నాదల్‌ నిలిచాడు | Sakshi
Sakshi News home page

నాదల్‌ నిలిచాడు

Published Fri, Jun 8 2018 1:36 AM

Nadal completes fightback to reach 11th French Open semi-final - Sakshi

ఎర్రమట్టిపై ఎదురు లేని రారాజు రాఫెల్‌ నాదల్‌ 2015 క్వార్టర్‌ ఫైనల్‌ తర్వాత ఫ్రెంచ్‌ ఓపెన్‌లో ఒక్క సెట్‌ కూడా ఓడిపోలేదు. వరుసగా 37 సెట్‌ల పాటు ప్రత్యర్థికి తలవంచకుండా వరుస విజయాలు సాధించాడు. అలాంటిది అర్జెంటీనా కుర్రాడు డీగో ష్వార్ట్‌జ్‌మన్‌ క్వార్టర్‌ ఫైనల్లో నాదల్‌పై తొలి సెట్‌ గెలిచి షాక్‌కు గురి చేశాడు. రెండో సెట్‌లో కూడా ఒక దశలో 3–2తో ముందంజ వేసి సంచలనం సృష్టిస్తాడా అనిపించాడు. కానీ స్పెయిన్‌ బుల్‌ తన అసలు సత్తాను ప్రదర్శించి ఆ తర్వాత చెలరేగిపోయాడు. 11వ టైటిల్‌ వేటలో సెమీస్‌లోకి అడుగు పెట్టాడు.  

పారిస్‌:  వర్షం కారణంగా ఆగిపోయి గురువారం కొనసాగిన క్వార్టర్‌ ఫైనల్లో నాదల్‌ విజయం సాధించి ఫ్రెంచ్‌ ఓపెన్‌ సెమీ ఫైనల్లోకి అడుగు పెట్టాడు. 3 గంటల 42 నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్‌లో నాదల్‌ 4–6, 6–3, 6–2, 6–2తో ష్వార్ట్‌జ్‌మన్‌ను చిత్తు చేశాడు. బుధవారం రెండో సెట్‌లో 5–3తో ఆధిక్యంలో ఉన్న నాదల్‌ చకచకా రెండు గేమ్‌లు గెలుచుకొని సెట్‌ సాధించాడు. ఆ తర్వాత మూడో సెట్‌నుంచి అతనికి తిరుగు లేకుండా పోయింది. చక్కటి డ్రాప్‌ షాట్లతో రెండు సార్లు ప్రత్యర్థి సర్వీస్‌ను బ్రేక్‌ చేసిన నాదల్‌ 4–1తో దూసుకుపోయాడు. ఆ తర్వాత ష్వార్ట్‌జ్‌మన్‌ తన సర్వీస్‌ నిలబెట్టుకున్నా... మరుసటి గేమ్‌ నాదల్‌ ఖాతాలో చేరింది. రెండో సెట్‌లో నాలుగు సార్లు బ్రేక్‌ పాయింట్‌ కాపాడుకున్న వరల్డ్‌ నంబర్‌వన్‌ను సుదీర్ఘంగా సాగిన ఎనిమిదో గేమ్‌లో అర్జెంటీనా కుర్రాడు నిలువరించలేకపోయాడు. చివరి సెట్‌లో కూడా ఒక దశలో ష్వార్ట్‌జ్‌మన్‌ తీవ్రంగా పోరాడినా నాదల్‌ దూకుడు ముందు అది సరిపోలేదు. పురుషుల విభాగంలో ఒకే గ్రాండ్‌స్లామ్‌ టోర్నీలో కనీసం 11 సార్లు సెమీస్‌ చేరిన మూడో ఆటగాడు నాదల్‌. గతంలో ఫెడరర్, కానర్స్‌ ఈ ఘనత సాధించారు. మరో క్వార్టర్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో ఐదో సీడ్‌ జువాన్‌ డెల్‌పొట్రో (అర్జెంటీనా) 7–6, 5–7, 6–3, 7–5తో మూడో సీడ్‌ మారిన్‌ సిలిచ్‌ (క్రొయేషియా)ను ఓడించాడు. 2009 తర్వాత డెల్‌పొట్రో ఫ్రెంచ్‌ ఓపెన్‌లో సెమీస్‌ చేరడం ఇదే మొదటిసారి.

‘వర్షం వల్ల మ్యాచ్‌ ఆగిపోవడం నాకు కొంత వరకు కలిసొచ్చింది. నేను నా వ్యూహాలు మార్చుకునేందుకు అవకాశం కలిగింది. అయితే వర్షమో, సూర్యుడు రావడమో నా విజయానికి కారణం కాదు. నా ఆటను మార్చుకోవడం వల్లే ఈ మ్యాచ్‌ గెలవగలిగాననేది వాస్తవం. మీరు ఒత్తిడిని జయించలేకపోయారంటే ఆటను ఇష్టపడట్లేదనే అర్థం’    – నాదల్‌   

నంబర్‌వన్‌ నిలబెట్టుకున్న హలెప్‌... 
మహిళల సింగిల్స్‌లో సిమోనా హలెప్‌ (రుమేనియా), స్లోన్‌ స్టీఫెన్స్‌ (అమెరికా) తుది పోరుకు సిద్ధమయ్యారు. వీరిద్దరు తమ సెమీ ఫైనల్‌ మ్యాచ్‌లలో సునాయాస విజయాలు సాధించి ఫైనల్లోకి అడుగు పెట్టారు. హలెప్‌ 6–1, 6–4 స్కోరుతో 2016 చాంపియన్‌ గార్బిన్‌ ముగురుజా (స్పెయిన్‌)ను చిత్తు చేసింది. ఫలితంగా తన నంబర్‌వన్‌ ర్యాంక్‌ను కూడా నిలబెట్టుకుంది. హలెప్‌ జోరు ముందు ఏమాత్రం నిలవలేకపోయిన ముగురుజా, ఈ పరాజయంతో వరల్డ్‌ నంబర్‌వన్‌ అయ్యే అవకాశం కూడా చేజార్చుకుంది. హలెప్‌ ఫ్రెంచ్‌ ఓపెన్‌లో ఫైనల్‌ చేరడం ఇది మూడోసారి. గత ఏడాది కూడా ఆమె ఫైనల్లో ఓడింది. మరో సెమీస్‌లో స్టోన్‌ స్టీఫెన్స్‌ (అమెరికా) 6–4, 6–4తో సహచర అమెరికా క్రీడాకారిణి మాడిసన్‌ కీస్‌పై గెలుపొందింది. 77 నిమిషాల్లో సాగిన ఈ పోరులో స్టీఫెన్స్‌ చక్కటి షాట్లతో ప్రత్యర్థిపై ఆధిపత్యం ప్రదర్శించింది. 

Advertisement
Advertisement