ఆశలు ఆవిరి! | Sakshi
Sakshi News home page

ఆశలు ఆవిరి!

Published Mon, Mar 3 2014 12:22 AM

ఆశలు ఆవిరి!

చివరి వరకు ఉత్కంఠ... నువ్వా, నేనా అంటూ పోటీ... భారత్, పాకిస్థాన్ మధ్య మ్యాచ్ ఎలా ఉండాలని సాధారణ అభిమాని ఆలోచిస్తాడో సరిగ్గా అదే తరహాలో మిర్పూర్ వన్డే సాగింది. అయితే విజయం మాత్రం ప్రత్యర్థినే వరించింది. ముందుగా భారత జట్టు సగటు బ్యాటింగ్ ప్రదర్శననే కనబర్చింది. ముగ్గురు ఆటగాళ్ల అర్ధ సెంచరీలతో కోలుకున్నా... ఆ ప్రదర్శన భారీ స్కోరుకు బాట వేయలేకపోయింది.
 
 చివరి ఓవర్లలో బ్యాటింగ్ వైఫల్యం తుది ఫలితంపై ప్రభావం చూపించింది. పాకిస్థాన్‌కు మాత్రం అది భారీ లక్ష్యమే అయిపోయింది. టీమిండియా స్పిన్నర్లు కట్టడి చేయడంతో చివరి వరకు ఆ జట్టు పోరాడాల్సి వచ్చింది. కోహ్లి సేన గెలుపు ముంగిట నిలిచినా... అపార అనుభవజ్ఞుడు షాహిద్ ఆఫ్రిది తనదైన మెరుపులతో జట్టును గెలిపించాడు.
 
 మిర్పూర్: వన్డే క్రికెట్‌లో భారత్, పాకిస్థాన్ మధ్య మరో చిరస్మరణీయ పోరుకు ఆసియా కప్ వేదికగా నిలిచింది. ఆదివారం ఇక్కడి షేర్-ఎ-బంగ్లా స్టేడియంలో హోరాహోరీగా జరిగిన లీగ్ మ్యాచ్‌లో పాకిస్థాన్ వికెట్ తేడాతో భారత్‌పై విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 245 పరుగులు చేసింది.
 
 అంబటి తిరుపతి రాయుడు (62 బంతుల్లో 58; 4 ఫోర్లు, 1 సిక్స్), రోహిత్ శర్మ (58 బంతుల్లో 56;  7 ఫోర్లు, 2 సిక్స్‌లు), రవీంద్ర జడేజా (49 బంతుల్లో 52 నాటౌట్; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధ సెంచరీలు చేశారు. అనంతరం పాకిస్థాన్ 49.4 ఓవర్లలో 9 వికెట్లకు 249 పరుగులు చేసింది. మొహమ్మద్ హఫీజ్ (117 బంతుల్లో 75; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) చక్కటి ఇన్నింగ్స్‌తో విజయానికి పునాది వేశాడు. షాహిద్ ఆఫ్రిది (18 బంతుల్లో 34 నాటౌట్; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు) చివర్లో మెరిశాడు. చివరి 4 బంతుల్లో పాక్ విజయానికి 9 పరుగులు కావాల్సి ఉండగా ఆఫ్రిది వరుసగా రెండు సిక్సర్లు బాది మ్యాచ్‌ను ముగించాడు. ఈ ఓటమితో ఆసియా కప్‌లో ఫైనల్ చేరాలనుకున్న భారత్ ఆశలకు ఎదురుదెబ్బ తగిలింది.
 
 మూడు అర్ధ సెంచరీలు...
 టాస్ ఓడిన భారత్ ముందుగా బ్యాటింగ్‌కు దిగింది. ఫోర్‌తో ఇన్నింగ్స్‌ను ఆరంభించినా... శిఖర్ ధావన్ (10) ఎక్కువ సేపు నిలబడలేకపోయాడు. అయితే మరో ఓపెనర్ రోహిత్ శర్మ మాత్రం చాలా కాలం తర్వాత చెప్పుకోదగ్గ బ్యాటింగ్ ప్రదర్శన కనబర్చాడు. మొదటి నుంచి ధాటిగా ఆడిన అతను గుల్, జునేద్ బౌలింగ్‌లలో ఒక్కో సిక్సర్ బాదాడు. మరోవైపు విరాట్ కోహ్లి (5) అరుదైన వైఫల్యంతో జట్టు ఇన్నింగ్స్ తడబడింది. గుల్ బౌలింగ్‌లో థర్డ్‌మ్యాన్ వైపు ఆడబోయి కోహ్లి, కీపర్‌కు క్యాచ్ ఇచ్చాడు. చక్కటి షాట్లతో 44 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్న రోహిత్ ఆ వెంటనే పుల్ షాట్‌కు ప్రయత్నించి అవుటయ్యాడు. తొలి వన్డే ఆడుతున్న తల్హాకు ఇదే మొదటి వికెట్ కావడం విశేషం. నింపాదిగా ఆడిన అజింక్యా రహానే (50 బంతుల్లో 23; 3 ఫోర్లు) కూడా తల్హా బౌలింగ్‌లోనే వెనుదిరిగాడు.
 
 ఈ దశలో రాయుడు, కార్తీక్ (46 బంతుల్లో 23; 1 ఫోర్) కలిసి సమన్వయంతో ఆడారు. వీరిద్దరు ఐదో వికెట్‌కు 52 పరుగులు జోడించారు. కార్తీక్ అవుటైనా... రాయుడు 55 బంతుల్లో కెరీర్లో రెండో అర్ధ సెంచరీ అందుకున్నాడు. ఆ తర్వాత రాయుడు, జడేజా భాగస్వామ్యం జట్టుకు కీలకమైన పరుగులు అందించింది. 7 పరుగుల వద్ద అంపైర్ చలవతో, 12 పరుగుల వద్ద సునాయాస క్యాచ్‌ను హఫీజ్ నేలపాలు చేయడంతో బతికిపోయిన జడేజా ఆ తర్వాత చెలరేగాడు. ఆరో వికెట్‌కు 59 పరుగులు జత చేసిన అనంతరం రాయుడు పెవిలియన్ చేరాడు. ఇన్నింగ్స్ 48వ ఓవర్లో 16 పరుగులు చేసిన భారత్... చివరి 2 ఓవర్లలో 8 పరుగులు మాత్రమే చేయగలిగింది. 46 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకొని జడేజా అజేయంగా నిలిచాడు.
 
 కీలక భాగస్వామ్యం...
 సాధారణ విజయలక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్థాన్‌కు ఓపెనర్లు షెహజాద్ (44 బంతుల్లో 42; 6 ఫోర్లు), షర్జీల్ (30 బంతుల్లో 25; 3 ఫోర్లు, 1 సిక్స్) శుభారంభం ఇచ్చారు. భారత బౌలర్లను అలవోకగా ఎదుర్కొంటూ వీరు వేగంగా పరుగులు సాధించారు. ఇద్దరూ ధాటిగా ఆడటంతో పవర్‌ప్లేలో పాక్ వికెట్ నష్టపోకుండా 67 పరుగులు చేసింది. అయితే అశ్విన్ చక్కటి బంతికి షర్జీల్ బౌల్డ్ కావడంతో 71 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యానికి తెర పడింది.
 
 కొద్దిసేపటికే మిశ్రా బౌలింగ్‌లో షెహజాద్ వెనుదిరగ్గా... సమన్వయ లోపంతో మిస్బా (1) రనౌట్ కావడంతో పాక్ మూడు పరుగుల వ్యవధిలోనే రెండు వికెట్లు కోల్పోయింది. ఆ వెంటనే ఉమర్ అక్మల్ (4) కూడా పెవిలియన్ చేరాడు. అయితే ఈ దశలో హఫీజ్, మఖ్సూద్ (53 బంతుల్లో 38; 2 ఫోర్లు, 1 సిక్స్) కలిసి ఇన్నింగ్స్‌ను నిలబెట్టారు. పరుగులు పెద్దగా రాకపోయినా వికెట్ కాపాడుకోవడానికి వీరిద్దరు ప్రాధాన్యతనిచ్చారు. ఈ క్రమంలో 82 బంతుల్లో హఫీజ్ అర్ధ సెంచరీ పూర్తయింది. వీరిద్దరు ఐదో వికెట్‌కు 87 పరుగులు జోడించడమే పాక్‌ను విజయానికి చేరువ చేసింది.
 
 బంతి బంతికీ ఉత్కంఠ
 హఫీజ్, మఖ్సూద్‌ల భాగస్వామ్యంతో పాక్ గెలుపు ఖాయమనిపించింది. 39 బంతుల్లో 46 పరుగులు చేయాల్సిన స్థితిలో ఆ జట్టు నిలిచింది. అప్పుడు స్వీప్‌కు ప్రయత్నించి హఫీజ్ అవుటయ్యాడు. మరో మూడు పరుగుల తర్వాతే అనవసర పరుగుకు ప్రయత్నించి మఖ్సూద్ వెనుదిరిగాడు. దాంతో భారత్ శిబిరంలో ఆనందం. ఈ దశలో ఆఫ్రిది వరుసగా సిక్స్, ఫోర్ కొట్టడంతో మ్యాచ్ పాక్ వైపు మొగ్గింది. 47వ ఓవర్లో కూడా 13 పరుగులు రావడంతో ఇక మన ఓటమి ఖాయమనిపించింది. 48వ ఓవర్లో షమీ నాలుగు పరుగులే ఇచ్చాడు. దాంతో పాక్‌కు చివరి రెండు ఓవర్లలో 13 పరుగులు అవసరమయ్యాయి. ఆఫ్రిది ఉన్నాడన్న ధీమా పాక్‌దైతే... అతని వికెట్ తీస్తే చాలని భారత్ భావించింది.
 
 అయితే తర్వాత ఓవర్లో భువనేశ్వర్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. 3 పరుగులే ఇచ్చి రెండు వికెట్లు తీశాడు. దాంతో మ్యాచ్‌పై మళ్లీ టీమిండియాకు ఆశలు. ఆఖరి ఓవర్లో 10 పరుగులు చేయాలి... బౌలర్ అశ్విన్. తొలి బంతికే అజ్మల్‌ను అవుట్ చేయడంతో భారత్ విజయానికి వికెట్ దూరంలో నిలిచింది. ఆఖరి ఆటగాడు జునేద్ సింగిల్ తీసి ఆఫ్రిదికి స్ట్రైక్ ఇచ్చాడు. అంతే... ఆ తర్వాతి రెండు బంతులకే మ్యాచ్ ఖతం! నియంత్రణతో ఆడకపోయినా ఆఫ్రిది బలంగా బాదడంతో వరుసగా రెండు సిక్సర్లు... భారత జట్టులో నైరాశ్యం.
 
 స్కోరు వివరాలు
 భారత్ ఇన్నింగ్స్: రోహిత్ (సి) హఫీజ్ (బి) తల్హా 56; ధావన్ (ఎల్బీ) (బి) హఫీజ్ 10; కోహ్లి (సి) అక్మల్ (బి) గుల్ 5; రహానే (సి) హఫీజ్ (బి) తల్హా 23; రాయుడు (సి) (సబ్) అన్వర్ (బి) అజ్మల్ 58; కార్తీక్ (సి) అజ్మల్ (బి) హఫీజ్ 23; జడేజా (నాటౌట్) 52; అశ్విన్ (స్టంప్డ్) అక్మల్ (బి) అజ్మల్ 9; షమీ (సి) మఖ్సూద్ (బి) అజ్మల్ 0; మిశ్రా (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (50 ఓవర్లలో 8 వికెట్లకు) 245.
 
 వికెట్ల పతనం: 1-18; 2-56; 3-92; 4-103; 5-155; 6-214; 7-237; 8-237.
 బౌలింగ్: హఫీజ్ 9-0-38-2; గుల్ 9-0-60-1; జునేద్ ఖాన్ 7-0-44-0; ఆఫ్రిది 8-0-38-0; తల్హా 7-1-22-2; అజ్మల్ 10-0-40-3.
 
 పాకిస్థాన్ ఇన్నింగ్స్: షర్జీల్ (బి) అశ్విన్ 25; షెహజాద్ (సి) అశ్విన్ (బి) మిశ్రా 42; హఫీజ్ (సి) భువనేశ్వర్ (బి) అశ్విన్ 75; మిస్బా (రనౌట్) 1; అక్మల్ (సి) జడేజా (బి) మిశ్రా 4; మఖ్సూద్ (రనౌట్) 38; ఆఫ్రిది (నాటౌట్) 34; గుల్ (సి) రహానే (బి) భువనేశ్వర్ 12; తల్హా (సి) జడేజా (బి) భువనేశ్వర్ 0; జునేద్ (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 17; మొత్తం (49.4 ఓవర్లలో 9 వికెట్లకు) 249.
 
 వికెట్ల పతనం: 1-71; 2-93; 3-96; 4-113; 5-200; 6-203; 7-235; 8-236; 9-236.
 బౌలింగ్: భువనేశ్వర్ 10-0-56-2; షమీ 10-0-49-0; అశ్విన్ 9.4-0-44-3; జడేజా 10-1-61-0; మిశ్రా 10-0-28-2.
 
 భారత్‌కు కష్టమే!
 పాక్ చేతిలో ఓటమితో ఆసియాకప్‌లో భారత్ ఫైనల్ చేరడం దాదాపు అసాధ్యంగా మారింది. గణాంకాల పరంగా కొంత అవకాశం కనిపిస్తున్నా, వాస్తవానికి అది అంత సులభం కాదు. టీమిండియా తుది పోరుకు అర్హత సాధించాలంటే...
 
 ఈనెల 5న అఫ్ఘానిస్థాన్‌తో జరిగే మ్యాచ్‌లో భారత్ బోనస్ పాయింట్‌తో గెలవాలి. శ్రీలంక తమ మిగిలిన రెండు మ్యాచ్‌లు (అఫ్ఘాన్, బంగ్లాలతో) ఓడిపోవాలి.బంగ్లాదేశ్‌కు పాకిస్థాన్ బోనస్ పాయింట్ కోల్పోరాదు.
 
 ‘ఓ మోస్తరు లక్ష్యమే అయినా మా కుర్రాళ్లు బాగా పోరాడారు. మిశ్రా బంతిని బాగా టర్న్ చేస్తుండటంతో చివరి వరకు కొనసాగించా. డెత్ ఓవర్లలో అశ్విన్‌పై నమ్మకం పెట్టొచ్చు. కాకపోతే ఈసారి అది ఫలించలేదు. ఓవరాల్‌గా మేం 20, 30 పరుగులు తక్కువ చేశాం. గత రెండు మ్యాచ్‌ల్లో మా ఆటతీరు సంతృప్తినిచ్చింది. ముఖ్యంగా బౌలర్ల ప్రదర్శన బాగుంది’.  
 -విరాట్ కోహ్లి (భారత కెప్టెన్)
 
 32 భారత్ తరఫున 100 వన్డేలు ఆడిన 32వ ప్లేయర్‌గా జడేజా గుర్తింపు పొందాడు.
 
 2 భారత్‌పై పాక్ వికెట్ తేడాతో నెగ్గడం ఇది రెండోసారి
 
 50 భారత్‌పై ఆఫ్రిది సిక్సర్ల సంఖ్య. లంకపై ఆఫ్రిది(63), పాక్‌పై జయసూర్య (53) మాత్రమే వన్డేల్లో ఒక జట్టుపై 50కి పైగా సిక్సర్లు కొట్టారు.
 

Advertisement
Advertisement