‘పసిడి’ పోరుకు మేరీకోమ్, సోనియా | Sakshi
Sakshi News home page

‘పసిడి’ పోరుకు మేరీకోమ్, సోనియా

Published Wed, Nov 8 2017 1:06 AM

mary kom and Sonia in the Asian championship  - Sakshi

హో చి మిన్‌ సిటీ (వియత్నాం): గతంలో ఐదుసార్లు విశ్వవిజేతగా నిలిచిన భారత మేటి మహిళా బాక్సర్‌ మేరీకోమ్‌ ఇదే ఘనతను ఆసియా స్థాయిలోనూ పునరావృతం చేసేందుకు విజయం దూరంలో నిలిచింది. ఇక్కడ జరుగుతున్న ఆసియా సీనియర్‌ మహిళల బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌లో మేరీకోమ్‌ (48 కేజీలు)తోపాటు సోనియా లాథెర్‌ (57 కేజీలు) ఫైనల్లోకి దూసుకెళ్లారు. అయితే సరితా దేవి (64 కేజీలు), ప్రియాంక (60 కేజీలు), లవ్లీనా (69 కేజీలు), సీమా పునియా (ప్లస్‌ 81 కేజీలు), శిక్ష (54 కేజీలు) సెమీఫైనల్లో ఓడిపోయి కాంస్య పతకాలతో సరిపెట్టుకున్నారు.  

ఒలింపిక్స్‌ కోసమని గతంలో 51 కేజీల విభాగానికి మారిన మేరీకోమ్‌ ఇటీవలే తన పాత వెయిట్‌ కేటగిరీ 48 కేజీలకు మారింది. మంగళవారం జరిగిన సెమీఫైనల్లో 34 ఏళ్ల మేరీకోమ్‌ 5–0తో సుబాసా కొమురా (జపాన్‌)పై ఏకపక్ష విజయాన్ని సాధించింది. బుధవారం జరిగే ఫైనల్లో కిమ్‌ హ్యాంగ్‌ మి (ఉత్తర కొరియా)తో మేరీకోమ్‌ తలపడుతుంది. ఆరోసారి ఆసియా చాంపియన్‌షిప్‌ ఫైనల్లోకి ప్రవేశించిన మేరీకోమ్‌ నాలుగుసార్లు స్వర్ణ పతకాలు సాధించి, మరోసారి రజతం గెలిచింది. మరో సెమీఫైనల్లో యోగ్దోరాయ్‌ మిర్జయెవా (ఉజ్బెకిస్తాన్‌)పై సోనియా గెలిచి యిన్‌ జున్‌హువా (చైనా)తో బుధవారం జరిగే ఫైనల్‌ పోరుకు సిద్ధమైంది.  ఇతర సెమీఫైనల్స్‌లో డూ డాన్‌ (చైనా) చేతిలో సరితా దేవి; లిన్‌ యు టింగ్‌ (చైనీస్‌ తైపీ) చేతిలో శిక్ష; యోన్‌జీ (కొరియా) చేతిలో ప్రియాంక; ఖల్జోవా (కజకిస్తాన్‌) చేతిలో లవ్లీనా; ఇస్మతోవా (కజకిస్తాన్‌) చేతిలో సీమా పునియా ఓడారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement