న భారత క్రీడాకారుల సంఖ్య 56. నాలుగేళ్ల క్రితం లండన్‌లో ఈ సంఖ్య 83కు పెరిగింది. ఈ సారి రియోలో మన సంఖ్య సెంచరీ దాటింది. అనూహ్యంగానో, అదృష్టవశాత్తో అవకాశం దక్కించుకున్నవారు వీరిలో ఎవరూ లేరు. గత రెండేళ్ల కాలంలో అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటి తమ ప్రదర్శన ఆధారంగా ఒలింపిక్స్‌కు వీరంతా అర్హత సాధించారు. ఆ ఆటతీరే ఇప్పుడు భారత్ మరిన్ని పతకాలు సాధిస్తుందనే ఆశలు పెంచుతోంది. ‘గతంలో మన అథ్లెట్లు ఒలింపిక్స్‌నుంచి జ్ఞాపికలు తెచ్చుకోవడంతోనే సంబరపడేవారు. కానీ ఈతరం ఆటగాళ్లలో దూకుడు పెరిగింది. వారు సరదా కోసం కాకుండా పతకమే లక్ష్యంగా ఒలింపిక్స్‌కు సన్నద్ధమవుతున్నారు’... భారత బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ చేసిన ఈ వ్యాఖ్య ఇటీవలి పరిణామాలు, మారిన మన ఆలోచనా తీరుకు నిదర్శనం. ఈ సారి ఒలింపిక్స్‌లో ఆటగాళ్ల సంఖ్య పెరగడం మన క్రీడారంగంలో వచ్చిన మార్పుకు సంకేతం.
 
మహిళా హాకీ పునరాగమనం...
2012 ఒలింపిక్స్‌తో పోలిస్తే అదనంగా 38 మంది అథ్లెట్లు ఈ సారి ప్రపంచ క్రీడా సంబరానికి అర్హత సాధించారు. ఇందులో 16 మంది సభ్యుల మహిళా హాకీ జట్టు కూడా ఉంది. నిలకడైన ప్రదర్శనతో జట్టు 36 ఏళ్ల తర్వాత మరో సారి అవకాశం దక్కించుకుంది. రియోలో మొత్తం 121 మంది భారత అథ్లెట్లు 15 క్రీడల్లో కలిపి మొత్తం 72 ఈవెంట్‌లలో పోటీ పడనున్నారు. తొలి సారి షూటింగ్‌లో 12 మంది, బ్యాడ్మింటన్‌లో ఏడుగురు అర్హత సాధించడం విశేషం. అథ్లెటిక్స్‌లో ఏకంగా 23 మంది పెరిగారు. లండన్‌కంటే మరో ముగ్గురు రెజ్లర్లు అదనంగా క్వాలిఫై అయ్యారు.
 
అండగా నిలిచిన ప్రభుత్వం
లండన్ ఒలింపిక్స్ అనంతరం కేంద్ర ప్రభుత్వం తదుపరి క్రీడల లక్ష్యంతో కొత్త ప్రణాళికలను రూపొందించడం ఆటగాళ్లకు ఎంతో ఉపయోగపడింది. వాస్తవానికి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్) దీర్ఘ కాలిక ప్రణాళికలో భాగంగా 2020 టోక్యో క్రీడలను దృష్టిలో ఉంచుకుని ప్రణాళికలు రూపొందించింది. అందులో భాగంగానే రియోలో మన సంఖ్య పెరిగింది. ముఖ్యంగా టార్గెట్ ఒలింపిక్ పోడియం (టాప్) పథకం మాత్రం చాలా మందికి ఉపయోగ పడింది. గతంలో నేషనల్ స్పోర్ట్స్ డెవలప్‌మెంట్ ఫండ్ ద్వారా ఆటగాళ్లకు ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించేది. అయితే ఇది సుదీర్ఘ ప్రక్రియ కావడంతో పాటు ముందుగా సొంత డబ్బు ఖర్చు చేసి తర్వాత ప్రభుత్వంనుంచి తిరిగి తీసుకోవాల్సి వచ్చేది. దీని వల్ల అథ్లెట్లు చాలా ఇబ్బందులు ఎదుర్కొనేవారు. అయితే కొత్తగా తీర్చిదిద్దిన టాప్ పథకం ఆటగాళ్లను ఆదుకుంది. ప్రత్యేక కమిటీ ఎంపిక చేసిన 75 మంది అథ్లెట్లు ఒలింపిక్స్‌కు సిద్ధమయ్యేందుకు రూ. 25 లక్షలనుంచి రూ. కోటి వరకు ప్రభుత్వం అందజేసింది. దీని కోసం ప్రత్యేకంగా బడ్జెట్ కేటాయించింది. రియోకు అర్హత సాధించినవారిలో కొందరు మినహా దాదాపు అంతా దీనిని బాగా ఉపయోగించుకున్నారు. సుశీల్, నర్సింగ్ వ్యక్తిగత వివాదం మినహా అన్ని క్రీడల్లో ఆయా సమాఖ్యలకు తమ ఈవెంట్ సన్నాహకాలపై మొదటినుంచి మంచి స్పష్టత ఉంది. అందు వల్ల అర్హత కోసం పాల్గొనాల్సిన టోర్నీలు, ప్రమాణాలు పెంచేందుకు తీసుకోవాల్సిన చర్యలు వంటి అంశాలపై ప్రొఫెషనల్ పద్ధతిలో ప్రభుత్వం కూడా జాతీయ క్రీడా సమాఖ్యలతో కలిసి మంచి సమన్వయంతో పని చేసింది.
 
వెన్నంటి నిలుస్తూ...
ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సహాయమే కాకుండా గత కొన్నేళ్లుగా కొన్ని ఇతర సంస్థలు అండగా నిలవడం కూడా ఆటగాళ్లకు ఆర్థిక భద్రతను చేకూర్చింది. క్రీడలను ప్రోత్సహించే లక్ష్యంతో ముందుకు వచ్చిన ఒలింపిక్ గోల్డ్ క్వెస్ట్ (ఓజీక్యూ), లక్ష్య, జేఎస్‌డబ్ల్యూ స్పోర్ట్స్ అథ్లెట్లు ఇతర అంశాల గురించి ఆలోచించకుండా తమ ఆటపైనే దృష్టి పెట్టేలా చేయడంలో సఫలమయ్యాయి. ఓజీక్యూ అండగా నిలిచిన ఆటగాళ్లలో సైనా నెహ్వాల్, సింధు, శివ థాపా, దీపికా కుమారి, గగన్ నారంగ్, జీతూరాయ్, యోగేశ్వర్ దత్ కొందరు. లక్ష్య సంస్థ ఈ సారి బ్యాడ్మింటన్ డబుల్స్ జోడి సుమీత్ రెడ్డి- మను అత్రిలకు అండగా నిలుస్తోంది. జేఎస్‌డబ్ల్యూ స్పోర్ట్స్ అందించిన సహకారం వల్లే ప్రపంచ చాంపియన్‌షిప్‌లో పతకం సాధించి నర్సింగ్ యాదవ్ రియోలో పోరుకు సిద్ధమయ్యాడు. ఈ సహకారం అంతా ఒలింపిక్స్‌లో మన సంఖ్య పెరిగేందుకు దోహదపడింది.
 
కార్పొరేట్ కాంబినేషన్
గతంలో ఎన్నడూ లేని విధంగా భారత ఒలింపిక్ సంఘం ఈ సారి కార్పొరేట్లతో జత కట్టి పెద్ద ఎత్తున జట్టుకు స్పాన్సర్‌షిప్‌లు రాబట్టడంలో సఫలమైంది. ఇందు కోసం ఐఓఎస్ స్పోర్ట్స్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ అనే మార్కెటింగ్ సంస్థతో ఒప్పందం కూడా కుదుర్చుకుంది. ప్రధాన స్పాన్సర్లు అమూల్, జియో మొబైల్ భారత బృందంతో జత కట్టాయి. ఎడిల్‌వీజ్, టాటా సాల్ట్, హెర్బలైఫ్ తదితర సంస్థలు ఇందులో భాగమయ్యాయి. మొత్తం 10 సంస్థలు అండగా నిలిచేందుకు ముందుకు రావడం విశేషం. ఎన్నో ఏళ్లుగా భారత జట్టు కిట్ స్పాన్సర్‌గా శివ్ నరేశ్ వ్యవహరిస్తోంది. ఈ సారి చైనాకు చెందిన లీ నింగ్ భారత ఆటగాళ్లకు కిట్‌లు అందజేసింది.
 
అథ్లెటిక్స్ (37)
ధరమ్‌బీర్ సింగ్ (పురుషుల 200 మీటర్లు),
మొహమ్మద్ అనస్ (400 మీటర్లు, 4ఁ400 మీటర్ల రిలే),
జిన్సన్ జాన్సన్ (800 మీటర్లు),
అయ్యసామి ధరుణ్, మోహన్ కుమార్, సుమిత్ కుమార్,
మొహమ్మద్ కున్హి, అరోకియా రాజీవ్ (4ఁ400 మీటర్ల రిలే),
తొనకల్ గోపీ, ఖెటా రామ్, నితేందర్ సింగ్ రావత్ (మారథాన్)
బల్జీందర్ సింగ్, గుర్మీత్ సింగ్, ఇర్ఫాన్ థోడి (20 కిలోమీటర్ల నడక),
సందీప్ సింగ్, మనీశ్ సింగ్ (50 కిలోమీటర్ల నడక),
అంకిత్ శర్మ (లాంగ్‌జంప్),
రంజిత్ మహేశ్వరీ (ట్రిపుల్ జంప్),
ఇందర్జీత్ సింగ్ (షాట్‌పుట్)
వికాస్ గౌడ (డిస్కస్ త్రో)
ద్యుతీ చంద్ (మహిళల 100 మీటర్లు)
శ్రాబణి నందా (200 మీటర్లు)
నిర్మలా షెరాన్ (400 మీటర్లు, 4ఁ400 మీటర్ల రిలే)
టింటూ లూకా (800 మీటర్లు)
లలితా బాబర్ (3000 మీటర్ల స్టీపుల్‌చేజ్)
సుధా సింగ్ (3000 మీటర్ల స్టీపుల్‌చేజ్, మారథాన్)
అశ్విని అకుంజి, దేబశ్రీ మజుందార్, జిష్నా మాథ్యూస్,
ఎం.ఆర్.పూవమ్మ, అనిల్డా థామస్ (4ఁ400 మీటర్ల రిలే)
ఓపీ జైషా, కవితా రౌత్ (మారథాన్)
ఖుష్బీర్ కౌర్, సప్నా పూనియా (20 కిలోమీటర్ల నడక)
మన్‌ప్రీత్ కౌర్ (షాట్‌పుట్)
సీమా అంటిల్ (డిస్కస్ త్రో).
 
బ్యాడ్మింటన్ (7)
సైనా నెహ్వాల్, పీవీ సింధు (మహిళల సింగిల్స్),
కిడాంబి శ్రీకాంత్ (పురుషుల సింగిల్స్),
సుమిత్ రెడ్డి, మనూ అత్రి (పురుషుల డబుల్స్),
గుత్తా జ్వాల, అశ్విని పొన్నప్ప (మహిళల డబుల్స్).
 
టెన్నిస్ (4)
లియాండర్ పేస్, రోహన్ బోపన్న
(పురుషుల డబుల్స్/మిక్స్‌డ్ డబుల్స్),
సానియా మీర్జా, ప్రార్థన తొంబ్రే
(మహిళల డబుల్స్/మిక్స్‌డ్ డబుల్స్).
 
ఆర్చరీ (4)
అతాను దాస్
(పురుషుల రికర్వ్ వ్యక్తిగత విభాగం),
దీపిక కుమారి, బొంబేలా దేవి, లక్ష్మీరాణి మాఝీ
(మహిళల రికర్వ్ టీమ్, వ్యక్తిగత విభాగం).
 
టేబుల్ టెన్నిస్ (4)
ఆచంట శరత్ కమల్, సౌమ్యజిత్ ఘోష్
(పురుషుల సింగిల్స్),
మనికా బాత్రా, మౌమా దాస్ (మహిళల సింగిల్స్).
 
బాక్సింగ్ (3)
శివ థాపా (బాంటమ్ వెయిట్-56 కేజీలు),
మనోజ్ కుమార్ (లైట్ వెల్టర్ వెయిట్-64 కేజీలు),
వికాస్ క్రిషన్ యాదవ్ (మిడిల్ వెయిట్-75 కేజీలు).
 
గోల్ఫ్ (3)
అనిర్బన్ లాహిరి, శివ్ చౌరాసియా (పురుషుల విభాగం),
అదితి అశోక్ (మహిళల విభాగం).
 
వెయిట్‌లిఫ్టింగ్ (2)

 సతీశ్ శివలింగం (పురుషుల 77 కేజీలు),
 మీరాబాయి చాను (మహిళల 48 కేజీలు).
 
రెజ్లింగ్ (8)
సందీప్ తోమర్ (పురుషుల ఫ్రీస్టయిల్-57 కేజీలు),
యోగేశ్వర్ దత్ (65 కేజీలు),
నర్సింగ్ యాదవ్ (74 కేజీలు),
రవీందర్ ఖత్రీ (పురుషుల గ్రీకో రోమన్-85 కేజీలు),
హర్‌దీప్ సింగ్ (98 కేజీలు),
 వినేశ్ ఫోగట్ (మహిళల ఫ్రీస్టయిల్ 48 కేజీలు),
బబితా కుమారి (53 కేజీలు),
సాక్షి మలిక్ (58 కేజీలు).
 
రోయింగ్ (1)
దత్తూ బబన్ భోకనాల్ (పురుషుల సింగిల్ స్కల్స్).
 
షూటింగ్ (12)
అభినవ్ బింద్రా (పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్)
కైనన్ చెనాయ్, మానవ్‌జిత్ సింగ్ సంధూ (ట్రాప్)
మేరాజ్ అహ్మద్ ఖాన్ (స్కీట్)
ప్రకాశ్ నంజప్ప (50 మీటర్ల పిస్టల్),
గగన్ నారంగ్ (10 మీటర్ల ఎయిర్ రైఫిల్, 50 మీటర్ల రైఫిల్ ప్రోన్,
50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్స్),
జీతూ రాయ్ (10 మీటర్ల ఎయిర్ పిస్టల్, 50 మీటర్ల పిస్టల్),
చెయిన్ సింగ్ (50 మీటర్ల రైఫిల్ ప్రోన్, 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్స్),
గుర్‌ప్రీత్ సింగ్ (10 మీటర్ల ఎయిర్ పిస్టల్, 25 మీటర్ల ర్యాపిడ్ ఫైర్ పిస్టల్),
అపూర్వీ చండేలా, అయోనికా పాల్ (మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్),
హీనా సిద్ధూ (మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్, 25 మీటర్ల పిస్టల్).
 
హాకీ (32)
పురుషుల జట్టు: సురేందర్ కుమార్, డానిష్ ముజ్తబా, రఘునాథ్, ఆకాశ్‌దీప్ సింగ్, చింగ్లెన్‌సనా సింగ్, హర్మన్‌ప్రీత్ సింగ్, కొతాజిత్ సింగ్, మన్‌ప్రీత్ సింగ్, రమణ్‌దీప్ సింగ్, రూపిందర్‌పాల్ సింగ్, సర్దార్ సింగ్, శ్రీజేష్, ఎస్‌వీ సునీల్, నికిన్ తిమ్మయ్య, ఎస్‌కే ఉతప్ప, దేవిందర్ వాల్మీకి.

మహిళల జట్టు: సవితా పూనియా, దీప్‌గ్రేస్ ఎక్కా, దీపికా ఠాకూర్, నమితా టొప్పో, సునీతా లాక్రా, సుశీలా చాను, లిలిమా మింజ్, రేణుకా యాదవ్, నిక్కీ ప్రధాన్, మోనికా మలిక్, నవ్‌జ్యోత్ కౌర్, అనురాధ దేవి, పూనమ్ రాణి, వందన కటారియా, ప్రీతి దూబే, రాణి రాంపాల్.
 
స్విమ్మింగ్ (2)
సజన్ ప్రకాశ్ (పురుషుల 200 మీటర్ల బటర్‌ఫ్లయ్),
శివాని కటారియా (మహిళల 200 మీటర్ల ఫ్రీస్టయిల్).
 
జిమ్నాస్టిక్స్ (1)
దీపా కర్మాకర్ (మహిళల విభాగం).
 
జూడో (1)
అవతార్ సింగ్ (పురుషుల 90 కేజీలు).
 
సైనాకు ఐదో సీడ్
న్యూఢిల్లీ: ఒలింపిక్స్‌లో సైనా నెహ్వాల్ మహిళల సింగిల్స్ విభాగంలో ఐదో సీడ్‌గా బరిలోకి దిగబోతోంది. మరో స్టార్ షట్లర్ పీవీ సింధుకు తొమ్మిదో సీడ్ లభించింది. స్పెయిన్‌కు చెందిన కరోలినా మరిన్ టాప్ సీడ్. ఇక పురుషుల విభాగంలో శ్రీకాంత్‌కు  తొమ్మిదో సీడ్ లభించింది. లీ చోంగ్ వీ టాప్ సీడ్.
 
 
 

Advertisement

తప్పక చదవండి

Advertisement