వాళ్లంతా ‘అసూయాపరులు’ | Sakshi
Sakshi News home page

వాళ్లంతా ‘అసూయాపరులు’

Published Sat, Nov 11 2017 12:02 AM

MS Dhoni target of 'jealous' people who want him out of India cricket  - ravi shastri - Sakshi

కోల్‌కతా: న్యూజిలాండ్‌తో రెండో టి20 మ్యాచ్‌లో నెమ్మదైన బ్యాటింగ్‌ ప్రదర్శన తర్వాత ధోని పొట్టి ఫార్మాట్‌ నుంచి తప్పుకోవాలని మాజీ క్రికెటర్లు అభిప్రాయ పడటం... అనవసరంగా విమర్శిస్తున్నారంటూ కెప్టెన్‌ కోహ్లి తన సహచరుడికి అండగా నిలవడం తెలిసిందే. ఇప్పుడు భారత హెడ్‌ కోచ్‌ రవిశాస్త్రి కూడా ధోనికి తన పూర్తి మద్దతు ప్రకటించారు. అసూయతోనే వారంతా ధోనిని విమర్శిస్తున్నారని శాస్త్రి అన్నారు. ‘పరిస్థితి చూస్తుంటే అన్ని వైపులా కొంత మంది అసూయాపరులైన వ్యక్తులే ఉన్నట్లుగా కనిపిస్తోంది. వారంతా ధోని మళ్లీ మళ్లీ విఫలం కావాలని కోరుకుంటున్నారు. వీళ్లంతా ధోని కెరీర్‌ ముగిసిపోవడం గురించి వేచి చూస్తున్నారు.

అయితే ధోనిలాంటి గొప్ప ఆటగాళ్లు తమ భవిష్యత్తును తామే నిర్దేశించుకోగలరు. ఇలాంటి విమర్శలను నేను పట్టించుకోను. జట్టులో ధోని పాత్ర ఏమిటో మాకు బాగా తెలుసు. అతను ఒకప్పుడు గొప్ప నాయకుడు. ఇప్పుడు కూడా పూర్తిగా జట్టు ప్రయోజనాల కోసమే పని చేసే వ్యక్తి’ అని రవిశాస్త్రి ఘాటుగా వ్యాఖ్యానించారు. టీవీ చానళ్లు నడవాలంటే ధోనిలాంటి ప్రముఖ ఆటగాళ్ల గురించి ఏదో రూపంలో చర్చ కొనసాగుతూనే ఉండాలని, అందువల్లే మాజీ క్రికెటర్లు, విశ్లేషకులు ధోనిని విమర్శిస్తున్నారని శాస్త్రి అభిప్రాయపడ్డారు.   

Advertisement
Advertisement