ఢిల్లీ మళ్లీ ఢమాల్... | Sakshi
Sakshi News home page

ఢిల్లీ మళ్లీ ఢమాల్...

Published Mon, Apr 11 2016 12:05 AM

ఢిల్లీ మళ్లీ ఢమాల్...

  సీజన్ మారినా మారని రాత  తొలి మ్యాచ్‌లో చెత్త ప్రదర్శన 
9 వికెట్లతో కోల్‌కతా ఘన విజయం 
ఐపీఎల్-9లో గంభీర్ సేన శుభారంభం

 
గత మూడేళ్లలో ఐపీఎల్‌లో ఢిల్లీ డేర్‌డెవిల్స్ జట్టు 10 మ్యాచ్‌లు గెలిస్తే, 32 మ్యాచ్‌లు ఓడింది. ప్రతీ సీజన్‌కు ఆ జట్టు ఆట తీసికట్టుగా మారింది. దాంతో ఈసారి సమూల మార్పులు అంటూ సగం జట్టును మార్చి పడేశారు. యువ ఆటగాళ్లను భారీ మొత్తాలు చెల్లించి తీసుకున్నారు. మెంటార్‌గా ద్రవిడ్ మార్గనిర్దేశనం కూడా ఉంది. ఇక దూసుకెళ్లడమే తరువాయి అనిపించింది.
 
కానీ రూపు మారినా జట్టు రాత మారలేదు. 2016 ఐపీఎల్‌ను ఆ జట్టు మరింత అధ్వాన్నంగా ప్రారంభించింది. కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన ప్రారంభ మ్యాచ్‌లో 98 పరుగులకే చాపచుట్టేసిన ఢిల్లీ కనీసం 18 ఓవర్లు కూడా ఆడలేకపోయింది. ఏ దశలోనూ కనీస ప్రదర్శన ఇవ్వలేక ఆ జట్టు కుప్పకూలిపోయి లీగ్ చరిత్రలో ఎవరికీ సాధ్యం కాని విధంగా ఏడోసారి  వంద లోపే ఆలౌటయింది.

 
 
కోల్‌కతా: ఐపీఎల్-9లో మాజీ చాంపియన్ కోల్‌కతా నైట్‌రైడర్స్ శుభారంభం చేసింది. ఆదివారం ఇక్కడి ఈడెన్ గార్డెన్స్ మైదానంలో జరిగిన లీగ్ మ్యాచ్‌లో కోల్‌కతా 9 వికెట్ల తేడాతో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌పై విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ 17.4 ఓవర్లలో 98 పరుగులకే ఆలౌటైంది. బ్రాడ్ హాగ్ (3/19), రసెల్ (3/24), హేస్టింగ్స్ (2/6) ఢిల్లీని దెబ్బ తీశారు. అనంతరం నైట్‌రైడర్స్ 14.1 ఓవర్లలో వికెట్ నష్టానికి 99 పరుగులు చేసింది. గౌతం గంభీర్ (41 బంతుల్లో 38 నాటౌట్; 5 ఫోర్లు), రాబిన్ ఉతప్ప (33 బంతుల్లో 35; 7 ఫోర్లు)  రాణించారు. రసెల్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది.


 అందరూ అందరే...
తొలి 14 బంతుల్లో 24 పరుగులు... ఢిల్లీ డేర్‌డెవిల్స్ ఓపెనింగ్ భాగస్వామ్యమిది. అంతే... ఆ తర్వాత పరుగులు తీయడమే చేతకాక అంతకుమించిన పార్ట్‌నర్‌షిప్ నెలకొల్పడం జట్టు బ్యాట్స్‌మెన్ వల్ల కాలేదు. డి కాక్ (10 బంతుల్లో 17; 1 ఫోర్, 1 సిక్స్) చేసిన పరుగులే ఆ జట్టులో అత్యధిక స్కోరు కావడం పరిస్థితిని సూచిస్తోంది. నైట్‌రైడర్స్ చక్కటి బౌలింగ్ ముందు ఒక్క బ్యాట్స్‌మన్ కూడా క్రీజ్‌లో నిలవలేకపోయాడు.

రసెల్ వేసిన ఇన్నింగ్స్ మూడో ఓవర్లో డి కాక్, శ్రేయస్ అయ్యర్ (0) అవుట్ కావడంతో ఢిల్లీ పతనం ప్రారంభమైంది. తన తర్వాతి ఓవర్లోనే అతను మయాంక్ అగర్వాల్ (9)ను కూడా పెవిలియన్ పంపించాడు. ఆ వెంటనే మెయిడిన్ ఓవర్ వేసిన హేస్టింగ్స్... కరుణ్ నాయర్ (3) వికెట్ కూడా తీశాడు. ఆ తర్వాత పడిన ఐదు వికెట్లను స్పిన్నర్లు హాగ్, పీయూష్ చావ్లా పంచుకున్నారు. చావ్లా తన వరుస ఓవర్లలో కార్లోస్ బ్రాత్‌వైట్ (6), క్రిస్ మోరిస్ (11)లను పెవిలియన్ పంపించగా... పవన్ నేగి (11), శామ్సన్ (13 బంతుల్లో 15; 2 ఫోర్లు), అమిత్ మిశ్రా (3)లను హాగ్ అవుట్ చేశాడు. కెప్టెన్ జహీర్ ఖాన్(4)ను హేస్టింగ్స్ అవుట్ చేయడంతో మరో 14 బంతులు మిగిలి ఉండగానే డేర్‌డెవిల్స్ ఇన్నింగ్స్ ముగిసింది.

అలవోకగా...
స్వల్ప లక్ష్య ఛేదనలో ఉతప్ప, గంభీర్ ఎక్కడా తడబడలేదు. జహీర్ వేసిన రెండో ఓవర్లో మూడు ఫోర్లతో 16 పరుగులు రావడంతో వీరి జోరు మొదలైంది. ఢిల్లీ బౌలర్లను సునాయాసంగా ఎదుర్కొని పరుగులు రాబట్టిన ఈ జోడి తొలి వికెట్‌కు 58 బంతుల్లో 69 పరుగులు జతచేసింది. ఈ క్రమంలో వీరిద్దరు ఐపీఎల్‌లో అత్యధిక పరుగులు జోడించిన ఓపెనర్ల జాబితాలో రెండో స్థానానికి చేరగా... ఉతప్ప లీగ్‌లో 3 వేల పరుగులు పూర్తి చేసుకున్న ఆరో ఆటగాడిగా నిలిచాడు. కోల్‌కతా విజయం దిశగా సాగుతున్న దశలో భారీ షాట్‌కు ప్రయత్నించి ఉతప్ప అవుటైనా, మనీశ్ పాండే (12 బంతుల్లో 15 నాటౌట్; 3 ఫోర్లు) సహకారంతో మరో 5.5 ఓవర్లు మిగిలి ఉండగానే గంభీర్ మ్యాచ్‌ను ముగించాడు.


 వరుసగా ఐదో సిక్సర్...
 సరిగ్గా వారం రోజుల క్రితం ఇదే మైదానంలో అతనేంటో ప్రపంచానికి తెలిసింది. నాడు ప్రపంచ కప్ ఫైనల్లో వరుసగా నాలుగు సిక్సర్లతో దుమ్ము రేపిన బ్రాత్‌వైట్ అదే ఈడెన్ గార్డెన్స్‌లో ఆదివారం దానిని కొనసాగించినట్లు కనిపించాడు. ముగించిన చోటే మొదలు పెట్టినట్లు చావ్లా ఓవర్లో తాను ఎదుర్కొన్న తొలి బంతికే అతను భారీ సిక్సర్ బాదాడు. ఇక్కడ అతనికి ఇది వరుసగా ఐదో సిక్సర్ కావడం విశేషం. అయితే ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన బ్రాత్‌వైట్ ఈ జోరు మళ్లీ చూపించలేక నాలుగో బంతికే ఎల్బీగా వెనుదిరిగాడు.

 ఢిల్లీ టాప్ ఆర్డర్‌ను కుప్పకూల్చిన కోల్‌కతా బౌలర్లు హేస్టింగ్స్, రసెల్
 
స్కోరు వివరాలు
ఢిల్లీ డేర్‌డెవిల్స్ ఇన్నింగ్స్: అగర్వాల్ (సి) హాగ్ (బి) రసెల్ 9; డి కాక్ (సి) పఠాన్ (బి) రసెల్ 17; అయ్యర్ (ఎల్బీ) (బి) రసెల్ 0; నాయర్ (సి) పాండే (బి) హేస్టింగ్స్ 3; శామ్సన్ (సి) ఉతప్ప (బి) హాగ్ 15; నేగి (స్టంప్డ్) ఉతప్ప (బి) హాగ్ 11; బ్రాత్‌వైట్ (ఎల్బీ) చావ్లా 6; మోరిస్ (బి) చావ్లా 11; కూల్టర్ నీల్ (నాటౌట్) 7; మిశ్రా (సి) గంభీర్ (బి) హాగ్ 3; జహీర్ (సి) పాండే (బి) హేస్టింగ్స్ 4; ఎక్స్‌ట్రాలు 12; మొత్తం (17.4 ఓవర్లలో ఆలౌట్) 98.


వికెట్ల పతనం: 1-24; 2-25; 3-31; 4-35; 5-55; 6-67; 7-84; 8-84; 9-92; 10-98.
బౌలింగ్: రసెల్ 3-0-24-3; ఉమేశ్ యాదవ్ 3-0-21-0; హేస్టింగ్స్ 2.4-1-6-2; మున్రో 1-0-7-0; హాగ్ 4-1-19-3; చావ్లా 4-0-21-2.

కోల్‌కతా నైట్‌రైడర్స్ ఇన్నింగ్స్: ఉతప్ప (సి) మోరిస్ (బి) మిశ్రా 35; గంభీర్ (నాటౌట్) 38; పాండే (నాటౌట్) 15; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం (14.1 ఓవర్లలో వికెట్ నష్టానికి) 99.

వికెట్ల పతనం: 1-69.
బౌలింగ్: కూల్టర్‌నీల్ 4-0-32-0; జహీర్ 2.1-0-24-0; మోరిస్ 4-0-21-0; బ్రాత్‌వైట్ 2-0-9-0; మిశ్రా 2-0-11-1.

 

Advertisement
Advertisement