కోహ్లికి ప్రమాదం లేదు | Sakshi
Sakshi News home page

కోహ్లికి ప్రమాదం లేదు

Published Thu, Mar 16 2017 11:42 PM

కోహ్లికి ప్రమాదం లేదు

భారత జట్టుకు కెప్టెన్‌గా కోహ్లి ఇచ్చే ఉత్తేజం ఏమిటో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటి ఆటగాడు 90 ఓవర్ల ఆటలో 51 ఓవర్లు మైదానంలో లేకపోతే పరిస్థితి ఎలా ఉంటుంది? తొలి రోజు ఆటలో బౌలింగ్‌ వైఫల్యంతో పాటు కోహ్లి గాయపడటం భారత్‌కు షాక్‌ ఇచ్చింది. జడేజా వేసిన ఇన్నింగ్స్‌ 40వ ఓవర్‌ తొలి బంతిని హ్యాండ్స్‌కోంబ్‌ మిడాన్‌ వైపు ఆడాడు. ఆ బంతిని వెంటాడిన కోహ్లి బౌండరీని ఆపే క్రమంలో పట్టు తప్పాడు. వేగవంతమైన అవుట్‌ఫీల్డ్‌పై తనను తాను నియంత్రించుకోలేక కింద పడిపోయాడు. దాంతో అతని భుజానికి బలంగా దెబ్బ తగిలింది. ఫిజియో సహాయంతో బయటకు వెళ్లిన అతను మళ్లీ బరిలోకి దిగలేదు.

ఆట సాగినంతసేపూ ఐస్‌ ప్యాక్స్‌తో అతను సేదతీరాడు. గురువారం సాయంత్రం కోహ్లి భుజానికి స్కానింగ్‌ నిర్వహించారు. ఫలితాలు వచ్చిన అనంతరం అతని గాయం తీవ్రమైనదేమీ కాదని, మెల్లగా కోలుకుంటున్నాడని బీసీసీఐ ప్రకటించింది. అతని భుజానికి చికిత్స నిర్వహిస్తున్నట్లు బోర్డు వైద్య బృందం స్పష్టం చేసింది. రాంచీ టెస్టులో బరిలోకి దిగే విధంగా చికిత్సను కొనసాగిస్తామని వెల్లడించింది.  కోహ్లికి అయిన గాయం బయటకు కనిపిస్తున్నదే కాబట్టి నిబంధనల ప్రకారం అతను తన రెగ్యులర్‌ స్థానంలో బ్యాటింగ్‌కు దిగేందుకు ఎలాంటి అభ్యంతరం ఉండకపోవచ్చు. 

Advertisement
Advertisement