మరో నాలుగేళ్లు ఆడతాడు | Sakshi
Sakshi News home page

మరో నాలుగేళ్లు ఆడతాడు

Published Fri, Jan 2 2015 1:26 AM

మరో నాలుగేళ్లు ఆడతాడు

ధోని కెరీర్‌పై సంజయ్ పటేల్ వ్యాఖ్య  
వీడ్కోలు టెస్టు కోరుకోలేదన్న కార్యదర్శి

ముంబై: టెస్టుల నుంచి తప్పుకోవాలన్న మహేంద్ర సింగ్ ధోని నిర్ణయాన్ని తాము మార్చాలని ప్రయత్నించినా లాభం లేకపోయిందని బీసీసీఐ కార్యదర్శి సంజయ్ పటేల్ వెల్లడించారు. అతను కనీసం మరో రెండేళ్లు కొనసాగాలని తాము కోరుకున్నట్లు ఆయన చెప్పారు. ‘ఒకవేళ ఒత్తిడిలో రిటైర్మెంట్ గురించి ఆలోచిస్తుంటే దాన్ని వెంటనే మర్చిపో.

వచ్చే ఏడాది కూడా నువ్వే కెప్టెన్‌గా కొనసాగుతావని హామీ ఇస్తున్నా అని ధోనితో చెప్పాను. కానీ అతను అప్పటికే తన నిర్ణయం తీసేసుకున్నాడు. సరిగ్గా చెప్పాలంటే అతను టెస్టు జట్టుకు భారంగా మారాడని బోర్డు గానీ సెలక్టర్లు గానీ అసలు ఏనాడు అనుకోలేదు’ అని పటేల్ అన్నారు. తన అంచనా ప్రకారం ధోని కనీసం 2019 వరకు ఆడుతాడని పటేల్ అభిప్రాయ పడ్డారు. గత ఏడాది వరకు తమకు వైస్ కెప్టెన్ ఆలోచనే లేదని,  భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ధోని కోరడంతోనే వైస్ కెప్టెన్‌ను ఎంపిక చేశామని ఆయన వెల్లడించారు.
 
అది ధోని బ్రాండ్...
ధోని వ్యక్తిత్వాన్ని బట్టి చూస్తే అతను వీడ్కోలు టెస్టు కోరుకునే రకం కాదని సంజయ్ పటేల్ వ్యాఖ్యానించారు. అతని రిటైర్మెంట్ ప్రకటనలోనే అది కనిపించిందని ఆయన అన్నారు. ‘ధోని ఇలాంటి విషయాలు ఎప్పుడూ డిమాండ్ చేయడు. ఎంతో ధైర్యవంతుడైన వ్యక్తే ఇలాంటి నిర్ణయం తీసుకోగలడు. చివరి టెస్టు ఘనంగా ముగించాలనుకుంటే ఈ ఏడాది చివర్లో సొంతగడ్డపై దక్షిణాఫ్రికా సిరీస్ వరకు వేచి చూసేవాడు. అది ధోని బ్రాండ్ రిటైర్మెంట్’ అని పటేల్ చెప్పారు.
 
ధోని ఇక చదువుకోవచ్చు..
రాంచీ: టెస్టుల నుంచి తప్పుకోవడంతో ధోనికి కొంతైనా విరామం దొరుకుతుందని, అతను తన గ్రాడ్యుయేషన్‌ను పూర్తి చేయవచ్చని అతని ఒకనాటి స్కూల్ ప్రిన్సిపల్ ధరంరాజ్ సింగ్ సలహా ఇచ్చారు. ఇక్కడి సెయింట్ గ్జేవియర్ కాలేజీలో డిగ్రీలో అడ్మిషన్ తీసుకున్నా, తగిన హాజరు లేక ధోని మొదటి సంవత్సరం పరీక్షలకు హాజరు కాలేదు. ‘ధోని ప్లస్ టూ మాత్రమే పూర్తి చేశాడని నాకు తెలుసు. ఇకపై అతను అనుకుంటే గ్రాడ్యుయేషన్ పూర్తి చేయవచ్చు. అయితే మరో రకంగా కూడా చదువుతో భాగం కావచ్చు. ధోని ఇప్పుడు ఎంతో పరిణతి చెందాడు. ఇంగ్లీష్‌లో కూడా బాగా మాట్లాడుతున్నాడు. కాబట్టి చిన్నారులకు చదువుపై ఆసక్తి పెరిగి, వారు రాణించేలా తన వంతుగా సహాయం చేయగలడు’ అని ప్రిన్సిపల్ అన్నారు.
 
కోచ్‌గా హస్సీకి ఎంఎస్ సిఫారసు!

బెంగళూరు: భారత క్రికెట్ జట్టు కోచ్ పదవికి మైక్ హస్సీ పేరును ధోని సిఫారసు చేసినట్లు తెలిసింది. ఈ విషయాన్ని నేరుగా ధోని, బీసీసీఐ పెద్దలకు చెప్పినట్లు సమాచారం. ప్రస్తుత కోచ్ ఫ్లెచర్ కాంట్రాక్ట్ ఈ ఏడాది వన్డే ప్రపంచ కప్‌తో ముగియనుంది. హస్సీ వ్యూహ చతురత, నైపుణ్యం భారత కెప్టెన్‌ను ఆకట్టుకున్నాయి. ఇటీవల ఆసీస్ పర్యటనకు ముందు మురళీ విజయ్ టెక్నిక్‌ను కూడా హస్సీ సరిదిద్దాడు. ఈ సిరీస్‌లో విజయ్ అద్భుతంగా రాణిస్తున్న సంగతి తెలిసిందే. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు సభ్యుడిగా హస్సీతో ధోనికి మంచి అనుబంధం ఉంది.
 
మహి వ్యక్తిత్వం గొప్పది: హాడిన్
సిడ్నీ: టెస్టులకు వీడ్కోలు పలికిన మహేంద్ర సింగ్ ధోని గొప్ప వ్యక్తిత్వం గల వ్యక్తి అని ఆస్ట్రేలియా వైస్ కెప్టెన్ బ్రాడ్ హాడిన్ అన్నాడు. అతను చాలా మెరుగైన స్థితిలో జట్టును వదిలి వెళ్లాడన్నాడు. ‘ధోనిలో గొప్పతనం అతని స్వభావం, వ్యక్తిత్వమే. ఆటను ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లాడు. ప్రస్తుత జట్టులో నిలకడను తెచ్చాడు. ఆట విలువను పెంచాడు. అయితే ధోని రిటైర్మెంట్ మాత్రం నాకు ఆశ్చర్యాన్ని కలిగించింది.

భారత క్రికెట్‌కు గొప్ప సేవకుడు. తనతో పాటు జట్టును నడిపిన తీరు అమోఘం. ఎంఎస్‌లోని ప్రశాంతత టీమిండియాకు గొప్ప కెప్టెన్‌గా నిలబెట్టింది. అలాంటి వ్యక్తితో కలిసి క్రికెట్ ఆడటం చాలా గొప్పగా భావిస్తున్నా’ అని హాడిన్ వ్యాఖ్యానించాడు. ఈ సిరీస్‌లో కోహ్లితో జరిగిన మాటల యుద్ధంపై వికెట్ కీపర్ స్పందించలేదు.
 
కోరుకున్న విధంగా ఆడుతున్నాం...
ఈ సిరీస్‌లో తాము కోరుకున్న విధంగా ఆడుతున్నామని హాడిన్ అన్నాడు. ‘మేం సిరీస్ గెలిచాం. ఇది మాకు చాలా ప్రధానమైంది. మెల్‌బోర్న్‌లోనూ సరైన విధంగానే ఆడాం. భారత్‌ను ఈ సిరీస్ నుంచి పూర్తిగా పక్కకు నెట్టాం. సిడ్నీలో కూడా పరిస్థితిలో పెద్దగా మార్పు ఉండదు. ఆట ఎలా సాగుతుందనేది మాకు పూర్తిగా తెలుసు. గెలుపుతో సిరీస్‌ను ముగిస్తే చాలా సంతోషంగా ఉంటుంది. దాని కోసమే మేం ఆడతాం. పది అవకాశాలను సృష్టించుకుంటే గెలుపు మాదే’ అని ఈ వైస్ కెప్టెన్ పేర్కొన్నాడు. షార్ట్ బంతులతో భారత బౌలర్లు తనను లక్ష్యంగా చేసుకున్నా... ఎలాంటి ఇబ్బంది లేదన్నాడు.

Advertisement
Advertisement