కోహ్లిని దాటేశాడు.. | Sakshi
Sakshi News home page

కోహ్లిని దాటేశాడు..

Published Mon, Mar 13 2017 2:04 PM

కోహ్లిని దాటేశాడు..

న్యూఢిల్లీ: అంతర్జాతీయ ట్వంటీ 20ల్లో  టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి అత్యధిక పరుగుల ఘనతను అఫ్గనిస్తాన్ క్రికెటర్ మొహ్మద్ షహజాద్ తాజాగా అధిగమించాడు. ఇప్పటివరకూ 48 ట్వంటీ 20 మ్యాచ్ ల్లో 1709 పరుగులు సాధించి నాల్గో స్థానంలో ఉన్న కోహ్లిని షెహజాద్ వెనక్కునెట్టాడు. ఆదివారం ఐర్లాండ్ తో జరిగిన ట్వంటీ 20 మ్యాచ్ లో షహజాద్ 72 పరుగులు సాధించి సత్తా చాటుకున్నాడు. ఈ క్రమంలోనే విరాట్ కోహ్లిని అధిగమించి ముందు వరుసలోకి వచ్చాడు. తద్వారా షహజాద్ నాల్గో స్థానాన్ని కైవసం చేసుకోగా, కోహ్లి ఐదో స్థానానికి పరిమితమయ్యాడు.


2010-17 నుంచి ఇప్పటివరకూ చూస్తే షహజాద్ 58 మ్యాచ్ల్లో 32.38 సగటుతో 1779 పరుగులు చేశాడు. ప్రస్తుతం ట్వంటీ 20 ర్యాంకింగ్స్ లో ఏడో స్థానంలో ఉన్న షహజాద్.. అఫ్గన్ విజయాల్లో కీలక పాత్ర పోషిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. మరొకవైపు ట్వంటీ 20ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితా లో న్యూజిలాండ్ మాజీ ఆటగాడు బ్రెండన్ మెకల్లమ్ తొలి స్థానంలో ఉన్నాడు. తన ట్వంటీ 20 కెరీర్ లో మెకల్లమ్ 71 మ్యాచ్ ల్లో 2,140 పరుగులు చేశాడు. ఆ తరువాత స్థానాల్లో శ్రీలంక క్రికెటర్ దిల్షాన్(1889),  మార్టిన్ గప్టిల్(1806)లు ఉన్నారు. ఇదిలా ఉంచితే ఇది అఫ్గన్ కు వరుసగా పదకొండో ట్వంటీ 20 విజయం. దాంతో ట్వంటీ 20 ఫార్మాట్ లో వరుసగా అత్యధిక విజయాలు సాధించిన జట్టుగా నిలిచింది. ఈ క్రమంలో తన రికార్డును అఫ్గన్ మరోసారి సవరించుకుంది. గతంలో ట్వంటీ 20 ఫార్మాట్ లో ఇంగ్లండ్, ఐర్లాండ్ జట్లు వరుస ఎనిమిది విజయాలు సాధించిన సంగతి తెలిసిందే.
 

Advertisement
Advertisement