రప్ఫాడించిన రాహుల్! | Sakshi
Sakshi News home page

రప్ఫాడించిన రాహుల్!

Published Sun, Dec 18 2016 3:33 PM

రప్ఫాడించిన రాహుల్!

చెన్నై: ఇంగ్లండ్తో జరుగుతున్న చివరిటెస్టు తొలి ఇన్నింగ్స్ లో భారత ఓపెనర్ కేఎల్ రాహుల్ రప్ఫాడించాడు. ఇంగ్లండ్ బౌలర్లకు కొరకరాని కొయ్యగా తయారై రాహుల్ (150) భారీ శతకం సాధించాడు. 253 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్సర్లతో రాహుల్ 150 పరుగుల మార్కును చేరాడు.  ఈ రోజు ఆట తొలి రెండు సెషన్లలో రాహుల్ పూర్తి ఆధిపత్యం చెలాయించాడు. గత ఐదు ఇన్నింగ్స్ ల్లో కలుపుకుని 104 పరుగులు మాత్రమే చేసిన రాహుల్.. ఈ మ్యాచ్లో దుమ్మురేపాడు. అంతకుముందు ఐదు ఇన్నింగ్స్ ల్లో 38 పరుగుల అత్యధిక స్కోరును మాత్రమే కల్గి ఉన్న రాహుల్.. ఒక్కసారిగా పరుగుల దాహాన్ని తీర్చుకున్నాడు.  తన టెస్టు కెరీర్లో నాల్గో సెంచరీ సాధించిన రాహుల్..150 పరుగులను రెండోసారి సాధించాడు.
 

60/0 ఓవర్ నైట్ స్కోరుతో ఇన్నింగ్స్ కొనసాగించిన భారత్ కు మంచి ఆరంభం లభించింది. రాహుల్ కు జతగా మరో ఓవర్ నైట్ ఆటగాడు పార్థీవ్ పటేల్(71;112 బంతుల్లో7 ఫోర్లు) హాఫ్ సెంచరీ సాధించాడు. ఈ జోడి 152 పరుగుల భాగస్వామ్యాన్ని సాధించిన తరువాత పార్థీవ్ తొలి వికెట్ గా అవుటయ్యాడు. అనంతరం పూజారాతో కలిసి రాహుల్ ఇన్నింగ్స్ నడిపించాడు.  ఆపై విరాట్ కోహ్లి(15) నిరాశపరచడంతో భారత జట్టు 211 పరుగుల వద్ద మూడో వికెట్ నష్టపోయింది. ఈ తరుణంలో రాహుల్-కరుణ్ నాయర్ల జోడి ఇన్నింగ్స్ మరమ్మత్తులు చేపట్టింది. ఈ జోడి 100 పరుగుల భాగస్వామ్యాన్ని సాధించడంతో భారత్ తిరిగి గాడిలో పడింది. ఈ క్రమంలోనే టెస్టుల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించాడు.ఇప్పటివరకూ టెస్టుల్లో రాహుల్ అత్యధిక వ్యక్తిగత స్కోరు 158 పరుగులు కాగా, దాన్ని ఈ మ్యాచ్లో అధిగమించాడు. భారత జట్టు 88.0 ఓవర్లు పూర్తయ్యే సరికి  మూడు వికెట్ల నష్టానికి 313 పరుగులతో ఉంది.

Advertisement
Advertisement