ఫైనల్లో షరపోవా | Sakshi
Sakshi News home page

ఫైనల్లో షరపోవా

Published Fri, Jun 6 2014 12:48 AM

ఫైనల్లో షరపోవా

 హలెప్‌తో అమీతుమీ
  ఫ్రెంచ్ ఓపెన్
 
 పారిస్: రష్యా అందాల తార మరియా షరపోవా... ఫ్రెంచ్ ఓపెన్‌లో దూసుకెళ్తోంది. అద్వితీయమైన ఆటతీరుతో వరుసగా మూడోసారి ఫైనల్లోకి ప్రవేశించింది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ సెమీస్‌లో ప్రపంచ ఎనిమిదో ర్యాంకర్, ఏడోసీడ్ షరపోవా 4-6, 7-5, 6-2తో 18వ సీడ్ యూబిన్ బౌచర్డ్ (కెనడా)పై విజయం సాధించింది. గంటా 27 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో రష్యా ప్లేయర్ తొలి సెట్‌ను చేజార్చుకుని పుంజుకుంది. ఆరంభంలో మెరుగ్గా ఆడిన బౌచర్డ్ తొలి సెట్‌లో 3-1 ఆధిక్యంలో నిలిచింది. అయితే షరపోవా బేస్‌లైన్ షాట్లతో స్కోరును 4-4తో సమం చేసింది. ఈ దశలో ప్రత్యర్థి సర్వీస్‌ను బ్రేక్ చేసిన బౌచర్డ్... తన సర్వీస్‌ను నిలబెట్టుకుని సెట్‌ను సొంతం చేసుకుంది. రెండోసెట్‌లో దూకుడును ప్రదర్శించిన షరపోవా 4-1, 5-2 ఆధిక్యాన్ని సంపాదించినా కీలక సమయంలో సర్వీస్‌ను చేజార్చుకుంది. ఇదే క్రమంలో నాలుగు సెట్ పాయింట్లను కోల్పోయి, రెండు డబుల్ ఫాల్ట్‌లు చేసింది. దీంతో బౌచర్డ్ 5-5తో స్కోరును సమం చేసింది. ఇక పట్టు వదలకుండా పోరాడిన రష్యన్ సర్వీస్‌ను నిలబెట్టుకోవడంతోపాటు ఆరో సెట్ పాయింట్‌ను గెలుచుకుని సెట్‌ను చేజిక్కించుకుంది. నిర్ణయాత్మక మూడోసెట్‌లో బౌచర్డ్ ఆట గతి తప్పింది. దీన్ని ఆసరాగా చేసుకున్న షరపోవా మూడో గేమ్‌లో బ్రేక్ పాయింట్ సాధించి 4-1 ఆధిక్యాన్ని సంపాదించింది. తర్వాత వరుస పాయింట్లతో సెట్‌ను, మ్యాచ్‌ను కైవసం చేసుకుంది.
 
 హలెప్ జోరు...
 రెండో సెమీస్‌లో నాలుగోసీడ్ సిమోనా హలెప్ (రొమేనియా) 6-2, 7-6 (7/4)తో 28వ సీడ్ ఆండ్రియా పెట్కోవిచ్ (జర్మనీ)ను ఓడించింది. తొలి సెట్‌లో పెద్దగా ఆకట్టుకోలేకపోయిన పెట్కోవిచ్ రెండోసెట్‌లో గట్టిపోటీ ఇచ్చింది. గంటా 30 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో పెట్కోవిచ్ అనవసర తప్పిదాలతో మూల్యం చెల్లించుకుంది.
 
  మూడు డబుల్ ఫాల్ట్‌లు చేసిన ఈమె ఒకే ఒక్క బ్రేక్ పాయింట్ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంది. మూడు ఏస్‌లు సంధించిన హలెప్.. ఐదు బ్రేక్ పాయింట్లలో మూడింటిని కాపాడుకుంది. మిక్స్‌డ్ డబుల్స్ ఫైనల్లో అనా గ్రేన్‌ఫీల్డ్ (జర్మనీ)-జీన్ రోజర్ (నెదర్లాండ్స్) జోడి 4-6, 6-2 (10-7)తో జూలియా జార్జెస్ (జర్మనీ)-నెనద్ జిమోన్‌జిక్ (సెర్బియా)పై గెలిచి టైటిల్‌ను సొంతం చేసుకుంది.
 

Advertisement
Advertisement