సంగక్కర సూపర్ ‘ట్రిపుల్’ | Sakshi
Sakshi News home page

సంగక్కర సూపర్ ‘ట్రిపుల్’

Published Thu, Feb 6 2014 1:21 AM

సంగక్కర సూపర్ ‘ట్రిపుల్’

చిట్టగాంగ్ : కుమార సంగక్కర (482 బంతుల్లో 319; 32 ఫోర్లు, 8 సిక్సర్లు) కెరీర్‌లో తొలి ట్రిపుల్ సెంచరీ సాధించడంతో... బంగ్లాదేశ్‌తో రెండో టెస్టులో శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో 587 పరుగుల భారీ స్కోరు సాధించింది. వితనాగే (35), అజంతా మెండిస్ (47) సంగక్కరకు అండగా నిలిచారు. ఈ స్టార్ బ్యాట్స్‌మన్ 277 పరుగుల వ్యక్తిగత స్కోరు దగ్గర ఉన్నప్పుడు తొమ్మిదో వికెట్ పడింది.
 
  చివరి ఆటగాడు ప్రదీప్ (4 నాటౌట్)ను రెండో ఎండ్‌లో నిలబెట్టి సంగక్కర ట్రిపుల్ సెంచరీ పూర్తి చేసుకోవడం విశేషం. బంగ్లా బౌలర్ షకీబ్ ఐదు వికెట్లతో రాణించాడు. బుధవారం రెండో రోజు ఆట ముగిసే సమయానికి బంగ్లాదేశ్ తమ తొలి ఇన్నింగ్స్‌లో వికెట్ నష్టానికి 86 పరుగులు చేసింది. రహమాన్ (45 బ్యాటింగ్), కైస్ (36 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 501 పరుగులు వెనకబడి ఉంది.
 
 బ్రాడ్‌మన్ తర్వాత సంగక్కర...
  టెస్టుల్లో లారాతో సమానంగా సంగక్కర 9 సార్లు 200 పైచిలుకు స్కోర్లు చేశాడు. డాన్ బ్రాడ్‌మన్ 12 సార్లు ఈ ఘనత సాధించాడు.  టెస్టుల్లో వేగంగా 11 వేల పరుగులు చేసిన క్రికెటర్ (208 ఇన్నింగ్స్‌లో)గా సంగక్కర గుర్తింపు పొందాడు.  జయసూర్య, జయవర్ధనేల తర్వాత లంక తరఫున ట్రిపుల్ సెంచరీ చేసిన మూడో ఆటగాడు సంగక్కర కావడం విశేషం.
 

Advertisement
Advertisement