విరాట్‌ కోహ్లి పోరాటం | Sakshi
Sakshi News home page

విరాట్‌ కోహ్లి పోరాటం

Published Sun, Jan 14 2018 9:08 PM

Kohli and Pandya Keep SA at Bay - Sakshi

సెంచూరియన్‌: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టులో భారత కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి పోరాడుతున్నాడు. ఒక వైపు వికెట్లు పడుతున్నా కోహ్లి మాత్రం బాధ్యతాయుతంగా ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళుతున్నాడు.  దాంతో భారత జట్టు రెండో రోజు ఆట ముగిసేసమయానికి ఐదు వికెట్లు కోల్పోయి 189 పరుగులు చేసింది. క్రీజ్‌లో కోహ్లి(85 బ్యాటింగ్‌), హార్దిక్‌ పాండ్యా(11 బ్యాటింగ్‌)లు ఉన్నారు. మురళీ విజయ్‌(46), లోకేశ్‌ రాహుల్‌(10), చతేశ్వర పుజారా(0), రోహిత్‌ శర్మ(10), పార్థీవ్‌ పటేల్‌(19) పెవిలియన్‌కు చేరిన ఆటగాళ్లు.

ఈ రోజు తొలి ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన టీమిండియా వరుస బంతుల్లో కేఎల్‌ రాహుల్‌, చతేశ్వర పుజారా వికెట్లను కోల్పోయింది. మోర్కెల్‌ వేసిన ఇన్నింగ్స్‌ తొమ్మిదో ఓవర్‌ మూడో బంతికి రాహుల్‌ అవుట్‌ కాగా, ఆపై వెంటనే పుజారా డకౌట్‌గా పెవిలియన్‌ చేరాడు. అంతకుముందు సఫారీలు తమ తొలి ఇన్నింగ్స్‌లో 335 పరుగులకు ఆలౌటయ్యారు. 269/6 ఓవర్‌ నైట్‌ స్కోరుతో ఇన్నింగ్స్‌ ఆరంభించిన దక్షిణాఫ్రికా.. మరో 66 పరుగులు జత చేసి మిగతా నాలుగు వికెట్లను కోల్పోయింది. అశ్విన్‌ నాలుగు వికెట్లు, ఇషాంత్‌ శర్మ మూడు వికెట్లు సాధించగా, షమీకి వికెట్‌ దక్కింది.

Advertisement
Advertisement