కోహ్లి, కుంబ్లే మధ్య రాజీ యత్నాలు! | Sakshi
Sakshi News home page

కోహ్లి, కుంబ్లే మధ్య రాజీ యత్నాలు!

Published Thu, Jun 1 2017 12:08 AM

కోహ్లి, కుంబ్లే మధ్య రాజీ యత్నాలు!

న్యూఢిల్లీ: చాంపియన్స్‌ ట్రోఫీలో భాగంగా కీలకమైన పాకిస్తాన్‌తో మ్యాచ్‌కు ముందు భారత జట్టులో నెలకొన్న విభేదాలపై బీసీసీఐలో ఆందోళన వ్యక్తమవుతోంది. దీంట్లో భాగంగా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి, కోచ్‌ అనిల్‌ కుంబ్లే మధ్య ఏర్పడిన దూరాన్ని తగ్గించాలని బోర్డు నిర్ణయించింది. ఇందుకు బోర్డు సంయుక్త కార్యదర్శి అమితాబ్‌ చౌదరి, క్రికెట్‌ ఆపరేషన్స్‌ జీఎం ఎంవీ శ్రీధర్‌ను నియమించారు. వీరు బర్మింగ్‌హామ్‌లో ఇద్దరితో విడివిడిగా సమావేశమై విభేదాలను సద్దుమణిగేలా చేసేందుకు ప్రయత్నం చేయనున్నారు. మరోవైపు కొత్త కోచ్‌ ఎంపిక ప్రక్రియను ఈనెల 4న పాకిస్తాన్‌తో జరిగే మ్యాచ్‌ అనంతరం బీసీసీఐ ప్రారంభించనుంది. మే 31తో అభ్యర్థుల దరఖాస్తుల గడువు ముగిసింది.

 చాంపియన్స్‌ ట్రోఫీ అనంతరం జట్టు వెస్టిండీస్‌ పర్యటనకు వెళ్లనుంది. ఆలోపునే జట్టు కోచ్‌ ఎవరనేది తేలిపోతుందని బోర్డు స్పష్టం చేసింది. అయితే ఈ పదవి కోసం ఇప్పటిదాకా ఎవరెవరు ముందుకు వచ్చారనే విషయం బోర్డు చెప్పడం లేదు. టామ్‌ మూడీ పేరు బాగానే ప్రచారం అవుతున్నా బోర్డు నుంచి మాత్రం స్పందన లేదు. దరఖాస్తులన్నింటిని బోర్డు సీఈవో రాహుల్‌ జోహ్రి లండన్‌లో ఉన్న క్రికెట్‌ సలహా కమిటీ (సీఏసీ) సభ్యులకు అందించనున్నారు. ‘ఇంటర్వూ్యలన్నీ ఇంగ్లండ్‌లోనే జరపాలా? లేదా? అనే విషయం సీఏసీ నిర్ణయిస్తుంది. ఇది పూర్తిగా వారికి సంబంధించిన విషయం. కుంబ్లే కూడా మరోసారి కమిటీ ముందు రావాలా అనేది కూడా వారే తేలుస్తారు’ అని బోర్డు వర్గాలు తెలిపాయి.

‘కెప్టెన్, కోచ్‌ అభిప్రాయాలు ఒకేలా ఉండవు’
ఎప్పుడైనా జట్టు కెప్టెన్, కోచ్‌ ఒకేలా ఆలోచిస్తారనుకోవడం సరికాదని, అలా ఎప్పుడూ జరగదని మాజీ కెప్టెన్‌ సునీల్‌ గావస్కర్‌ అన్నారు. కోహ్లి, కుంబ్లే మధ్య విభేదాల గురించి స్పందిస్తూ.. ‘అదంతా నిజమో కాదో తెలీదు కానీ చాంపియన్స్‌ ట్రోఫీ ముందు ఈ పరిస్థితి ఉండకూడదు. కచ్చితంగా కోచ్‌ అనే వ్యక్తి ప్రస్తుత తరంకన్నా ముందు ఆడినవారై ఉంటారు. అందుకే వారి దృక్పథం వేరేలా ఉంటుంది. ఇక జట్టు విజయాల గురించి మాట్లాడితే కుంబ్లే అద్భుతంగా బాధ్యతలు నిర్వర్తించారు. ప్రతీ కోచ్‌ జట్టు 10 ఏళ్ల భవిష్యత్‌ను ఊహించి పనిచేయాలి. కెప్టెన్, కోచ్‌లతో సీఏసీ సభ్యులు మాట్లాడతారని అనుకుంటున్నాను’ అని గావస్కర్‌ చెప్పారు.

Advertisement
Advertisement