రెండో పరీక్షా తప్పాడు! | Sakshi
Sakshi News home page

రెండో పరీక్షా తప్పాడు!

Published Thu, Jul 28 2016 12:40 AM

రెండో పరీక్షా తప్పాడు! - Sakshi

డోపింగ్ టెస్టులో మళ్లీ నర్సింగ్ విఫలం
 పోలీసు విచారణ ప్రారంభం
‘నాడా’ విచారణకు హాజరు

 
 
న్యూఢిల్లీ: డోపింగ్ ఆరోపణలతో రియో ఒలింపిక్స్‌కు దూరమైన రెజ్లర్ నర్సింగ్ యాదవ్‌ను రెండో అవకాశం కూడా ఆదుకోలేకపోయింది. జూలై 5న హాజరైన డ్రగ్ పరీక్షలో కూడా నర్సింగ్ విఫలమైనట్లు సమాచారం. ‘పది రోజుల తర్వాత హాజరైన డోపింగ్ టెస్టులో కూడా మార్పు ఏమీ లేదు. అతను ఇచ్చిన రెండు శాంపిల్స్‌లో కూడా అవే నిషేధిత ఉత్ప్రేరకం మెథడినోన్ లక్షణాలు కనిపించాయి’ అని భారత రెజ్లింగ్ సమాఖ్య ప్రతినిధి ఒకరు వెల్లడించారు. జూన్ 25న తొలి పరీక్షలో విఫలం కావడంతో నర్సింగ్‌పై ఇప్పటికే తాత్కాలిక నిషేధం విధించడంతో పాటు అతని స్థానంలో ఒలింపిక్స్‌కు ప్రవీణ్ రాణాను ఎంపిక చేశారు.

వారు చేసి ఉండవచ్చు: తనపై కుట్ర జరిగిందంటూ నర్సింగ్ యాదవ్ చేసిన ఫిర్యాదుపై బుధవారం పోలీస్ విచారణ మొదలైంది. మాజీ రెజ్లింగ్ సహచరులు ఇద్దరు కుట్రకు కారణమంటూ నర్సింగ్ సోనేపట్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ‘నన్ను కావాలనే ఇరికించారంటూ మొదటినుంచీ చెబుతున్నాను. నాపై ఆరోపణలు రుజువు కాకపోతే నేనే రియో వెళతాను. నా ఆహారంలో ఏదో కలిపేందుకు ప్రయత్నించిన వారిని నేను గుర్తు పట్టాను. ఇవే వివరాలు పోలీసులకు అందించాను’ అని నర్సింగ్ చెప్పాడు. తాము అనుమానిస్తున్న ఆ ఇద్దరు రెజ్లర్లు ఛత్రశాల్ (సుశీల్ శిక్షణా కేంద్రం)కు చెందిన జితేశ్, సుమీత్ అని వెల్లడించిన సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్... మరిన్ని విషయాలు బయటపడాలంటే సీబీఐ విచారణ చేయాలన్న నర్సింగ్ డిమాండ్‌కు మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు. మరోవైపు డోపింగ్‌తో ప్రపంచం దృష్టిలో పడ్డామని క్రీడా మంత్రి విజయ్ గోయల్ వ్యాఖ్యానించారు. ఈ చర్చకు త్వరలోనే ముగింపు ఇస్తామన్న ఆయన... అప్పటి వరకు ఒకరిని మరొకరు నిందించుకుంటూ పుకార్లు ఆపాలని సూచించారు.

‘నాడా’ ముందు హాజరు: డోపింగ్ ఆరోపణలపై వివరణ ఇచ్చుకునేందుకు నర్సింగ్ యాదవ్ బుధవారం జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (నాడా) ముందు హాజరయ్యాడు. సాయంత్రం 4 గంటలనుంచి దాదాపు మూడు గంటలకు పైగా అతని విచారణ కొనసాగింది. దీనిపై తుది నివేదిక గురువారం వచ్చే అవకాశం ఉంది. మరో వైపు నర్సింగ్ తల్లిదండ్రులు, మిత్రులు తమవాడికి న్యాయం చేయాలంటూ వారణాసి సమీపంలోని అచ్‌గరా గ్రామంలో ధర్నా నిర్వహించారు. వారణాసిలో స్థానికుల మద్దతు తీసుకుంటూ శనివారం ప్రధాని మోది కార్యాలయాన్ని ఘెరావ్ చేయాలని కూడా వారు నిర్ణయించారు.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement