ప్రపంచ రికార్డుతో ‘పసిడి’... | Sakshi
Sakshi News home page

ప్రపంచ రికార్డుతో ‘పసిడి’...

Published Mon, Aug 8 2016 2:18 AM

ప్రపంచ రికార్డుతో ‘పసిడి’...

హంగేరి స్విమ్మర్ కటింకా హోసజు ఘనత

 రియో డి జనీరో : ఇన్నాళ్లూ అందని ద్రాక్షలా ఊరిస్తోన్న ఒలింపిక్ పతకాన్ని హంగేరి మహిళా స్విమ్మర్ కటింకా హోసజు ఎట్టకేలకు సాధించింది. ప్రపంచ చాంపియన్‌షిప్‌లలో తొమ్మిది స్వర్ణాలు గెలిచిన కటింకా గత మూడు ఒలింపిక్స్‌లలో బరిలోకి దిగినా రిక్తహస్తాలతో తిరిగి వచ్చింది. అయితే నాలుగో ఒలింపిక్స్‌లో మాత్రం ఆమె ప్రపంచ రికార్డు సృష్టించడంతోపాటు ఏకంగా పసిడి పతకాన్ని సొంతం చేసుకుంది. 400 మీటర్ల వ్యక్తిగత మెడ్లే విభాగంలో కటింకా 4 నిమిషాల 26.36 సెకన్లలో లక్ష్యానికి చేరి... 4 నిమిషాల 28.43 సెకన్లతో యి షివెన్ (చైనా) పేరిట ఉన్న ప్రపంచ రికార్డును బద్దలు కొట్టింది. స్విమ్మింగ్ సర్కిల్‌లో ‘ఐరన్ లేడీ’గా పేరొందిన కటింకా కోచ్ ఆమె భర్త షేన్ టసప్ కావడం విశేషం.

మరోవైపు మహిళల 4ఁ100 మీటర్ల ఫ్రీస్టయిల్ రిలేలో ఎమ్మా మెకోన్, బ్రిటానీ, బ్రాంటీ, కేట్ క్యాంప్‌బెల్‌లతో కూడిన ఆస్ట్రేలియా బృందం స్వర్ణాన్ని దక్కించుకుంది. ఫైనల్ రేసులో ఆసీస్ జట్టు 3 నిమిషాల 30.65 సెకన్లలో గమ్యానికి చేరి కొత్త ప్రపంచ రికార్డును సృష్టించింది.

 ఎన్నాళ్లకెన్నాళ్లకు...
పురుషుల సైక్లింగ్ రోడ్ రేసులో బెల్జియం సైక్లిస్ట్ గ్రెగ్ వాన్ అవెర్‌మేట్స్ స్వర్ణం సాధించాడు. 1952 తర్వాత ఒలింపిక్స్ సైక్లింగ్ రోడ్ రేసులో బెల్జియం సైక్లిస్ట్‌కు పసిడి పతకం రావడం ఇదే తొలిసారి. 237.5 కిలోమీటర్ల దూరాన్ని గ్రెగ్ వాన్ 6 గంటల 10 నిమిషాల 5 సెకన్లలో ముగించి విజేతగా నిలిచాడు.

 వీనస్ తొలిసారి తొలి రౌండ్‌లో....
మహిళల టెన్నిస్ సింగిల్స్ విభాగంలో మాజీ చాంపియన్ వీనస్ విలియమ్స్ (అమెరికా) తొలి రౌండ్‌లోనే ఇంటిముఖం పట్టింది. కిర్‌స్టెన్ ఫ్లిప్‌కెన్స్ (బెల్జియం)తో జరిగిన మ్యాచ్‌లో వీనస్ 6-4, 3-6, 6-7 (5/7)తో ఓడిపోయింది. ఐదోసారి ఒలింపిక్స్‌లో ఆడుతున్న వీనస్ తొలి రౌండ్‌లో ఓడిపోవడం ఇదే ప్రథమం. 2000 సిడ్నీ ఒలింపిక్స్‌లో సింగిల్స్‌లో స్వర్ణం నెగ్గిన వీనస్... సిడ్నీ, బీజింగ్, లండన్ ఒలింపిక్స్‌లలో తన సోదరి సెరెనాతో కలిసి డబుల్స్‌లో పసిడి పతకాలు సాధించింది.

 ఎదురులేని కొరియా
పురుషుల ఆర్చరీ టీమ్ ఈవెంట్‌లో అంచనాలను నిజం చేస్తూ దక్షిణ కొరియా జట్టు ఐదోసారి స్వర్ణం  సాధించింది. ఫైనల్లో కిమ్ వూ జిన్, కు బోన్ చాన్, లీ సెంగ్ యున్‌లతో కూడిన కొరియా జట్టు 6-0తో అమెరికా జట్టును ఓడించింది. లండన్ ఒలింపిక్స్‌లో ఫైనల్లో ఇటలీ చేతిలో ఓడిన అమెరికా ఈసారి కొరియా చేతిలో ఓటమి పాలై రెండోసారీ రజతంతో సరిపెట్టుకుంది.

Advertisement
Advertisement