స్పిన్నర్లు గెలిపించారు | Sakshi
Sakshi News home page

స్పిన్నర్లు గెలిపించారు

Published Sun, Jul 2 2017 12:57 AM

స్పిన్నర్లు గెలిపించారు

నార్త్‌ సౌండ్‌: పిచ్‌ నుంచి అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న భారత స్పిన్నర్లు అశ్విన్‌ (3/28), కుల్దీప్‌ యాదవ్‌ (3/41)  వెస్టిండీస్‌ బ్యాటింగ్‌ ఆర్డర్‌ను కుప్పకూల్చారు. వీరికి హార్దిక్‌ పాండ్యా (2/32) కూడా జత కలవడంతో శుక్రవారం జరిగిన మూడో వన్డేలో భారత్‌ 93 పరుగులతో నెగ్గింది. దీంతో ఐదు వన్డేల సిరీస్‌లో 2–0తో ఆధిక్యంలో ఉంది. తొలి వన్డే వర్షంతో రద్దయిన విషయం తెలిసిందే.

2014లో కూడా భారత స్పిన్నర్లు ఒకే వన్డేలో మూడు అంతకన్నా ఎక్కువ వికెట్లు తీశారు. భారత్‌ విసిరిన 252 పరుగుల లక్ష్యం కోసం బరిలోకి దిగిన విండీస్‌ 38.1 ఓవర్లలో 158 పరుగులకు ఆలౌట్‌ అయ్యింది. రెండో ఓవర్‌లో ప్రారంభమైన వికెట్ల పతనం తుదికంటా కొనసాగింది. జేసన్‌ మొహమ్మద్‌ (61 బంతుల్లో 40; 4 ఫోర్లు), రోవ్‌మన్‌ పావెల్‌ (43 బంతుల్లో 30; 5 ఫోర్లు) భారత బౌలర్లను కొద్దిసేపు ఎదుర్కొని ఆరో వికెట్‌కు 54 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు.

స్కోరు వివరాలు
భారత్‌ ఇన్నింగ్స్‌: 251/4; విండీస్‌ ఇన్నింగ్స్‌: లూయిస్‌ (బి) ఉమేశ్‌ 2; కైల్‌ హోప్‌ (సి) జాదవ్‌ (బి) పాండ్యా 19; షాయ్‌ హోప్‌ (సి అండ్‌ బి) పాండ్యా 24; చేజ్‌ (బి) కుల్దీప్‌ 2; జేసన్‌ మొహమ్మద్‌ ఎల్బీడబ్లు్య (బి) కుల్దీప్‌ 40; హోల్డర్‌ (స్టంప్డ్‌) ధోని (బి) అశ్విన్‌ 6; పావెల్‌ (సి) పాండ్యా (బి) కుల్దీప్‌ 30; నర్స్‌ (సి) ఉమేశ్‌ (బి) అశ్విన్‌ 6; బిషూ నాటౌట్‌ 4; కమిన్స్‌ ఎల్బీడబ్లు్య (బి) అశ్విన్‌ 1; విలియమ్స్‌ (బి) జాదవ్‌ 1; ఎక్స్‌ట్రాలు 23; మొత్తం (38.1 ఓవర్లలో ఆలౌట్‌) 158.  వికెట్ల పతనం: 1–9, 2–54, 3–58, 4–69, 5–87, 6–141, 7–148, 8–156, 9–157, 10–158. బౌలింగ్‌: భువనేశ్వర్‌ 5–0–19–0; ఉమేశ్‌ 7–0–32–1; పాండ్యా 6–0–32–2; కుల్దీప్‌ 10–1–41–3; అశ్విన్‌ 10–1–28–3; జాదవ్‌ 0.1–0–0–1.

 1భారత్‌ తరఫున వన్డేల్లో అత్యధిక సిక్సర్లు (208) బాదిన ఆటగాడిగా ధోని.
13 భారత్‌ తరఫున వన్డేల్లో 150 వికెట్లు పూర్తి చేసిన 13వ బౌలర్‌గా అశ్విన్‌.

నేను వైన్‌లాంటివాడిని
వయస్సు పెరిగిన కొద్దీ నా ఆటతీరు మరింత మెరుగవుతోంది కాబట్టి నేను వైన్‌ లాంటివాడిని. గత ఏడాదిన్నర కాలం నుంచి మా టాప్‌ ఆర్డర్‌ అద్భుతంగా ఆడుతోంది దీంతో నాకు అవకాశం దొరికినప్పుడల్లా ఒత్తిడి లేకుండా పరుగులు సాధించగలుగుతున్నాను. ఇక మూడో వన్డేలో పిచ్‌ను బట్టి బ్యాటింగ్‌ చేశాను. పరుగులు కష్టమైన తరుణంలో మాకు భాగస్వామ్యం ముఖ్యంగా అనిపించింది. నాకైతే 250 పరుగులు చేయగలం అనిపించింది... అలాగే చేశాం కూడా. చివర్లో నాకు కేదార్‌ చక్కగా సహకరించాడు కాబట్టి ఈ స్కోరు సాధించగలిగాం. ఐపీఎల్‌లో చాలా మ్యాచ్‌లు ఆడిన కుల్దీప్‌ అంతర్జాతీయ స్థాయిలోనూ పరిస్థితిని అర్థం చేసుకుని రాణిస్తున్నాడు.     –ఎంఎస్‌ ధోని

మార్పులకు అవకాశం ఉంది
మా జట్టులో అవకాశం దొరకని ఆటగాళ్లు ఉన్నారు. అందుకే నాలుగో వన్డేలో మార్పుల కోసం చూస్తాం. మరోసారి మ్యాచ్‌లో అద్భుతంగా ఆడగలిగాం. ఉదయం పిచ్‌పై కాస్త తేమ ఉండటంతో టాస్‌ గెలవాలనుకున్నాం. విండీస్‌ అద్భుతంగా బౌలింగ్‌ చేసింది. అయినా 250 పరుగులు సాధించగలిగాం. రెండో ఇన్నింగ్స్‌లో వికెట్‌ కీలకంగా మారింది. మా బౌలర్లు వికెట్లు తీస్తూ ఒత్తిడి పెంచగలిగారు.
–కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి

Advertisement
Advertisement