పవార్ సలహాతోనే బిడ్ వేశాను | Sakshi
Sakshi News home page

పవార్ సలహాతోనే బిడ్ వేశాను

Published Tue, Dec 2 2014 12:22 AM

పవార్ సలహాతోనే బిడ్ వేశాను

శ్రీనివాసన్ వ్యాఖ్య
న్యూఢిల్లీ / చెన్నై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీని కొనుగోలు చేయడంలో తనకెలాంటి దురుద్దేశాలు లేవని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) చైర్మన్ ఎన్.శ్రీనివాసన్ స్పష్టం చేశారు. అప్పటి బీసీసీఐ అధ్యక్షుడు శరద్ పవార్ సలహా మేరకే ముందుకెళ్లానని ఆయన తెలిపారు. తననో ప్రైవేట్ వ్యక్తిగా భావించి బిడ్ వేయమని పవార్ అనుమతించారని గుర్తుచేశారు. చెన్నైలో జరిగిన ఐసీసీ ఈవెంట్‌లో పాల్గొన్న శ్రీని విలేకరుల ప్రశ్నలకు సమాధానమిచ్చారు.

ఈ సందర్భంగా ఇండియా సిమెంట్స్‌లో భారత క్రికెట్ జట్టు కెప్టెన్ ఎంఎస్ ధోని పాత్రపై వ్యాఖ్యానించేందుకు ఆయన నిరాకరించారు. ధోనిని రాజీనామా చేయాలని అడిగారా? అన్న ప్రశ్నకు శ్రీనివాసన్ స్పందిస్తూ.. ‘నేనెందుకు ధోనిని రాజీనామా చేయమని అడగాలి? ఇండియా సిమెంట్స్‌లో అతడి పాత్ర గురించి మీకెందుకు చెప్పాలి. అలాగే ఫిక్సింగ్ ఉదంతంతో భారత క్రికెట్‌కు వచ్చిన ముప్పేమీ లేదు’ అని తేల్చి చెప్పారు. స్పాట్ ఫిక్సింగ్ విచారణ కోర్టు పరిధిలో ఉండడంతో ఆ విషయంపై తానేమీ మాట్లాడనని చెప్పారు.
 
సుప్రీం విచారణ 8కి వాయిదా
జస్టిస్ ముకుల్ ముద్గల్ కమిటీ నివేదికపై సోమవారం మరోసారి సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. ఐపీఎల్‌లో బెట్టింగ్‌కు పాల్పడినట్టు తెలిసిన వెంటనే గురునాథ్ మెయ్యప్పన్, రాజ్‌కుంద్రాలపై బీసీసీఐ ఫిర్యాదు చేసిందని శ్రీనివాసన్ తరఫు న్యాయవాది కపిల్ సిబల్ కోర్టుకు తెలిపారు. అలాగే పరస్పర విరుద్ధ ప్రయోజనాలకు సంబంధించి ముకుల్ ముద్గల్ కమిటీ లేక బాంబే హైకోర్టు కూడా శ్రీనివాసన్‌కు వ్యతిరేకంగా ఏమీ చెప్పలేదని ఆయన గుర్తుచేశారు.

శ్రీనిని బోర్డు పదవి నుంచి తొలగించాలనే ఏకైక లక్ష్యం ప్రత్యర్థికి కనిపిస్తోందని వాదించారు. అయితే ఈ విషయంలో నిరూపించుకోవాల్సింది శ్రీనివాసనేనని జస్టిస్ టీఎస్ ఠాకూర్, కలీఫుల్లాలతో కూడి బెంచ్ వ్యాఖ్యానించింది.  అయితే అరుణ్ జైట్లీ సూచనల మేరకు ఫిక్సింగ్, బెట్టింగ్ వివాదంపై బీసీసీఐ ప్యానెల్ ఏర్పాటైందని పదేపదే సిబల్ పేర్కొనడంపై కోర్టు ఘాటుగా స్పందించింది. కోర్టులో లేని వ్యక్తి గురించి, ఈ కేసుకు సంబంధం లేని వ్యక్తి గురించి అదే పనిగా మాట్లాడటం సరికాదని తెలిపింది. శ్రీనివాసన్ పరస్పర విరుద్ధ ప్రయోజనాలకు సంబంధించి మాత్రమే ఈరోజు (సోమవారం) విచారణ జరుగుతుందని పేర్కొంది. విచారణను ఈనెల 8కి వాయిదా వేసింది.

Advertisement
Advertisement