మ్యాక్స్ వెల్ మెరుపులు | Sakshi
Sakshi News home page

మ్యాక్స్ వెల్ మెరుపులు

Published Sat, Apr 8 2017 7:29 PM

మ్యాక్స్ వెల్ మెరుపులు

ఇండోర్: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-10 లో కింగ్స్ పంజాబ్ కెప్టెన్ మ్యాక్స్ వెల్ మెరుపులు మెరిపించాడు. శనివారం రైజింగ్ పుణె సూపర్ జెయింట్ తో జరిగిన మ్యాచ్ లో మ్యాక్స్ వెల్ తనదైన శైలిలో బ్యాట్ ఝుళిపించాడు. 20 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సర్లతో 44 పరుగులు చేసి అజేయంగా నిలిచిన  మ్యాక్స్ వెల్  కింగ్స్ పంజాబ్ కు ఘన విజయాన్ని అందించాడు. కింగ్స్ పంజాబ్ 85 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన తరుణంలో మ్యాక్స్ వెల్ ఆదుకున్నాడు. తొలుత నిలకడను ప్రదర్శించిన మ్యాక్స్ వెల్ క్రీజ్ లో కుదురుకున్న తరువాత చెలరేగి ఆడాడు. అక్షర్ పటేల్(24), డేవిడ్ మిల్లర్(30 నాటౌట్;1 ఫోర్ 2 సిక్సర్లు)లతో కలిసి విలువైన భాగస్వామ్యాలను నమోదు చేశాడు. దాంతో పుణె విసిరిన 164 పరుగుల లక్ష్యాన్ని కింగ్స్ పంజాబ్ ఇంకా ఓవర్ మిగిలి ఉండగానే అందుకుని టోర్నీలో బోణి కొట్టింది.

అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన పుణె ఆది నుంచి తడబడుతూనే బ్యాటింగ్ చేసింది. తొలి ఓవర్ లోనే మయాంక్ అగర్వాల్(0) వికెట్ ను పుణె కోల్పోగా, ఆ తరువాత అజింక్యా రహానే(19), కెప్టెన్ స్టీవ్ స్మిత్(26), ఎంఎస్ ధోని(5)లు కూడా నిరాశపరిచారు. పుణె ఆటగాళ్లలో ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్(50;32 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లు) కాసేపు మెరుపులు మెరిపించాడు.

అయితే స్టోక్స్ హాఫ్ సెంచరీ సాధించిన వెంటనే అక్షర్ పటేల్ బౌలింగ్ లో అవుటయ్యాడు. అక్షర్ బౌలింగ్ లో అతనికే క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. చివర్లోమనోజ్ తివారీ(40 నాటౌట్;23 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లు) బ్యాట్ ఝుళిపించడంతో పుణె నిర్ణీత ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 163 పరుగుల గౌరవప్రదమైన స్కోరు సాధించకల్గింది.  

 

Advertisement
Advertisement