ధోని ఆనా'టి' జ్ఞాపకం | Sakshi
Sakshi News home page

ధోని ఆనా'టి' జ్ఞాపకం

Published Fri, Mar 3 2017 4:02 PM

ధోని ఆనా'టి' జ్ఞాపకం

కోల్ కతా: తన క్రికెట్ కెరీర్ లో ఎన్నో అద్భుత విజయాలను చవిచూసిన టీమిండియా మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోని ఇప్పుడు సాధారణ జీవితం గడిపేందుకు ఆసక్తి చూపుతున్నాడు. మిస్టర్ కూల్ అయిన ధోని బ్యాటింగ్ లోనే కాదు, వ్యక్తిగత జీవితంలోనే కొన్ని మెరుపులు మెరిపిస్తూ ఉంటాడు. సాధారణంగా పాపులర్ అవ్వగానే తమ గతాన్ని మరిచిపోయే సెలబ్రెటీ జాబితాలో ధోని ఎంత మాత్రం ఉండడు. తన జీవితంలో వీలు చిక్కినప్పుడల్లా తన స్నేహితులను కలిసి పాత రోజులను గుర్తుచేసుకునే ఈ స్టార్ క్రికెటర్ అందుకోసం వచ్చిన ఏ అవకాశాన్ని వదులుకోడు. ముఖ్యంగా స్నేహానికి ధోని ఎంత విలువ ఇస్తాడో తాజాగా విజయ్ హజారే ట్రోఫీ సందర్భంగా మరోసారి బయటపడింది.

చిన్న టీ స్టాల్ ను నడుపుకునే థామస్ అనే వ్యక్తితో గతంలో తనకు పరిచయాన్ని ధోని మరిచిపోలేదు. పశ్చిమ బెంగాల్ లోని ఖరగ్ పూర్ రైల్వే స్టేషన్ బయట ఓ చిన్న టీ కొట్టు నడుపుకుంటూ ఉంటాడు. దాదాపు పదమూడేళ్ల క్రితం ధోనీ జూనియర్ టీటీ గా పని చేస్తున్న సమయంలో కనీసం మూడుసార్లు ఆ టీ స్టాల్ దగ్గరకు వెళ్లేవాడట. ఆ క్రమంలోనే వారి మధ్య స్నేహం కూడా ఏర్పడింది.  కాల గమనంలో సంవత్సరాలు గడిచిపోయాయి కూడా. తన దగ్గర టీ తాగిన వ్యక్తి అంతర్జాతీయ స్థాయికి వెళ్లాడని థామస్ అనుకోవడం తప్ప ఏనాడు అతన్ని కలిసే అవకాశం రాలేదు.

 

అయితే విజయ్ హజారే ట్రోఫీ సందర్భంగా పశ్చిమ బెంగాల్ కు ధోని వచ్చాడని తెలుసుకున్న థామస్ వెంటనే ఈడెన్ గార్డెన్ మైదానంకు  చేరుకుని కష్టం మీద డ్రెస్సింగ్ రూం దాకా చేరుకోగలిగాడు. ఇక థామస్ ను ధోని చూడటం, అమాంతం పరుగెత్తుకుంటూ వెళ్లి అతడ్ని గట్టిగా వాటేసుకోవడం జరిగిపోయాయి. థామస్ తో కాసేపు సరదాగా గడిపిన ధోని.. అతన్ని హోటల్ కు తీసుకెళ్లి డిన్నర్ ఇచ్చాడు. ఆ తరువాత ఇంటి దగ్గర డ్రాప్ చేసి మరీ తన అభిమానాన్ని చాటుకున్నాడు ధోని. దశాబ్దం తర్వాత తన  ఫ్రెండ్ ను కలుసుకున్న సంతోషం ఆ చాయ్ వాలా ముఖంలో స్పష్టంగా కనిపిస్తోంది. అంతేకాదు తన షాప్ పేరును ధోనీ టీ స్టాల్ గా మార్చుకునేందుకు డిసైడ్ అయ్యాడు థామస్.

Advertisement
Advertisement