పోరాడి ఓడిన కింగ్స్‌ పంజాబ్‌ | Sakshi
Sakshi News home page

పోరాడి ఓడిన కింగ్స్‌ పంజాబ్‌

Published Sat, May 12 2018 7:46 PM

KKR beat Kings Punjab by 31 runs - Sakshi

ఇండోర్‌: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌)లో భాగంగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కింగ్స్‌ పంజాబ్‌ పోరాడి ఓడింది. కోల్‌కతా నిర్దేశించిన 246 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో కింగ్స్‌ పంజాబ్‌  చివరి బంతి వరకూ పోరాటాన్ని కొనసాగించింది. కాగా, లక్ష్యం భారీగా ఉండటంతో కింగ్స్‌ పంజాబ్‌ నిర్ణీత ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 214 పరుగులకు మాత్రమే పరిమితమైంది.  దాంతో 31 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. కింగ్స్‌ ఆటగాళ్లలో కేఎల్‌ రాహుల్‌(66; 29 బంతుల్లో 2 ఫోర్లు, 7 సిక్సర్లు) మరోసారి మెరిశాడు. కాగా, క‍్రిస్‌ గేల్‌(21), అరోన్‌ ఫించ్‌(34), అశ్విన్‌(45)లు తలో చేయి వేసినా జట్టును గెలిపించలేకపోయారు. కేకేఆర్‌ బౌలర్లలో ఆండ్రీ రస్సెల్‌ మూడు వికెట్లు సాధించగా, నరైన్‌, ప్రసిధ్‌ కృష్ణ, కుల్దీప్‌ యాదవ్‌, సీర్లెస్‌లు తలో వికెట్‌ తీశారు.

అంతకుముందు కేకేఆర్‌ 6 వికెట్లు కోల్పోయి 245 పరుగుల రికార్డు స్కోరు సాధించింది. టాస్‌ గెలిచిన కింగ్స్‌ పంజాబ్‌.. ముందుగా కేకేఆర్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. దాంతో కేకేఆర్‌ ఇన్నింగ్స్‌ను సునీల్‌ నరైన్‌, క్రిస్‌ లిన్‌లు ధాటిగా ఆరంభించారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 53 పరుగులు జోడించిన తర్వాత లిన్‌(27;17 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లు) ఔటయ్యాడు. ఆపై నరైన్‌తో రాబిన్‌ ఉతప్ప ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లాడు. ఈ జోడి కింగ్స్‌ పంజాబ్‌ బౌలర్లపై ఎదురుదాడికి దిగి స్కోరును పరుగులు పెట్టించారు. ఈ క్రమంలోనే నరైన్‌ హాఫ్‌ సెంచరీ నమోదు చేశాడు. కాగా, నరైన్‌ మరింత ప్రమాదకరంగా మారుతున్న సమయంలో ఆండ్రూ టై బౌలింగ్‌లో కీపర్‌ రాహుల్‌కు క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. 36 బంతుల్లో 9ఫోర్లు, 4 సిక్సర్లతో 75 పరుగులు సాధించిన నరైన్‌ రెండో వికెట్‌గా పెవిలియన్‌ చేరాడు.

అయితే మరొక పరుగు వ్యవధిలో ఉతప్ప(24) కూడా ఔటయ్యాడు. ఆ తరుణంలో రస్సెల్‌కు జత కలిసిన దినేశ్‌ కార్తీక్‌ స్కోరు బోర్డులో మరింత వేగం పెంచాడు. ఈ జోడి 76 పరుగుల భాగస్వామ్యాన్ని  సాధించి కేకేఆర్‌ను మరింత పటిష్ట స్థితికి చేర్చింది. ఆండ్రీ రస్సెల్‌(31;14 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లు) ఔటైన తర్వాత కార్తీక్‌ మరింత రెచ్చిపోయాడు. 22 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లతో  అర్థ శతకం సాధించాడు. అయితే కార్తీక్‌ హాఫ్‌ సెంచరీ తర్వాత తాను ఎదుర్కొన్న తొలి బంతికి ఔటయ్యాడు. దాంతో కేకేఆర్‌ 230 పరుగుల వద్ద ఆరో వికెట్‌ను కోల్పోయింది. ఇక చివర్లో శుభ్‌మాన్‌ గిల్‌(16 నాటౌట్‌;8 బంతుల్లో 3 ఫోర్లు), సీర్లెస్‌(6 నాటౌట్‌; సిక్సర్‌) బ్యాట్‌ ఝుళిపించడంతో కేకేఆర్‌ 246 పరుగుల లక్ష్యాన్ని కింగ్స్‌ పంజాబ్‌ ముందుంచింది. కింగ్స్‌ బౌలర్లలో ఆండ్రూ టై నాలుగు వికెట్లు సాధించగా, బరిందర్‌ శ్రాన్‌, మోహిత్‌ శర్మ తలో వికెట్‌ తీశారు.

Advertisement
Advertisement