'అమ్రాపాలికి' ధోని గుడ్ బై | Sakshi
Sakshi News home page

'అమ్రాపాలికి' ధోని గుడ్ బై

Published Fri, Apr 15 2016 8:45 PM

'అమ్రాపాలికి' ధోని గుడ్ బై

న్యూఢిల్లీ: రియల్ ఎస్టేట్ సంస్థ అమ్రాపాలి బ్రాండ్ అంబాసిడర్ గా భారత క్రికెట్ జట్టు పరిమిత ఓవర్ల కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని తప్పుకున్నాడు. ఆ సంస్థ బ్రాండ్ అంబాసిడర్గా ధోని వైదొలగాలంటూ ఇటీవల సోషల్ మీడియాలో కామెంట్లు పోటెత్తిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అమ్రాపాలికి ధోని గుడ్ బై చెప్పాడు. అయితే దీనిపై అమ్రాపాలి చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ అనిల్ శర్మ స్పందించాడు. ' గత 6-7 సంవత్సరాల నుంచి ధోని మాకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నాడు. అమ్రాపాలికి బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న ధోని ప్రతిష్టను తగ్గించాలనేది మా ఉద్దేశం కాదు.  పరస్పర ఒప్పందంలో భాగంగా ధోని అమ్రాపాలి నుంచి బయటకొచ్చాడు' అని అనిల్ శర్మ తెలిపారు.


గతవారం నోయిడాలోని ఓ హౌసింగ్‌ సొసైటీకి చెందిన కొంతమంది రియల్ ఎస్టేట్ సంస్థ అమ్రాపాలికి బ్రాండ్ అంబాసిడర్‌ గా ఉండటం మానుకోవాలని  ధోనికి సోషల్ మీడియాలో విజ్ఞప్తి చేశారు. నోయిడా సెక్టర్‌ 45లోని 'షప్పైర్‌' ప్రాజెక్టు మొదటి దశను 2009లో అమ్రాపాలి కంపెనీ ప్రారంభించింది. ఇందులో వెయ్యి ఫ్లాట్లు ఉండగా.. నిర్మాణాలు పూర్తికావడంతో 800 కుటుంబాలు ఇందులోకి మారాయి. అయితే ఈ ప్రాజెక్టులోని చాలా టవర్లకు ఇప్పటివరకు విద్యుత్‌, సివిల్‌ పనులు పెండింగ్‌లో ఉన్నాయని సొసైటీ వాసులు చెప్తున్నారు. తమ డిమాండ్లను నెరవేర్చడంలో మేనేజ్‌మెంట్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందంటూ వారు ఆందోళన దిగారు. ఇందులోభాగంగా అమ్రాపాలి ధోనీని దుర్వినియోగం చేసింది (#AmrapaliMisuseDhoni) అనే హ్యాష్‌ట్యాగ్‌తో ఆన్‌లైన్‌ ప్రచారాన్ని ప్రారంభించారు. ధోనీ వెంటనే ఈ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండటం మానుకోవాలని, తమ సొసైటీలోని పెండింగ్ పనులను పూర్తిచేసేలా కంపెనీపై ఒత్తిడి తేవాలంటూ ట్విట్టర్‌, ఫేస్‌బుక్‌ వేదికగా ఉద్యమాన్ని చేపట్టారు. దీంతో అమ్రాపాలి బ్రాండ్ అంబాసిడర్ గా ధోని తప్పుకోకతప్పలేదు. 

Advertisement
Advertisement