Sakshi News home page

బౌండరీ బోర్డులు బిగిస్తూ...

Published Wed, Jul 5 2017 1:25 AM

బౌండరీ బోర్డులు బిగిస్తూ...

విండీస్‌ మాజీ పేసర్‌ విన్‌స్టన్‌ బెంజమిన్‌ పరిస్థితి
ఆంటిగ్వా: వెస్టిండీస్‌ క్రికెట్‌ జట్టు ఇటీవలి ప్రదర్శన ఒక విషాదం అయితే ఆ జట్టుకు ఆడిన మాజీ క్రికెటర్ల పరిస్థితి కూడా అందుకు భిన్నంగా ఏమీ లేదు. ఏ కొందరు ఆటగాళ్లో తప్ప ఎక్కువ మంది బతుకుతెరువు కోసం చిన్నపాటి పనులపై ఆధారపడక తప్పడం లేదు. వెస్టిండీస్‌ అందించిన భీకరమైన పేస్‌ బౌలర్లలో విన్‌స్టన్‌ బెంజమిన్‌ కూడా ఒకరు. మాల్కం మార్షల్‌కు వారసుడిగా ఒకప్పుడు మన్ననలందుకున్న ఆయన 21 టెస్టులు, 85 వన్డేలతో పాటు 171 ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌లు ఆడారు. అయితే ఇప్పుడు ఆయన ఇక్కడి వివ్‌ రిచర్డ్స్‌ స్టేడియంలో గ్రౌండ్స్‌మన్‌గా పని చేస్తున్నారు.

భారత్, విండీస్‌ మధ్య వన్డే మ్యాచ్‌ సందర్భంగా ఈ దృశ్యం కనిపించింది. బౌండరీ లైన్‌ వద్ద ఉండే కుషన్‌లు, బోర్డులు, సైట్‌ స్క్రీన్‌లు బిగించడం ఆయన పని. మ్యాచ్‌లు జరిగే సమయంలో ఒక సూపర్‌వైజర్‌ చేతి కింద సాగే ఈ పని కోసం 52 ఏళ్ల విన్‌స్టన్‌కు రోజుకు 70 డాలర్లు లభిస్తాయి. ‘నిజాయితీగా కష్టపడుతూ దీనిని సంపాదిస్తున్నాను. ఇక్కడివాళ్లకు నేనెవరో అనవసరం. నా పనికి తగిన ప్రతిఫలం ఇమ్మని వారిని కోరాను. ఆటగాడిగా ఉన్న సమయంలో కూడా నేను పెద్దగా సంపాదించలేదు. కాబట్టి నాకు ఏదో ఉద్యోగం అవసరం. నాకు ఇద్దరు చదువుకుంటున్న పిల్లలు ఉన్నారు. ఇలాంటప్పుడు ప్రతీ డాలర్‌ అమూల్యమైనదే’ అని చెప్పుకున్నారు.

Advertisement
Advertisement