'లీడర్' వెడలె...

5 Jan, 2017 06:35 IST|Sakshi
'లీడర్' వెడలె...

వన్డే, టి20 కెప్టెన్సీ నుంచి తప్పుకున్న ధోని
బీసీసీఐకి సమాచారమిచ్చిన మహి
ఆటగాడిగా అందుబాటులో
   

భారత క్రికెట్‌ చరిత్రలో మహా నాయకుడి శకం ముగిసింది. మైదానంలో అందరినీ ఆశ్చర్యపరిచే తన వ్యూహాలలాగే మహేంద్ర సింగ్‌ ధోని మరోసారి అంచనాలకు అందకుండా వ్యవహరించాడు. ‘కెప్టెన్‌ ఇలా కూడా ఉంటాడా’ అనిపించిన క్షణాల నుంచి ‘ఇలా కూడా ఉండవచ్చు’ అని చూపిస్తూనే ఇలాగే ఉండాలి అంటూ నిరూపించిన మహేంద్రుడు తన బాధ్యతను ముగించాడు. లీడర్‌ హోదాలో అన్నగా, అండగా ఎందరో కుర్రాళ్లకు మార్గనిర్దేశనం చేసిన మహి, తన కర్తవ్యం పూర్తయిందనిపించాడు. ‘ముందుండి నడిపించే’ భారాన్ని మాత్రం తొలగించుకొని వికెట్ల ముందు, వెనకా మరోసారి తనలోని పాత ధోనిని ప్రదర్శించేందుకు మాత్రం సిద్ధమంటూ ధనాధన్‌ నిర్ణయం తీసుకున్నాడు.   

ముంబై: భారత క్రికెట్‌ జట్టు వన్డే, టి20 జట్ల నాయకత్వ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు మహేంద్ర సింగ్‌ ధోని ప్రకటించాడు. జట్టు కెప్టెన్‌గా ఇకపై కొనసాగబోనని అతను భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ)కి సమాచారం అందించాడు. అయితే ఈనెల 15 నుంచి ఇంగ్లండ్‌తో జరిగే సిరీస్‌కు ఆటగాడిగా మాత్రం అందుబాటులో ఉంటానని అతను వెల్లడించాడు. ఈ వివరాలు బుధవారం బీసీసీఐ ప్రకటించింది. ‘అన్ని ఫార్మాట్‌లలో భారత క్రికెట్‌ జట్టు కెప్టెన్‌గా ఎంఎస్‌ ధోని అందించిన సేవలకు ప్రతీ భారత క్రికెట్‌ అభిమాని, బీసీసీఐ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అతని నాయకత్వంలో భారత జట్టు అత్యున్నత స్థాయికి చేరింది. అతని ఘనతలు ఎప్పటికీ నిలిచి ఉంటాయి’ అని బోర్డు సీఈఓ రాహుల్‌ జోహ్రి వ్యాఖ్యానించారు. 2014 డిసెంబర్‌లో టెస్టు కెప్టెన్సీతో పాటు ఆ ఫార్మాట్‌కే గుడ్‌బై చెప్పిన ధోని, ఇప్పుడు పూర్తిగా టీమిండియా నాయకత్వ బాధ్యతల నుంచి తప్పుకున్నట్లయింది. ధోని భారత్‌కు 199 వన్డేల్లో, 72 టి20 మ్యాచ్‌లలో కెప్టెన్‌గా వ్యవహరించాడు.
 
ఎందుకీ నిర్ణయం?
తాను కెప్టెన్‌గా వ్యవహరించిన కాలంలో నాయకత్వ వైఫల్యాలపై విమర్శలు, ఎప్పుడు బాధ్యతల నుంచి తప్పుకుంటాడనే ప్రశ్నలు ఎదుర్కోవడం ధోనికి కొత్త కాదు. కోహ్లి టెస్టుల్లో తిరుగులేని లీడర్‌గా ఎదిగిన గత రెండేళ్లలో అది మరింత ఎక్కువైంది. టెస్టుల్లో లేకపోవడం వల్ల జట్టుతో కొనసాగడంలో చాలా విరామం వస్తోంది. ఫలితంగా ఇప్పుడు ఉన్న ఆటగాళ్లంతా ఒకరకంగా ‘కోహ్లి జట్టు’గా మారిపోయారు. ధోని తప్పుకొని కోహ్లిని కెప్టెన్‌ చేయాలనే డిమాండ్‌ మళ్లీ మొదలైంది. వీటిని పట్టించుకోకుండా ధోని తన పని తాను చేసుకుంటూ పోయాడు. అయితే టెస్టు టీమ్‌ అద్భుతాలు చేసిన వెంటనే వన్డేల్లో వచ్చిన సాధారణ ఫలితాలు వద్దన్నా పోలికను తెచ్చి ఎమ్మెస్‌పై ఒత్తిడి పెంచాయి. అయితే ఇలాంటి ఇబ్బందులు ఎన్ని ఉన్నా బోర్డు పెద్దలలో అతని నాయకత్వ ప్రతిభపై ఎవరికీ సందేహాలు లేవు. కాబట్టి వెంటనే అవమానకరంగా తొలగిస్తారనే సంకేతాలు కూడా ఏమీ లేవు. రాబోయే కొన్ని సిరీస్‌ల ఫలితాలు ఎలా ఉన్నా కనీసం ఈ ఏడాది జూన్‌లో జరిగే చాంపియన్స్‌ ట్రోఫీ వరకు అయినా అతను కొనసాగుతాడని అంతా భావించారు. ఆ తర్వాత మాత్రమే 2019 వన్డే వరల్డ్‌ కప్‌ కోసం వచ్చే రెండేళ్ల కాలంలో కోహ్లి నేతృత్వంలో జట్టు సిద్ధమవుతుందని అనుకున్నారు. కానీ ధోని మాత్రం మరోలా ఆలోచించాడు. తాను తప్పుకునే సమయం ఆసన్నమైందని భావించాడు. 2019లో ఇంగ్లండ్‌లో జరిగే ప్రపంచ కప్‌ కోసం సన్నాహకం 2017లో ఇంగ్లండ్‌ నుంచి మొదలు కావాలని కూడా అతను అనుకొని ఉంటాడు. అందుకే తనను తప్పించే అవకాశం ఇవ్వకుండా తనంతట తానుగా నిష్క్రమించాడు.

ఆటగాడిగా ఎంతకాలం?
టెస్టుల్లో కెప్టెన్‌గానే ఆట ముగించిన ధోని పరిమిత ఓవర్లలో మాత్రం మరొకరి నాయకత్వంలో ఆడేందుకు సిద్ధమయ్యాడు. అయితే అతని ఫిట్‌నెస్, దూకుడైన బ్యాటింగ్, తెలివైన వికెట్‌ కీపింగ్‌ కలిపి చూస్తే ఈ రెండు ఫార్మాట్‌లలో కచ్చితంగా అతని అవసరం ఉందనిపిస్తుంది. తన ఆఖరి వన్డే సిరీస్‌లో అతను మెరుగైన ప్రదర్శన కనబర్చాడు. కాబట్టి ప్రస్తుతం ఆటగాడిగా ధోని స్థానానికి ఢోకా లేదు. ముఖ్యంగా ఇటీవల తాను నిర్ణయించుకున్న విధంగా నాలుగో స్థానంలో పూర్తి స్థాయి బ్యాట్స్‌మన్‌గా ఆడాలని అతను ఆశిస్తున్నాడు. గత ఏడాది టి20 ప్రపంచ కప్‌ సెమీ ఫైనల్‌ తర్వాత అతను చేసిన వ్యాఖ్యలు చూస్తే 2019 వరకు కూడా కొనసాగే ఉద్దేశం ఉందని అర్థమైంది. కానీ ఎంత ఫిట్‌గా ఉన్నా... కొత్త కుర్రాళ్లతో వచ్చే వరల్డ్‌ కప్‌పై దృష్టి పెట్టిన జట్టులో అతను తన స్థానం కాపాడుకోవాలంటే అద్భుతాలు చేయాల్సిందే. ఈ ఏడాది జులైలో చాంపియన్స్‌ ట్రోఫీ ముగిసే సమయానికి 36 ఏళ్లు పూర్తయ్యే మహి కొనసాగడంపై మరోసారి ‘స్కానింగ్‌’ జరగడం మాత్రం ఖాయం!

‘ధోనికి శుభాకాంక్షలు. భారత్‌కు రెండు (టి20, వన్డే) ప్రపంచకప్‌లు అందించాడు. నేను చూసిన అత్యుత్తమ కెప్టెన్‌లలో మహి ఒకడు. అతని నిర్ణయాన్ని మనమంతా గౌరవించాలి’ – సచిన్‌ టెండూల్కర్‌

‘అతని అంకితభావం మనందరికి తెలుసు. ఉన్నతమైన ఆలోచనలతో జట్టును నడిపించాడు. ఇపుడు కెప్టెన్సీపై కూడా ఆలోచించే నిర్ణయం తీసుకున్నాడని భావిస్తున్నా’ – సెలక్షన్‌ కమిటీ చైర్మన్‌ ఎమ్మెస్కే ప్రసాద్‌

>
మరిన్ని వార్తలు