ఆ సమయంలో ఏడ్చేశా: ధోని | Sakshi
Sakshi News home page

ఆ సమయంలో ఏడ్చేశా: ధోని

Published Sat, Nov 4 2017 7:52 PM

MS Dhoni cried after winning the 2011 World Cup final - Sakshi

న్యూఢిల్లీ:2011 లో మహేంద్ర సింగ్ ధోని నేతృత్వంలోని టీమిండియా వన్డే వరల్డ్ కప్ ను అందుకుని 28 ఏళ్ల సుదీర్ఘ విరామానికి తెరదించిన సంగతి తెలిసిందే. సొంతగడ్డపై జరిగిన ఆ మెగా ఈవెంట్ లో టీమిండియా అంచనాలను తారుమారు చేస్తూ వరల్డ్ కప్ ను చేజిక్కించుకుంది. ముంబైలోని వాంఖేడ్ స్టేడియంలో జరిగిన ఫైనల్లో శ్రీలంకపై 6 వికెట్ల తేడాతో గెలిచిన భారత్ జట్టు వరల్డ్ కప్ ను సగర్వంగా అందుకుంది. అదే సమయంలో మైదానంలో ఆటగాళ్లు సంబరాల్లో మునిగిపోయారు. అయితే సిక్స్ ద్వారా భారత్ కు విజయాన్ని అందించిన ధోని మాత్రం తన భావోద్వేగాన్ని ఆపుకోలేక ఏడ్చేశాడట. ఈ విషయాన్ని రాజ్‌దీప్‌ రాసిన 'డెమోక్రసీ ఎలెవన్' పుస్తకంలో ధోనీ వివరించాడు.

' ఆ వరల్డ్ కప్ గెలిచిన తరువాత ఏడ్చేశా. కాకపోతే అది కెమెరాలకు చిక్కలేదు. ఎంతో గొప్ప విజయాన్ని సాధించిన తరువాత భావోద్వేగానికి గురయ్యా. హర్భజన్ సింగ్ నన్ను హత్తుకోవడానికి వచ్చిన క్రమంలో నా కళ్లల్లో కన్నీటిని ఆపుకోలేకపోయా. కాసేపు తల దించుకుని ఏడుస్తూనే ఉన్నా'అని ధోని తెలిపాడు.


ఆ తుది పోరులో లంకేయులు విసిరిన 275 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత్ జట్టు అద్భుతమైన గెలుపును అందుకుంది. భారత్ కు శుభారంభం దక్కపోయినా గంభీర్-విరాట్ కోహ్లిల ఇన్నింగ్స్ తో మ్యాచ్ ను నిలబెట్టారు. కోహ్లి అవుటైన తరువాత క్రీజ్ లోకి వచ్చిన ధోని బాధ్యతాయుతంగా ఆడాడు. గంభీర్ తో కలిసి జట్టును ముందుకు తీసుకెళ్లాడు. 49 ఓవర్ రెండో బంతిని సిక్స్ గా మలిచి జట్టుకు గెలుపును అందించాడు. దాంతో భారత్ జట్టు తన క్రికెట్ చరిత్రలో రెండోసారి వన్డే వరల్డ్ కప్ ను సాధించింది. 1983 లో తొలిసారి కపిల్ దేవ్ నేతృత్వంలో భారత జట్టు వరల్డ్ కప్ గెలిచిన సంగతి తెలిసిందే.

Advertisement
Advertisement