‘కలహాల కాపురం’ ఒక్క రోజుకే... | Sakshi
Sakshi News home page

‘కలహాల కాపురం’ ఒక్క రోజుకే...

Published Sun, Aug 7 2016 2:03 AM

‘కలహాల కాపురం’ ఒక్క రోజుకే...

ఆగస్ట్ 4న లియాండర్ పేస్ రియోలో దిగాడు. 5న ప్రారంభోత్సవంలో పాల్గొని తన ఏడో ఒలింపిక్స్ ఘనతను గుర్తు చేస్తూ కొన్ని ట్వీట్లు చేశాడు... అందులోనూ బోపన్నతో వివాదంపై వివరణ కూడా ఇచ్చేశాడు! 6న ఓటమిపాలై తిరుగు పయనమయ్యాడు... ఇదీ దిగ్గజంగా, దేశం కోసం ప్రాణాలొడ్డే ఆటగాడిగా గుర్తింపు ఉన్న లియాండర్ పేస్ ఒలింపిక్స్‌కు ఇచ్చిన ముగింపు.

రియోలో 84 గంటలు కూడా లేని పేస్ పోరాటం మైదానంలో కూడా 84 నిమిషాలకే ముగిసింది. బోపన్న కూడా తనతో బలవంతంగా జోడీ కట్టించినందుకు కావాలని ‘సహాయ నిరాకరణ’ చేశాడో, లేక నిజంగా ప్రత్యర్థులు బాగా ఆడారో కానీ మొత్తానికి ఈ బలవంతపు భాగస్వామ్యం ఒక్క మ్యాచ్‌కే పరిమితమైంది. ఏడు ఒలింపిక్స్ ఆడినందుకు భారత్ గర్వించాలా... లేక ఇద్దరూ కలిసి దేశాన్ని మోసం చేశారని భావించాలా!

రియో: టెన్నిస్ పురుషుల డబుల్స్‌లో భారత జోడి లియాండర్ పేస్-రోహన్ బోపన్న తొలి రౌండ్‌లోనే ఓటమి పాలై ఒలింపిక్స్ నుంచి నిష్ర్కమించారు. ప్రతిష్టాత్మక క్రీడలకు ముందు కనీసం కలిసి ప్రాక్టీస్ చేయని మన జంట పేలవమైన ఆటతో ప్రత్యర్థికి తలవంచింది. పోలండ్‌కు చెందిన కుబోట్ లుకాజ్-మార్సిస్ మట్‌కోవ్‌స్కీ 6-4, 7-6 (6)తో పేస్-బోపన్నను చిత్తు చేశారు. గంటా 24 నిమిషాల పాటు ఈ మ్యాచ్ సాగింది. తొలి సెట్‌లో మూడు సార్లు సర్వీస్ కోల్పోయిన భారత జోడి సునాయాసంగా సెట్‌ను అప్పగించింది.

రెండో సెట్‌లో కొంత పోరాడే ప్రయత్నం చేసినా లాభం లేకపోయింది. ఐదు ఏస్‌లు సంధించిన పోలండ్ జోడి దూసుకుపోయింది. అయితే భారత్ కోలుకొని వరుస పాయింట్లు సాధించడంతో సెట్ ట్రైబ్రేక్‌కు చేరినా... అక్కడా ప్రత్యర్థిదే పైచేయి అయింది. వాస్తవానికి భారత జంట అనుభవం, గ్రాండ్‌స్లామ్ డబుల్స్‌లలో వారి ప్రదర్శనను చూస్తే ఈ మ్యాచ్‌లో గెలుపు అంత కష్టమేమీ కాదు. నిజానికి చాలా మంది దిగ్గజ ఆటగాళ్లు తప్పుకోవడంతో సెమీఫైనల్ వరకు కూడా వీరికి సులభమైన ‘డ్రా’ పడింది. సొంత ఇగోలను పక్కన పెట్టి కాస్త శ్రమించినా భారత్ ఖాతాలో పతకం చేరేది. కానీ గత లండన్ ఒలిం పిక్స్ వివాదాలను పునరావృతం చేస్తూ వీరిద్దరు దేశం కోసం కాకుండా తమ కోసం ఆడుకున్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement