ఆటలో నెం 7.. ధనార్జనలో నెం 1 | Sakshi
Sakshi News home page

ఆటలో నెం 7.. ధనార్జనలో నెం 1

Published Tue, Mar 8 2016 9:26 AM

ఆటలో నెం 7.. ధనార్జనలో నెం 1 - Sakshi

మరియా షరపోవా.. ప్రపంచ మాజీ నెంబర్ వన్ టెన్నిస్ క్రీడాకారిణి. ప్రపంచంలో అత్యధిక సంపాదన గల మహిళా అథ్లెట్. అందానికి మారుపేరు. ఆటతీరు, అందంతో ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న రష్యా టెన్నిస్ స్టార్.. డ్రగ్ పరీక్షల్లో ఫెయిల్ కావడంతో కెరీర్ ప్రశ్నార్థకంగా మారింది. ఈ వార్త షరపోవాతో పాటు అభిమానులకు, క్రీడాకారులకు, క్రీడా సంఘాలకు షాక్ కలిగించింది.

డోపింగ్ పరీక్షల్లో షరపోవా పాజిటీవ్గా తేలడం టెన్నిస్ ప్రపంచంలో కలకలం సృష్టించింది. మెల్డోనియం డ్రగ్ను 2006 నుంచి తీసుకుంటున్నట్టు షరపోవా చెప్పింది. అయితే ఈ డ్రగ్ను ఈ ఏడాదే నిషేధించారు. మెల్డోనియంను నిషేధించిన విషయం.. దీన్ని వాడాలని సూచించిన వైద్యుడికి తెలియదా అన్న ప్రశ్నకు సమాధానం చెప్పేందుకు షరపోవా నిరాకరించింది. పూర్తి బాధ్యత తనదేని చెప్పింది. షరపోవా ఇటీవల గాయాలతో బాధపడుతోంది.  దీని ప్రభావం ఆమె కెరీర్పైనా పడింది.

2001లో డబ్ల్యూటీఏ టూర్లో పాల్గొన్న షరపోవా తక్కువ కాలంలోనే ప్రపంచ అగ్రశ్రేణి క్రీడాకారిణిగా ఎదిగింది. 2004లో వింబుల్డన్ సింగిల్స్ టైటిల్ సాధించిన ఈ రష్యా బ్యూటీ ఆ మరుసటి ఏడాదే 2005లో 18 ఏళ్ల వయసులో ప్రపంచ నెంబర్ వన్ ర్యాంక్ను సొంతం చేసుకుంది. 2006లో యూఎస్ ఓపెన్, 2008లో ఆస్ట్రేలియా ఓపెన్, 2012, 2014ల్లో ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్స్లామ్ సింగిల్స్ టైటిళ్లను గెలిచింది. గత లండన్ ఒలింపిక్స్లో రజత పతకం నెగ్గింది. షరపోవా తన కెరీర్లో 4 ఐటీఎఫ్, 35 డబ్ల్యూటీఏ టైటిల్స్ కైవసం చేసుకుంది. ప్రస్తుతం ఏడో ర్యాంక్లో ఉంది. ఇక ధనార్జనలో షరపోవాదే అగ్రస్థానం. ఫ్రైజ్మనీతో పాటు ఎండార్స్మెంట్ల ద్వారా ప్రపంచంలో అత్యధిక మొత్తం సంపాదిస్తున్న క్రీడాకారిణి షరపోవానే. 2005 నుంచి వరుసగా 11 సంవత్సరాలు అగ్రస్థానంలో ఉండటం విశేషం. గతేడాది ఆమె సంపాదన దాదాపు 200 కోట్ల రూపాయలు. డోపీగా తేలడంతో షరపోవా కెరీర్ ప్రమాదంలో పడింది. అంతేగాక, ఎండార్స్మెంట్లను సంబంధింత కంపెనీలు రద్దు చేసుకునే అవకాశముంది.  షరపోవా డోపీగా తేలిన విషయం తెలిసిన వెంటనే నైక్ రద్దు చేసుకుంది.

Advertisement

తప్పక చదవండి

Advertisement